విశాఖపట్టణం మే 9
అసని తుఫాన్ ఆంధ్రప్రదేశ్ వైపునకు దూసుకొస్తున్నది. ఇప్పటికే తీవ్ర తుఫానుగా మారిన అసని.. పశ్చిమమధ్య బంగాళాఖాతం సమీపానికి చేరుకున్నది. ప్రస్తుతం పోర్ట్‌బ్లెయిర్‌కు వాయవ్య దిశగా 570 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నది. రేపు రాత్రికి ఉత్తర కోస్తాంధ్ర, ఒడిశా తీరం సమీపానికి వచ్చే అవకాశం ఉన్నది. దీని ప్రభావంతో కోస్తాంధ్రలో మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు, ఉత్తర కోస్తాంధ్ర, ఒడిశాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ వెల్లడించింది. తుఫాను ప్రభావంతో తీరంలో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నదని, మత్య్సకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది. తీరానికి దగ్గరగా వచ్చిన తర్వాత దిశ మార్చుకుని బెంగాల్ వైపు పయణిస్తుందని తెలిపింది. అయితే అసని తుఫాన్ బెంగాల్ వైపు వెళ్లినా.. ఏపీ తీరంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశమున్నదని వాతావరణ శాఖ వెల్లడించింది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం పార్వతీపురం, విశాఖపట్నం, అల్లూరు సీతారామరాజు, అనకాపల్లి జిల్లాలపై తుఫాన్ ప్రభావం ఉండనుందని అంచనా వేస్తున్నది. ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.