విజయవాడ, మే 9,
బెజవాడను ఎండకొదిలేశారు కార్పొరేషన్ అధికారులు. రోడ్ల విస్తరణకో, మరో దానికో ఏలూరు-బందరు రోడ్లుకిరువైపులా ఒక్క పచ్చని చెట్టు కూడా లేకుండా నరికి అవతల పడేశారు. మండు వేసవిలో ఆ రోడ్డులో ఎక్కడ జనానికి కనీసం నీడ కూడా లేని పరిస్థితి. సిగ్నల్స్ వద్ద వాహనాలు నిలపాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు వాహనదారుల బాధలు ఇన్నిన్ని కావు. రోడ్డు పక్కన వ్యాపారాలు చేసుకునే వారి దుస్థితి చెప్పనలవి కాదు. చెట్లను కూల్చేసి, ఎక్కడా షెల్టర్లు లేకుండా చేసి అధికారులు జనాలను వడదెబ్బకు మీ బాధలు మీరు పడండి అంటూ చేతులు దులిపేసుకునే వారు. కనీసం వేసవిలో ప్రభుత్వ పరంగా బెజవాడ నగరంలో ఒక్కటంటే ఒక్క చలివేంద్ర ఏర్పాటు చేసిన దాఖలాలు కూడా లేవు. ఏవో ప్రైవేటు సంస్థలు అక్కడక్కడా ఏర్పాటు చేసిన చలివేంద్రాలే... దాహార్తులకు దిక్కయ్యాయి.పనుల కోసం విజయవాడకు వచ్చేవారు, చిన్న చిన్న వ్యాపారులు, యాచకుల పరిస్థితి దయనీయంగా ఉంది. ఎండకు తాళలేక సోమ్మసిల్లిపోతున్నా పట్టించుకునే నాథుడే లేడు.ఎండల్లో బయటకు రావద్దు, వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉందన్న హెచ్చరికలతోనే కార్పొరేషన్ అధికారులు, ప్రభుత్వం చేతులు దులిపేసుకుంటున్న పరిస్థతి.రానున్న రోజుల్లో ఎండలు మరింత ముదిరే పరిస్థితి ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలను పరిగణనలోనికి తీసుకునైనా ప్రజలను వడదెబ్బ నుంచి రక్షించేందుకు చర్యలు తీసుకోవాలని బెజవాడ జనం కోరుతున్నారు. రోడ్ల పక్కల చలువ పందిళ్ళు వేసి పనులపై బయటకు వచ్చే వారికి నీడ కల్పించాల్సిన అవసరం ఉంది. అలాగే నగరంలో అన్ని ప్రధాన ప్రాంతాలలో ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలి.