తిరుమల మే 11,
కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవారి ఆలయంలో చోరీ ఘటన కలకలం రేపింది. ఆలయ పరకామణిలో ఓ ఔట్ సోర్సింగ్ ఉద్యోగి చేతివాటం ప్రదర్శించాడు. కరెన్సీ లెక్కింపు మండపంలో నగదును చోరీ చేశాడు. స్వదేశీ కరెన్సీతో పాటు విదేశీ కరెన్సీని కూడా సదరు వ్యక్తి చోరీ చేసినట్లు తెలుస్తోంది. గత కొన్ని నెలలుగా అతడు చోరీకి పాల్పడుతున్నట్టుగా అధికారులు గుర్తించారు. అయితే నిందితుడి చేతివాటం గురించి అతడి సహోద్యోగి ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగు చూసింది. ఈ ఘటనపై ఆలయ విజిలెన్స్ అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. భద్రత కట్టుదిట్టంగా ఉండే పరకామణిలో చోరీ జరగడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయాన్ని గొప్యంగా ఉంచి.. టీటీడీ విజిలెన్స్ బృందం దర్యాప్తు చేస్తోంది. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.మరోవైపు.. ఇంద్రకీలాద్రి దుర్గమ్మ ఆలయ హుండీల లెక్కింపులో సిబ్బంది చేతివాటం ప్రదర్శించారు. నిన్న మహామండపం ఆరో అంతస్థులో అమ్మవారి హుండీల్లోని కానుకల లెక్కింపు కార్యక్రమం జరిగింది. ఈ సమయంలో బంగారు ఆభరణాలను అపహరించేందుకు సిబ్బంది ప్రయత్నించారు. ఎస్పీఎఫ్ తనిఖీల్లో నల్లపూసల చైన్, ఒక ఉంగరం, రెండు గిల్టు ఉంగరాలు, బుట్ట దుద్దులు బయటపడ్డాయి. మహామండపం వద్ద ఉన్న వాష్ రూమ్ లో బంగారాన్ని పోలీసులు గుర్తించారు. అపహరించేందుకు యత్నించిన బంగారం విలువ సుమారు 5 గ్రాములు ఉంటుందని అధికారులు తేల్చారు. వీటి విలువ రూ.16 వేలు ఉంటుందని అంచనా వేశారు.