కడప, మే 10,
వైఎస్ కుటుంబానికి పులివెందుల కంచుకోట. అక్కడి నుంచే అప్పట్లో రాజశేఖర్ రెడ్డి, ఇప్పుడు జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆ ప్రాంతంలో చీమ చిటుక్కుమన్నా వెంటనే వైఎస్ కుటుంబానికి తెలిసిపోతుంది. అందుకే తమకు ఎదురునిలిచే నాయకుడు లేడని వైఎస్ కుటుంబం ఇంత కాలం భావించేది. వైసీపీ నేతలు కూడా పులివెందుల తమ నాయకుడికి కంచుకోట అని చెబుతూ ఉంటారు. కానీ అలాంటి చోట వైఎస్ కుటుంబ పునాదులు మెల్ల మెల్లగా కదులుతున్నాయి. ప్రజల్లో మెల్ల మెల్లగా మార్పు మొదలుకావడంతో వైసీపీ నేతల ఆగడాలకు చెక్ పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా సీఎం జగన్ సమీప బంధువును పోలీసులు అరెస్ట్ చేయడంతో ఇది రూఢీ అయినట్లేనని పరిశీలకులు అంటున్నారు. పులివెందులలో ఏం చేసినా తమను అడిగే వారు లేరని వైఎస్ కుటుంబ సభ్యులు భావిస్తారు. అందుకే ఇంత కాలంగా వారి ఆగడాలకు అంతూ పొంతు లేకుండా పోయింది. మరీ ముఖ్యంగా జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ కుటుంబం నుంచి వ్యాపారులకు, కాంట్రాక్టర్లకు వేధింపులు మరింత ఎక్కువ అయ్యాయన్నది స్థానికుల ఆరోపణ. ఇప్పుడు అలాంటి వ్యవహారంలోనే జగన్ సమీప బంధువు చక్రాయిపేట మండల వైసీపీ ఇంచార్జి కొండారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. పులివెందుల - రాయచోటి వెళ్లే రహదారి పనులు చేస్తున్న ఎస్ ఆర్ కే కన్ స్ట్రక్షన్స్ కాంట్రాక్టర్ ను కమీషన్ కోసం బెదిరించాడని కొండారెడ్డిపై కేసు నమోదు అయ్యింది. దానితో పోలీసులు కొండారెడ్డిని అరెస్టు చేశారు. ఏకంగా జగన్ కు సమీప బంధువునే పోలీసులు అరెస్ట్ చేయడంతో నియోజకవర్గంలో కొత్త చర్చ మొదలైంది. అధికార పార్టీ నేత, అందులోనూ జగన్ బంధువునే పోలీసులు కటకటాల్లోకి నెట్టడంతో వైసీపీ నేతలు కూడా పులివెందులలో వైఎస్ కుటుంబ హవాకు బ్రేక్ పడుతోందా అన్న అనుమానాలు ప్రారంభమయ్యాయి. నిజానికి జగన్ 2019 ఎన్నికల్లో గెలిచి సీఎం అయిన తర్వాత నుంచి జగన్ కు, ఆయన కుటుంబీకులకు పులివెందులపై పట్టు సడలడం ప్రారంబమైందనే చెప్పాలి. ముఖ్యంగా గత ఎన్నికలకు ముందు వైఎస్ వివేకానంద రెడ్డి హత్యతో దీనికి బీజం పడందని చెప్పవచ్చు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య, ఆ తరననంతర సంఘటనల్లో పులివెందుల ప్రజలలో వైఎస్ జగన్ పట్ల వ్యతిరేకత ప్రారంభమైందని స్థానికులు చెబుతున్నారు. సొంత బాబాయ్ మర్డర్ కేసు విషయంలోనూ జగన్ ఏ మాత్రం శ్రద్ధ చూపకపోవడం, పైపెచ్చు హత్య ఆరోపణలు ఎదుర్కొటున్న వారిని వెనకేసుకు రావడం, అలాగే సోదరి, తల్లి పట్ల సీఎం అయిన తరువాత జగన్ చూపుతున్న నరాదరణ పులివెందుల ప్రజలలో జగన్ తీరు పట్ల అయిష్టత పెరగడానికి కారణమయ్యాయంటున్నారు. మరోవైపు జగన్ సమీప బంధువులే ప్రజలు, కాంట్రాక్టర్లు, అధికారులను వేధిస్తున్నారనే అపవాదు కూడా ఉంది. ఆ కారణంగానే పులివెందులలో జగన్ పునాదులు కదులుతున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.