విజయవాడ, మే 10,
ఏపీలో రాజకీయం హాట్ హాట్ గా మారింది. ముఖ్యంగా అధికార వైసీపీ ఎమ్మెల్యేల్లో కొన్ని రోజులుగా టెన్షన్ మొదలైందనే ప్రచారం జరుగుతోంది. ఓ వైపు ప్రతిపక్ష టీడీపీ దూకుడుగా ప్రజల్లోకి వెళ్తోంది. చంద్రబాబు నాయుడు సభలకు కూడా జనం పోటెత్తి వస్తున్నారు. దీనికి తోడు ఇటీవల సీఎం జగన్ చేయించిన ఓ సర్వేలో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. చాలా మంది ఎమ్మెల్యేల పనితీరుపై ప్రజల్లో అసంతృప్తి ఉందని ఓ మీటింగ్ లో కుండబద్దలు కొట్టారు. అంతే కాదు.. చాలా మంది ఎమ్మెల్యేలకు కనీసం పాస్ మార్కులు కూడా రాలేదట. జగన్ చేసిన వ్యాఖ్యలతో వైసీపీ నేతల్లో కొత్త చర్చ మొదలైంది. సర్వేలో తక్కువ శాతం వచ్చిన వారి లిస్టులో తమ పేరు ఉందా.? అని ఆరా తీయడం మొదలుపెట్టారట. ఎందుకైనా మంచిదని తమ అనుచరులతో క్షేత్ర స్థాయిలో తమ పరిస్థితి ఎలా ఉందనే లెక్కలు వేసుకుంటున్నారని సమాచారం. అందుకే చాలా మంది నేతలు సైలెంట్ గా తమ పని తాము చేసుకొని పోవాలని డిసైడ్ అయ్యారట. ఇప్పటికే కొంత మంది నేతలు ఎక్కడ తమకు టికెట్ రాదేమో అనే భయంతో ఆందోళన చెందుతున్నారని తెలుస్తోంది. ఇప్పటికే కొంత మంది నేతలు అధినేత జగన్ తీరుపై అసంతృప్తిగా ఉన్నారట. కొన్ని రోజుల క్రితం వరకు తమకు మంత్రి పదవి ఖాయం అని అనుకున్న వారిలో కొంత మందికి బెర్త్ కన్ఫాం కాలేదు. దీనికి తోడు పనితీరు బాగోలేకుంటే టికెట్ కూడా ఇచ్చేది లేదని చెప్పడంతో అయోమయంలో పడిపోయారట. వాస్తవానికి జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలకు పెద్దగా పనేమి ఉండటం లేదు. వారంతా ఉత్సవ విగ్రహాలుగా మాత్రమే మిగిలిపోయారు. ఏ పని జరగాలన్నా తాడేపల్లి నుంచి ఆదేశాలు వస్తేనే అధికారులు పనులు చేసి పెడుతున్నారు. దీంతో చాలా మంది ఎమ్మెల్యేలు ప్రజలకు కాదు కదా.. కనీసం తమ అనుచరుల కోసం కూడా పనులు చేసి పెట్టుకునే పరిస్థితి లేదు. ఇలాంటి సమయంలో తామేమి చేయడం లేదని నిందించడం ఏంటని కొంత మంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. అందుకే వచ్చే ఎన్నికల నాటికి ఎవరికి టికెట్ వస్తుందో, ఎవరికి రాదో అనే టెన్షన్ లో చాలా మంది నేతలు ఉన్నారు. సొంత పార్టీలోనే వర్గపోరుతో ఇబ్బంది పడుతున్న కొంత మంది నేతలు అయితే పక్కపార్టీ వైపు చూస్తున్నారనే ప్రచారం కూడా ఉంది. ఒకవేళ తమకు జగన్ టికెట్ ఇవ్వకపోతే వెంటనే పార్టీ మారిపోవడానికి గ్రౌండ్ వర్క్ కూడా ఇప్పటి నుంచే చేసుకుంటున్నారట. రాబోయే రోజుల్లో వైసీపీ నేతల్లో ఇంకా ఎలాంటి మార్పులు వస్తాయో చూడాలి.