కొలంబో మే 9
శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం క్రమంలో శ్రీలంక ప్రధాని మహింద రాజపక్స రాజీనామా చేశారు. ప్రజాందోళనలు తీవ్రం కావడం, విపక్షాల నిరసనలు తీవ్రం కావడంతో ఆయన రాజీనామా చేశారు. రాజీనామా అనంతరం ఆయన పేరిట ప్రకటన వెలువడింది. శ్రీలంక ప్రజలు తీవ్ర భావోద్వేగంతో ఉన్నారని, హింసతో సాధించేది శూన్యమన్నారు. ప్రజలు సంయమనం పాటించాలని, ఆర్ధిక సంక్షోభానికి త్వరలోనే పరిష్కారం లభిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న విపక్షాల డిమాండ్‌కు తలొగ్గి.. ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.ప్రధాని మహింద రాజపక్స ఆయన సోదరుడు, అధ్యక్షుడు గోటబయ రాజపక్స నేతృత్వంలోని ప్రభుత్వంపై ప్రతిపక్షాల నుంచి తీవ్ర ఒత్తిడి పెరుగుతోందని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. మహింద రాజపక్స తన సొంత పార్టీ ‘శ్రీలంక పొదుజన పెరమున’ నుంచి సైతం రాజీనామా చేయాలని ఒత్తిడి కి తలొగ్గి రాజీనామా చేసారు.శ్రీలంకలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రధాని రాజీనామా ఉపకరిస్తుందని అధ్యక్షుడు భావిస్తున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంక్షోభం పరిష్కారమయ్యే వరకు తాతాల్కిక ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నట్లు తెలుస్తున్నది. గోటబయ రాజపక్స అధ్యక్షతన రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ప్రత్యేక కేబినెట్ సమావేశంలో శ్రీలంక ప్రధాని పదవికి రాజీనామా చేసేందుకు మహింద రాజపక్స అంగీకరించినట్లు కొలంబో పేజ్ పేర్కొంది. కావాలంటే రాజీనామా చేస్తానని గతంలో పలుసార్లు మహింద ప్రకటించారు. సమాచారం మేరకు.. శ్రీలంక కేబినెట్ మంత్రులు ప్రసన్న రణతుంగ, నలక గోదాహెవా, రమేశ్ పతిరానా రాజీనామా చేయాలనే మహింద రాజపక్స నిర్ణయాన్ని అంగీకరించారు.