ఒంగోలు, మే 10,
అంతకు ముందు కూడా మరోసారి ఇటువంటి హమీనే ఇచ్చారు. అనుకున్న స్థాయిలో పనులు పూర్తి కాకపోవడంతో ఈసారైనా హామీ నెరవేరుతుందా? లేదా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. మూడోసారీ వాయిదా వేస్తే చంద్రబాబుకూ, మనకూ తేడా ఉండదనే చర్చ వైసిపిలో సాగుతోంది. ఇప్పటికే మార్కాపురం జిల్లా డిమాండ్‌ను ప్రభుత్వం పట్టించుకోలేదు. దీనిపై ఆ ప్రాంత రైతుల్లో వ్యతిరేకత వచ్చింది. ఇప్పుడు వెలుగొండ చర్చకు వస్తోంది. ఎన్నిసార్లు వాయిదా వేస్తారనే విమర్శలు వస్తున్నాయి. దీంతో, ప్రభుత్వం వెలుగొండను ఈ ఏడాది ఎలాగైనా ప్రారంభించేం దుకు ప్రయత్నాలు చేస్తోంది. కొత్తగా వచ్చిన కలెక్టర్ దినేష్‌కుమార్ ఈ ప్రాజెక్టును సందర్శించారు. ఈ ఏడాది ప్రారంభిస్తామని ప్రకటించారు.వెలుగొండకు 1996లో పునాది రాయి పడింది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ నిర్వాసితుల సమస్యలు పరిష్కారం కాలేదు. 2004లో అధికారంలోకి వచ్చాక అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి దీని పనులు ప్రారంభించారు. 2006 నుంచి 2008లోపు నిర్వాసితులను గుర్తించి సామాజిక, ఆర్థిక సర్వే పూర్తి చేశారు. ముంపు గ్రామాలు 11 ఉన్నాయి. ప్యాకేజీలు ఇవ్వలేదు. నిర్వాసితుల్లో చాలామంది చనిపోయారు. వారి పిల్లలు పెద్దవాళ్లయ్యారు. వీరికి పరిహారం కోసం పోరాటాలు సాగాయి. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ ప్యాకేజీ ఇవ్వాలని నిర్ణయించారు. ప్రస్తుతం 7,555 మంది నిర్వాసితులు ఉన్నారు. ఒన్‌టైం సెటిల్‌మెంటు కింద రూ.12.50 లక్షలు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ మొత్తం తీసుకున్న వారికి ఇంటి స్థలం, ఇంటి నిర్మాణ వ్యయం రాదు. నిర్వాసితులను వెంటనే గ్రామాల నుంచి తరలించడానికి ఈ ప్యాకేజీని తెరపైకి తెచ్చారు. 90 శాతం మంది అంగీకరించేలా చేశారు. వాస్తవానికి కాలనీలు ఏర్పాటు చేసి అక్కడ అన్ని సౌకర్యాలూ కల్పించాకే తరలించాలి. మళ్లీ జీవనం సాగేలా చూడాలి. ఇదే పునరావాసం అంటే. దీనికి భిన్నంగా వెలుగొండ నిర్వాసితులను తరలిస్తున్నారు. ప్యాకేజీ పేరుతో డబ్బులు ఇచ్చి పంపుతున్నారు. ఇక ఎక్కడుండాలో వాళ్ల ఇష్టం. ఇల్లు, వాకిళ్లు ఖాళీ చేసిపోవాలి. ఎక్కడో అద్దెలకు ఉండాలి. కొందరు స్థలాలు కోరుకుంటున్నారు. ఒక్క నిర్వాసిత కాలనీ కూడా ఏర్పాటు కాలేదు. రూ.12.50 లక్షలు తీసుకున్న వారికి ఇతర సౌకర్యాలేమీ లేవు. ఇదే భవిష్యత్తులో వారిని శాశ్వత నిర్వాసితులుగా మిగల్చనుంది.7,555 మంది నిర్వాసితుల్లో ఇప్పటివరకూ 115 మందికే ప్యాకేజీ ఇచ్చారు. మిగతా వారికి ఇవ్వాలి. ఇందుకోసం రూ.1,400 కోట్లకుపైగా నిధులు అవసరం. రాష్ట్ర ప్రభుత్వం వెలుగొండకు ఈ ఏడాది బడ్జెట్‌లో రూ.850 కోట్లు మాత్రమే కేటాయించింది. ఇతర పనులను పక్కనబెట్టినా నిర్వాసితులకు చెల్లింపులకు కూడా ఈ నిధులు చాలవు. ప్రస్తుతం వీరంతా డ్యాములోనే ఉన్నారు. గ్రామాలు ఖాళీ చేయలేదు. ఆగస్టులో ఈ ప్రాజెక్టును ప్రారంభించాలని ప్రభుత్వం ఆలోచిస్తున్న నేపథ్యంలో ప్యాకేజీలు ఇచ్చి పంపాలన్నా అవసరమైన మేరకు నిధులను మరో రెండు నెలల్లో ఇస్తేనే నిర్వాసితుల తరలింపు సాధ్యమవుతుంది.ప్రాజెక్టును 1996లో చేపట్టారు. తర్వాత ఎనిమిదేళ్లు వదిలేశారు. 2004లో పనులు ప్రారంభించారు. అప్పట్లో రూ.980 కోట్ల అంచనా వేశారు. పనులు సకాలంలో ఏ ప్రభుత్వం కూడా చేపట్టి పూర్తి చేయలేదు. చంద్రబాబు, రాజశేఖర్‌రెడ్డి, రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి... ఇలా నలుగురు ముఖ్యమంత్రులు దీన్ని పూర్తి చేయలేకపోయారు. ఇప్పుడు సిఎం జగన్ హయాంలో పూర్తి చేస్తారా? లేదా? అన్నదే చర్చ. 2020 నాటికి దీని నిర్మాణ వ్యయం రూ.8,440 కోట్లకు చేరింది. ఇప్పటికే రూ.6 వేల కోట్లు వెచ్చించారు. నిర్మాణ పనులు 80 శాతం పూర్తయ్యాయి. రెండో సొరంగం, హెడ్ రెగ్యులేటర్ పనులు పూర్తి కావాల్సి ఉంది. అన్నిటికన్నా నిర్వాసితులకు ప్యాకేజీలు కీలకం. ఇవేవీ పూర్తి కాకుండానే దీన్ని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.