అమరావతి మే 9 ఏపీ రాజకీయం ఓ కీలక మలుపు తిరిగింది. ఇన్ని రోజుల పాటు విమర్శల చుట్టూ తిరిగిన రాజకీయం.. ఇప్పుడు పొత్తుల చుట్టూ తిరుగుతోంది. ఎప్పుడు ఎన్నికలు వస్తాయో.. ఎవ్వరికీ తెలియదు కానీ.. పొత్తుల గురించి మాత్రం ప్రత్యక్షంగానో, పరోక్షంగానో అన్ని పక్షాలూ తమ అభిప్రాయాలను చెప్పేస్తున్నాయి. అయితే ఇవే ఫైనల్ అభిప్రాయాలని మాత్రం చెప్పలేం.టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మొదట ఈ పొత్తుల ప్రస్తావన తీసుకొచ్చారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా అందరూ కలవాల్సి వుందని, అందుకు టీడీపీ నాయకత్వం వహిస్తుందని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా త్యాగాలకు కూడా సిద్ధమేనంటూ నర్మగర్భంగా వ్యాఖ్యానించారు.ఈ వ్యాఖ్యలతో పొత్తుల పర్వం ఏపీలో ప్రారంభమైంది. అయితే.. టీడీపీ అధినేత చంద్రబాబు ఆ మాటలు మాట్లాడగానే.. అటు అధికార పక్షమైన వైసీపీ నుంచి, ప్రతిపక్షాలైన బీజేపీ, జనసేన నుంచి ఝలక్‌లే వచ్చాయి కానీ.. ఎవ్వరూ సానుకూలంగా స్పందించలేదు.ఇదే ఛాన్స్ అనుకొని, వైసీపీ చంద్రబాబుపై తీవ్రంగా విమర్శలు చేసింది. వచ్చే ఎన్నికల్లో గెలుపుపై టీడీపీకి విశ్వాసం లేదని, అందుకే ఇప్పుడే పొత్తుల ప్రస్తావన తీసుకొస్తున్నారని విమర్శించింది. చంద్రబాబు ఒక్కరే వచ్చినా, అందర్నీ కలుపుకొని వచ్చినా, మళ్లీ వైసీపీయే గెలుస్తుందని, చంద్రబాబుకు మళ్లీ ఓటమి ఖాయమని మంత్రులు తెగేసి చెప్పారు.అసలు ప్రతిపక్షాలన్నీ కూడబలుక్కొని వచ్చినా, చంద్రబాబు ఒక్కరే వచ్చినా, తాము మాత్రం మళ్లీ గెలుస్తామని, గెలిచే సీట్ల సంఖ్యలో కూడా ఎలాంటి తేడా వుండదని వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మాదంతా సోలో ఫైట్ అని ప్రకటించారు. మరో 25 సంవత్సరాల పాటు ఏపీకి జగనే సీఎం అని ప్రకటించారు.
మీతో పొత్తూ వద్దు… తెగేసి చెప్పిన బీజేపీ
తాము త్యాగాలకు సిద్ధమంటూ చంద్రబాబు ప్రకటించడంపై ఏపీ బీజేపీ ఘాటు వ్యాఖ్యలే చేసింది. మీ త్యాగాలను చాలా సార్లు గమనించామని, మీకో దండమని ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు రివర్స్ కౌంటర్ ఇచ్చారు. ఇక ఆ త్యాగాలను గమనించడానికి ఏపీ బీజేపీ ఏమాత్రం సంసిద్ధంగా లేదని సోము వీర్రాజు తేల్చి చెప్పారు. త్యాగధనులు ఈ వ్యాఖ్యలను గుర్తుంచుకోవాలని చంద్రబాబుకు చురకలంటించారు.
చంద్రబాబుతో పొత్తు పై.. మాటే దాటేసిన పవన్ కల్యాణ్
టీడీపీ జనసేన మధ్య పొత్తు వుంటుందని ఏపీలో తెగ ప్రచారం నడుస్తోంది. పవన్ టీడీపీ దత్తపుత్రుడు అంటూ అధికార వైసీపీ ఇప్పటికీ దుమ్మెత్తి పోస్తోంది. అయితే.. చంద్రబాబుతో పొత్తు వుంటుందా? అని జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌ను అడిగితే.. మాట దాటేశారు. సూటి సమాధానం అస్సలు ఇవ్వలేదు. అభివృద్ధి కోసం కచ్చితంగా ఓ బలమైన ఆలోచనతో ముందుకు తీసుకెళ్తాం అని చెప్పారు కానీ.. ఎక్కడా నేరుగా సమాధానం మాత్రం చెప్పలేదు.