కొలంబో మే 10
ఆర్థిక సంక్షోభంలో కూరుకున్న శ్రీలంకలో ఆందోళనలు తీవ్రమవుతున్నాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు చేపట్టిన నిరసనలు సోమవారం హింసాత్మకంగా మారాయి. ఆ దేశంలోని అధికార పార్టీకి చెందిన ఎంపీల అధికార నివాసాలు, వాహనాలకు ఆందోళనకారులు నిప్పుపెట్టారు. శ్రీలంక ప్రధాని మహింద రాజపక్స సోమవారం రాజీనామా చేశారు. దీంతో ఆయన మద్దతుదారులు నిరసనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసన చేస్తున్న వారిపై దాడులకు పాల్పడ్డారు.దీంతో ఆగ్రహం చెందిన నిరసనకారులు అధికార పార్టీ ఎంపీ సనత్ నిశాంత ఇంటికి నిప్పుపెట్టారు. ఆయన ఇల్లు మంటల్లో పూర్తిగా కాలిపోయింది. అలాగే గాలెలోని మంత్రి రమేష్ పతిరాన, మౌంట్ లావినియాలోని మాజీ మంత్రి జాన్స్టన్ ఫెర్నాండో నివాసాలతోపాటు శ్రీలంక పొదుజన పెరమున రాజకీయ నాయకుల ఇళ్ళు, వాహనాలకు కూడా ఆందోళనకారులు నిప్పు పెట్టారు. దీంతో శ్రీలంక వ్యాప్తంగా కర్ఫ్యూ విధించారు.కాగా, దీనికి ముందు సోమవారం ఉదయం శ్రీలంకలో జరిగిన అల్లర్లలో అధికార పార్టీ ఎంపీ, ఆయన సెక్యూరిటీ అధికారి మరణించారు. నిరసనకారులపై ప్రభుత్వ సెక్యూరిటీ లాఠీలతో విరుచుకుపడింది. ఈ నేపథ్యంలో చెలరేగిన హింసాకాండలో 150 మందికిపైగా గాయపడ్డారు. ఈ పరిణామాల నేపథ్యంలో శ్రీలంక ప్రధాని మహింద రాజపక్స తన పదవికి రాజీనామా చేశారు.