కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు అన్ని రకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన యడ్యూరప్ప తన బలాన్ని నిరూపించుకోవడానికి గవర్నర్ వాజుభాయ్ 15 రోజుల గడువు ఇచ్చారు. అయితే ఈ లోపల తమ ఎమ్మెల్యేలు ఎవరూ బీజేపీకి చిక్కకుండా కాంగ్రెస్, జేడీఎస్ జాగ్రత్త పడుతున్నాయి. దీనిలో భాగంగా వారిని సురక్షితంగా వేరే ప్రాంతంలో ఉంచాలని రెండు రోజుల నుంచి మంతనాలు చేస్తున్నాయి. మొత్తానికి ఇప్పుడు వారిని కొచ్చి పంపిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం బెంగళూరులోని ఈగల్‌టన్ రిసార్ట్స్‌లో ఉన్న ఎమ్మెల్యేలందరినీ అక్కడి నుంచి కొచ్చి (కేరళ)లోని క్రౌన్ ప్లాజా హోటల్‌కు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని ఇరు పార్టీలు గోప్యంగా ఉంచాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. క్రౌన్ ప్లాజా హోటల్లో మొత్తం 100 రూములను కాంగ్రెస్, జేడీఎస్ బుక్ చేసుకున్నాయి. 120 మందికి సరిపడే విధంగా ఈ రూములను బుక్ చేశారట. రెండు చార్టెడ్ విమానాల్లో కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలను కొచ్చికి తరలించారు. అటు నిపుణులు కూడా అక్కడికి చేరుకుని బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుకాకుండా ఎలా వ్యవహరించాలో చర్చించనున్నట్లు సమాచారం. విశాఖపట్నం, హైదరాబాద్, పంజాబ్, ఢిల్లీ ఇలా చాలా ప్రాంతాలను పరిశీలించారు. సుప్రీం కోర్టు నుంచి అనుకూలంగా తీర్పు వస్తుందని భావిస్తున్నారు. రాష్ట్రపతిని కలవడానికి కూడా అనుమతి కోరుతున్నారు. మాకు భద్రత కావాలని అస్సలు అడగం, ఇది వారి బాధ్యత. బీజేపీ అధికారంలోకి వచ్చాక ఎస్పీని బదిలీ చేశారని చెప్పుకొచ్చారు. శివకుమార్ మాటలను బట్టి చూస్తుంటే.. కాంగ్రెస్, జేడీఎస్ ప్రతయ్నాలను అడ్డుకోవడానికి బీజేపీ కూడా గట్టి ప్రయత్నమే చేస్తోంది. ప్రస్తుతం బీజేపీ వద్ద 104 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు మరో 9 మంది అవసరం. ఈ 9 సీట్ల కోసం బీజేపీ చాలా పన్నాగాలే పన్నుతోంది. కొంత మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్, జేడీఎస్ నుంచి లాగాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో తమ ఎమ్మెల్యేలను కాపాడుకునే ప్రయత్నంలో ఈ రెండు పార్టీలు ఉన్నాయి. వాస్తవానికి యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంపై యామావతి నుంచి అఖిలేష్ యాదవ్ వరకు బీజేపీకి వ్యతిరేక వర్గమంతా విమర్శలు గుప్పించింది. తాజాగా డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం.కె.స్టాలిన్ కూడా బీజేపీ నిర్ణయాన్ని తప్పుబట్టారు.