నెల్లూరు, మే 10,
మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ప్రకంపనలు వైసీపీలో ఇంకా తగ్గలేదు. బహిరంగంగా నిరసనలు తెలిపి చల్లబడ్డ వారు చల్లబడగా.. బైటకు ఇసుమంతైనా అసంతృప్తి కనబరచని తాజా మంత్రులు కొందరు తమ మౌనంతో పార్టీ అధినేతను కలవరపెడుతున్నారు. ముఖ్యంగా పదవులలో ఉండగా బూతుల మంత్రులుగా ప్రత్యేక గుర్తింపు పొందిన కొడాలి నాని, విపక్షాలపై ప్రత్యేక శైలిలో విమర్శలతో చెలరేగిపోయే పేర్ని నాని వంటి వారి మౌనం ముందు ముందు ఏ పరిణామాలకు దారి తీస్తుందో అన్న కలవరం వైసీపీలో ప్రస్ఫుటంగా కనిపిస్తున్నది. ముఖ్యంగా జగన్ లో వారి మౌనం కారణంగా అంతర్మథనం మొదలైందని పరిశీలకులు అంటున్నారు. మూడేళ్ల నాడే అంటే మంత్రివర్గ ప్రమాణ స్వీకారం రోజునే రెండున్నరేళ్ల తరువాత కేబినెట్ లో మార్పులు ఉంటాయి అని చెప్పినా ఇప్పుడీ నిరసనలేమిటని ఆయన ఫీలౌతున్నారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ అనగానే.. సీఎం ఏ బాధ్యతలు అప్పగిస్తే వాటిని సంతోషంగా, మనస్ఫూర్తిగా చేస్తామంటూ అందరి కంటే ముందుగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన వారే ఇప్పుడు సైలంట్ అయిపోవడమేమిటని జగన్ ఫీలౌతున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కొడాలి నాని వంటి వారి మౌనం పార్టీలో మున్నెన్నడూ లేని స్తబ్దత కనిపిస్తున్నదని జగన్ భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు అంటున్నాయి. విపక్షంపై మరీ ముఖ్యంగా తెలుగుదేశం అధినేతపై బూతుల పంచాంగంతో విరుచుకుపడే కొడాలి నాని మౌనం.. పార్టీలో పెద్ద చర్చకు దారి తీసింది. సాధారణంగా జగన్ అప్పాయింట్ మెంట్ దొరకడమే కష్టం.. అలాంటిది ఆయనే స్వయంగా తాజా మాజీల మౌనంతో వారిని పిలిపించుకుని మరీ మాట్లాడుతున్నారనీ, వారికి యాక్టివ్ గా ఉంచేందుకు ప్రయత్నస్తున్నారనీ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా కొడాలి బూతుల పంచాంగం వల్లనే పార్టీలో యాక్టివిటీ ఉందని జగన్ భావిస్తున్నట్లుగా కనిపిస్తున్నది. ఆయన మౌనం వహించడంతో మొత్తంగా పార్టీలోనే ఏదో ఇబ్బంది ఉందన్న భావన స్వయంగా జగన్ లోనే వ్యక్తమౌతున్నదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీలో మళ్లీ పూర్వపు దూకుడు, జోరు కనిపించాలంటే తాజా మాజీలు మళ్లీ పూర్వంగా విమర్శల గళం విప్పాల్సిన అవసరం ఉందని జగన్ భావిస్తున్నారు. అందుకే గతంలోలా బుజ్జగింపులకు ప్రభుత్వ సలహాదారు సజ్జలపై ఆధారపడకుండా తానే రంగంలోకి దిగారని పరిశీలకులు అంటున్నారు. కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు మందు వరకూ మంత్రి పదవులు వస్తాయని కొందరు… మంత్రి పదవులు నిలబెట్టుకోవాలని కొందరు తెలుగుదేశం పార్టీపైనా.. ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుపైనా బూతుల పంచాంగం విప్పి మరీ విమర్శలు గుప్పించారు. మంత్రివర్గ విస్తరణ చేసే వరకూ అదే పరిస్థితి కొనసాగింది. తీరా విస్తరణ పూర్తయిన తరువాత.. అదీ పార్టీలోనే ‘ముందస్తు’ యోచన జరుగుతున్న సమయంలో.. తాజా మాజీల గళం మూగబోవడంతో.. వైసీపీ డీలా పడిందన్న భావన జనంలో బలంగా కనిపిస్తున్నది. ఇదే జగన్ ను గాభరా పెడుతోంది. తాజా మాజీలతో స్వయంగా భేటీలు జరుపుతూ, గతంలోలా మాట్లాడాలనీ, అలా మాట్లాడితే పార్టీ మళ్లీ గెలిస్తే మంత్రి పదవులు ఇస్తాననీ హామీలు గుప్పిస్తున్నారని వైసీపీ వర్గాలే చెబుతున్నాయి. అయితే రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితిని అంచనా వేసిన తాజా మాజీలు విపక్షంపై బూతలతో విమర్శలు చేయడానికి జంకుతున్నారనీ, ఇప్పటికే నెగటివ్ ముద్ర పడిన తాము ఇంకా అలాగే ముందుకు సాగితే భవిష్యత్ లో చిక్కులు తప్పవనీ భావిస్తున్నరని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అవంతి వంటి తాజా మాజీలు ఇప్పటికే సొంత గూటికి ( తెలుగుదేశం) చేరేందుకు ప్రయత్నాలు ప్రారంభించారన్న వార్తలు వినవస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో జగన్ మాట విని తాజా మాజీలు గతంలోలా చంద్రబాబుపై దూషణల పర్వానికి తెరతీసు అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయన్నది పరిశీలకుల భావన.