కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో 104 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించి అతిపెద్ద పార్టీగా అవరించిన బీజేపీ అదే ఊపుతో తెలుగు రాష్ట్రాలపై దృష్టి సారించేందుకు సిద్ధమవుతోంది. ప్రధానంగా వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో 50 అసెంబ్లీ స్థానాలను టార్గెట్‌గా పెట్టుకున్న బీజేపీకి టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ చుక్కలు చూపించడం పక్కా అని పలువురు నాయకులు అంటున్నారు. ఇదే సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబును తట్టుకోవడం ఏపీలో ఏమాత్రమూ పట్టులేని బీజేపీ అసాధ్యమనే విషయం కూడా ఆ పార్టీ నేతలకు తెలుసు. తెలంగాణలో 2014 ఎన్నికల్లో అమిత్‌షా వ్యూహాలు పనిచేయకపోవడంలో వచ్చే ఎన్నికలకు వ్యూహం మార్చేందుకు బీజేపీ సన్నద్ధమవుతోంది. రాష్ట్ర నాయకత్వం ఇచ్చే నివేదికల ఆధారంగా ఎన్నికల వ్యూహాలు రచించిన పార్టీ అగ్రనేతలు ఈసారి మాత్రం భిన్నంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. కర్ణాటకలో ఉన్న పరిస్థితులకు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితులకు ఏమైనా సంబంధం ఉందా..? అంటే మాత్రం ఎందులోనూ పోలికలేదని పలువురు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ ఉద్ధండులను ఎదుర్కోవడం అంత సులువు కాదనే విషయం 2014 అసెంబ్లీ ఎన్నికల్లోనే బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాకు తెలిసొచ్చింది.పార్టీకి చెందిన కీలక నేతలు రాంమాధవ్, మంగళ్‌పాండే, నరేంద్రసింగ్ తోమర్‌లను రంగంలోకి దింపుతున్నట్టు సమాచారం. రాంమాధవ్‌కు రాష్ట్రంలో ఐదు పార్లమెంటు స్థానాలు, వాటి పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల బాధ్యతను అప్పగించనున్నట్లు తెలుస్తోంది. మిగతా ఇద్దరు నేతలకు నాలుగు చొప్పున పార్లమెంటు, వాటి పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలను అప్పగించే అవకాశాలు ఉన్నాయనీ ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.ఇక ఆంధ్రప్రదేశ్‌లో కూడా బీజేపీ పుంజుకోవడం, అధికారంలోకి రావడం అంతసులువుకాదు. కర్ణాటకతో పోల్చితే ఏపీలోనూ భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి. గత ఎన్నికల్లో టీడీపీతో బీజేపీ పొత్తు పెట్టుకోవడం వల్లనే ఆ పార్టీ కొన్ని సీట్లు గెలుచుకుని, ఉనికిని చాటుకోగలిగిందని పలువురు నాయకులు చెబుతున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదనీ బీజేపీ చెప్పిన తర్వాత కేంద్రం నుంచి, ఎన్డీయే నుంచి టీడీపీ బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత బీజేపీ, టీడీపీ మధ్య పచ్చగడ్డివేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్నాయి. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోసం చేసిన బీజేపీతో వైసీపీ లాలూచీ రాజకీయాలకు పాల్పడుతోందనే విషయాన్ని ప్రజల్లోకి చంద్రబాబు బలంగా తీసుకెళ్లారు. దీంతో వచ్చే ఎన్నికల్లో వైసీపీతో పొత్తుపెట్టుకుని టీడీపీని ఓడించాలని చూస్తున్నబీజేపీ ఆటలకు ఆదిలోనే చంద్రబాబు అడ్డుకట్ట వేసేందుకు వ్యూహాలు రచిస్తున్నారు.తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ నేతగా, తెలంగాణ ముఖ్యమంత్రిగా ఇక్కడి ప్రజల నాడి తెలియడమేకాదు.. దాని ఎప్పుడు.. ఎక్కడ.. ఎలా వాడాలో.. వాడుకోవాలో సీఎం కేసీఆర్‌కు తెలిసినంతగా మరెవ్వరికీ తెలియదనడంలో అతిశయోక్తి లేదేమో. మరోవిషయం ఏమిటంటే.. కర్ణాటక రాష్ట్రంలో జరిగినట్లు మఠాలు, ప్రత్యేక మతాలు, సామాజికవర్గాల ఆధారంగా రాజకీయాలు ఇక్కడ సాగవని ప్రతీ ఎన్నికల్లో నిరూపితమవుతూనే ఉంది. అంతేగాకుండా తెలంగాణ ప్రజల్లో అభ్యుదయ, వామపక్ష భావజాలం అధికంగా ఉంటుంది. ఈ అంశాలే బీజేపీ ప్రతిబంధకంగా మారుతున్నాయి. వీటన్నింటిపై ఎంతో పట్టున్న కేసీఆర్‌కు తట్టుకుని ముందుకు వెళ్లడమన్నది బీజేపీకి సాధ్యం కాదని పలువురు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. తెలంగాణలో బీజేపీకి క్యాడర్ ఉన్నా.. ఎన్నికల బరిలో నిలిచి, గెలిచే స్థాయిలో లేదన్నది మాత్రం స్పష్టం.