కొలంబో, మే 10,
శ్రీలంకలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. ఆందోళనకారులు రోడ్లపైకి వచ్చి రాజకీయ నాయకులపై దాడులకి పాల్పడుతున్నారు. కురునాగళలోని మహేంద్ర రాజపక్స్ ఇంటిని తగలబెట్టారు. మంత్రి కంచన విజేశేఖరా ఇంటికి నిప్పు పెట్టారు. ఎంపీ అరుండిక ఫెర్నాండో ఇంటిని కూడా కాల్చేశారు. అలాగే ఎంపీ తిస్సాకుతియర్చికి చెందిన షాపింగ్ మాల్ ధ్వంసం చేసి తగలబెట్టారు. కెగల్లు లోని ఎంపీ మహిపాల హెరాట్ ఇంటికి నిప్పుపెట్టారు.ఆందోళనకారులు ఎంపీలు, మంత్రులు ఇళ్లకు నిప్పు పెట్టి ఇంటిముందున్న కార్లని తగులబెడుతున్నారు. పోలీసులు స్టేషన్లని వదిలి ఇళ్ళకి వెళ్లిపోతున్నారు. మరోవైపు హింస చెలరేగిన ప్రాంతాల్లో సైనికులు టియర్ గ్యాస్ ప్రయోగిస్తున్నారు. ఎంపీలు, మంత్రులని రహాస్య ప్రదేశాలకు తరలిస్తున్నారు. అధ్యక్షుడు గోట బయ రాజపక్సే, మాజీ ప్రధాని మహేంద్ర రాజపక్సేని రాత్రికి కొలంబో నుంచి వేరే దేశానికి తరలించే అవకాశాలు ఉన్నాయి. ప్రజలు ఏ నిమిషమైనా అధ్యక్ష భవనాన్ని ముట్టడించే అవకాశం ఉంది. ప్రస్తుతం సైన్యం ఆధీనంలో అధ్యక్ష భవనం ఉంది.దిలా ఉంటే ఆందోళనకారులతో జరిగిన ఘర్షణల్లో అధికార పార్టీ ఎంపీ ఒకరు మరణించారు. కొలంబో రాజధాని వెలుపల నిట్టంబువా ప్రాంతంలో ఆందోళనకారులు భారీ ఎత్తున గుమికూడి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. ఆ సమయంలో ఎంపీ అమరకీర్తి అతుకోరల తన కారులో అక్కడికి వచ్చారు. ఎంపీని చూడగానే ఆగ్రహంతో ఆందోళనకారులు ఆయన కారును చుట్టుముట్టారు. దాంతో ఎంపీ తుపాకీ తీసి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే ఆందోళనకారుల నుంచి తప్పించుకుని సమీపంలోని భవనంలో ఆశ్రయం పొందేందుకు ఎంపీ అమరకీర్తి ప్రయత్నించారు. కానీ కాసేపటి తర్వాత ఆయన శవమై కనిపించారు.