మాస్కో మే 9
యుద్ధం ప్రారంభించి రెండు నెలలకు పైగా పూర్తైంది. యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే ఈ యుద్ధం చేయాల్సిన ఆవశ్యకతపై రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ మరోసారి స్పష్టతనిచ్చారు. ఉక్రెయిన్ మాతృభూమిని కాపాడటం కోసమే ఈ యుద్ధం చేస్తున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. సోమవారం రష్యా మాస్కోలో విక్టరీ డే సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘ఉక్రెయిన్‌లో పశ్చిమ దేశాల దురాక్రమణను నివారించేందుకే ఈ ప్రత్యేక సైనిక చర్య నిర్వహించాం. ఉక్రెయిన్ సమగ్రత, భద్రతను కాపాడేందుకు రష్యాలు బలగాలు అక్కడ పోరాడుతున్నాయి’’ అని పుతిన్ అన్నారు.రెండో ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీ ఓటమికి గుర్తుగా రష్యాలో ప్రతి ఏడాది మే 9న ‘Victory Day’ భారీ ఉత్సవాలు నిర్వహిస్తారు. అందులో భాగంగా ఈ ఏడాది కూడా మాస్కోలోని రెడ్ స్క్వేర్ వద్ద పరేడ్‌ను నిర్వహించారు. కాగా, ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని రెండో ప్రపంచ యుద్ధంలో సోవియట్ పోరాటంతో పుతిన్ పోల్చారు. పశ్చిమ దేశాల విధానాల ప్రతిచర్యగానే ఉక్రెయిన్‌లో సైనిక చర్య చేపట్టామని రష్యా ముందు నుంచి చెప్పుకుంటూ వస్తోంది. నియో నాజీలను ఉక్రెయిన్ నుంచి తరిమి కొడతామని రష్యా చెబుతూ వస్తోంది.
పుతిన్ తన ప్రసంగంలో ఎటువంటి భారీ ప్రకటన చేయలేదు. విక్టరీ డే రోజున ఉక్రెయిన్‌పై పూర్తి స్థాయి యుద్ధాన్ని పుతిన్ ప్రకటించనున్నట్లు పశ్చిమ దేశాలు పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే ఈ అంశంపై పుతిన్ ఎటువంటి ప్రకటన చేయలేదు. రష్యా సరిహద్దుల్లో ఉక్రెయిన్, నాటో ప్రమాదకరంగా వ్యవహరిస్తున్నట్లు పుతిన్ మరోసారి ఆరోపించారు. అణ్వాయుధాల సమీకరణపై కీవ్ అడుగులు వేస్తున్నట్లు సమాచారం ఉందని, ఇక నాటో ఆ ప్రయోగాల కోసం తమ దేశ సరిహద్దుల వద్ద భూమిని పరిశీలిస్తున్నట్లు పుతిన్ పేర్కొన్నారు. ఇది తమకు ప్రమాదకరంగా మారిన నేపథ్యంలోనే తాము సైనిక చర్యకు దిగినట్లు పుతిన్ వెల్లడించారు.