అమరావతి మే 9
ఎన్నికలు ఎప్పుడొచ్చినా జనసేన సిద్ధంగా ఉంది' ..ఇది జనసేన అధినేత పవన్ కల్యాణ్ తాజాగా చేసిన ప్రకటన. మీడియాతో మాట్లాడుతూ ఆయన చేసిన పై ప్రకటన కాస్త ఆశ్చర్యంగానే ఉంది. ఎన్నికలు ఎప్పుడొచ్చినా జనసేన సిద్ధంగా ఉందంటే అర్ధమేంటో ఎవరికీ అర్ధం కావటంలేదు. పార్టీ మొదలుపెట్టి 8 ఏళ్ళు పూర్తియిన ఇప్పటివరకు పాల్గొన్నది కేవలం ఒక్క ఎన్నికలో మాత్రమే. 2014 ఎన్నికల్లో పాల్గొనకుండా కేవలం బీజేపీ టీడీపీకి మద్దతు మాత్రమే ఇచ్చింది.ఇక 2019 ఎన్నికల్లో దాదాపు 147 సీట్లలో పోటీ చేసిన జనసేన గెలిచింది కేవలం ఒక్కటంటే ఒక్క సీటు మాత్రమే. చాలామంది అభ్యర్థులకు కనీసం డిపాజిట్లు కూడా రాలేదు. అప్పటినుండి ఇప్పటివరకు పార్టీ బలపడిందనేందుకు నిదర్శనాలు కూడా లేవు.
ఆ మధ్య జరిగిన స్ధానిక సంస్ధల ఎన్నికల్లో కూడా చాలా చోట్ల డిపాజిట్లు రాలేదు. అసలు పోటీకి గట్టి అభ్యర్థులు కూడా దొరకలేదు. నిజానికి ఇప్పటికిప్పుడు ఎన్నికలు వచ్చేస్తే 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీచేయటానికి అభ్యర్ధులు కూడా దొరకరన్నది నిజం.
పోటీ చేయటానికి అభ్యర్ధులు ఉండటం వేరు ప్రత్యర్ధి పార్టీల అభ్యర్ధులకు గట్టిపోటీ ఇవ్వటం వేరు. జనసేన నేతల ప్రకారం సుమారు 15 నియోజకవర్గాల్లో మాత్రమే గట్టి అభ్యర్ధులుంటారని అంతర్గతంగా అంచనా వేసుకుంటున్నారట. వాస్తవ పరిస్థితి ఇలాగుంటే పవన్ మాత్రం మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తుండటమే ఆశ్చర్యంగా ఉంది. మిత్రపక్షం బీజేపీతో కలిసి పోటీ చేయటం వల్ల పవన్ కు చాలా లాభం.పొత్తుల్లో ఎలాగూ బీజేపీకి సీట్లు ఇచ్చుకోవాలి కాబట్టి కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను వెతుక్కోక్కర్లేదు. లేకపోతే 175 అసెంబ్లీ అభ్యర్ధులను 25 మంది పార్లమెంటు అభ్యర్ధులను వెతుక్కోవటం పవన్ వల్ల అయ్యే పని కాదు.
పవన్ లో ఎంత అయోమయం కనబడుతోందంటే తాను అధికారాన్ని ఆశించి రాజకీయాల్లోకి రాలేదని చెబుతునే ప్రజలు ఏ అధికారాన్ని ఇచ్చినా స్వీకరిస్తానని చెప్పటమే నిదర్శనం. అధికారంలోకి రావటానికే ముఖ్యమంత్రి అవ్వటానికే తాను పార్టీ పెట్టినట్లు చెబితే ఎవరైనా ఏమన్నా అనుకుంటారని పవన్ అనుకుంటున్నారా ?