YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

రెంటికి చెడ్డ రేవడిలా వాసుపల్లి

రెంటికి చెడ్డ రేవడిలా వాసుపల్లి

విశాఖపట్టణం, మే 9,
వాసుపల్లి గణేష్..పేరుకే తెలుగుదేశం ఎమ్మెల్యే.. కానీ చేసేది వైసీపీ భజన. తెలుగుదేశం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన తరువాత తన కుమారులను వైసీపీలో చేర్చించారు. అక్కడితో ఆగకుండా వైసీపీ అధికార కార్యక్రమాలన్నీ ఈయన తన పర్యవేక్షణలోనే నిర్వహిస్తూ వచ్చారు. అంతేనా తాను గెలిచిన పార్టీ అధినేతపై విమర్శలు చేస్తూ జగన్ దృష్టిలో పడేందుకు శతధా ప్రయత్నాతు చేస్తూ వచ్చారు. విశాఖ సౌత్ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం తరఫున ఎమ్మెల్యేగా విజయం సాధించిన వాసుపల్లి గణేష్ అధికార  వైసీపీతో అంటకాగారు. అయితే ఎంత ప్రయత్నించినా ఆయనకు వైసీపీలో అవమానాలే తప్ప ఇసుమంత గౌరవం కూడా దక్కలేదు. ఇంత కాలం ఓపికగా ఎదురు చూసిన వాసుపల్లి గణేష్.. అక్కసంతా వెళ్లగక్కేశారు.ఇంత కాలం తనను అణగదొక్కింది వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అని చెప్పకనే చెప్పేశారు. అంతే కాదు.. జగన్ మళ్లీ సీఎం కావాలంటే ఎంపీలు కాదనీ, గెలిచే ఎమ్మెల్యేలు కావాలని వైసీపీ అధినేతకు హితవు పలికారు. ఉత్తరాంధ్ర జిల్లాల కోఆర్డినేటర్ గా విజయ సాయిని తప్పించిన తరువాత వాసుపల్లి గణేష్ గొంతు పెగల్చుకున్నారు. ఇంత కాలం తనకు సీఎంతో అప్పాయింట్ మెంట్ కూడా దొరక్కుండా చేసింది విజయసాయేనని కుండబద్దలు కొట్టారు. తనకు వ్యతిరేకంగా కార్పొరేటర్లను ఎగదోసి..పార్టీలో ఒంటరిని చేసిన విజయసాయి లక్ష్యంగా మాటల తూటాలు పేల్చారు. కార్పొరేటర్లు, రాజ్యసభ సభ్యులు ఉన్నంత మాత్రాన సీఎం కాలేరని జగన్ ను ఒక లాంటి హెచ్చరిక చేశారు. గెలిచే సత్తా ఉన్న తనలాంటి వారిని దూరం చేసుకుంటే వచ్చే ఎన్నికల్లో నష్టం తప్పదని సుతిమెత్తటి వార్నింగ్ ఇచ్చారు.పైకి  ఇందంతా  విజయసాయిపై ఉన్న ఆగ్రహాన్ని వెళ్లగక్కినట్లు కనిపిస్తున్నా.. వైసీపీ మాత్రం ఆయనను నమ్మడం లేదు. వాసుపల్లి గణేష్ చూపు ఇప్పుడు తెలుగుదేశంపైకి మళ్లిందని అధికార పార్టీ వర్గాలు అంటున్నాయి. అటు తెలుగుదేశం పార్టీకి దూరమై..ఇటు నమ్మిన వైసీపీలో ఒంటరై వాసుపల్లి గణేష్ పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిగా మారిందని పరిశీలకులు అంటున్నారు.  ఏది ఏమైనా ఎమ్మెల్యేలు గెలిస్తేనే సీఎం అంటూ వాసుపల్లి గణేష్ చేసిన వ్యాఖ్యలు మాత్రం వైసీపీలో ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ తరువాత వైసీపీలో దాదాపు సీనియర్లంతా అలకపాన్ను ఎక్కి మౌనవ్రతం పట్టడంతో ఆ పార్టీలో అసంతృప్తి నివురుగప్పిన నిప్పులా ఉంది. రేపు ఎన్నికల ముందు టికెట్ల పంపిణీ సమయంలో ఇది భగ్గుమనే అవకాశం మెండుగా ఉందని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో వాసుపల్లి  గణేష్ వ్యాఖ్యలు పార్టీలో వాస్తవ పరిస్థితికి అద్దం పట్టాయని అంటున్నారు.

Related Posts