- దీపికా పదుకొనేపై నిప్పులు చెరిగిన..
- క్షత్రియ మహాసభ అధ్యక్షుడు గజేంద్ర సింగ్
ఇప్పటికే దాదాపు ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను తగులబెడుతూ విధ్వంసానికి పాల్పడుతున్న కర్ణిసేన మరింత ఆగ్రహంతో రగిలిపోతోంది. తమ మనోభావాలు దెబ్బతీసేలా ఉన్న పద్మావత్ చిత్రాన్ని విడుదల చేయాడానికి వీల్లేదంటూ ఆందోళనలు చేస్తున్నా ఆ సినిమా గురువారం విడుదల కావడంతో వారు మరింత రెచ్చిపోతున్నారు. క్షత్రియ మహాసభ అధ్యక్షుడు గజేంద్ర సింగ్ ఈ చిత్రంలో పద్మావత్‌గా నటించిన దీపికా పదుకొనేపై నిప్పులు చెరిగాడు.
'దీపికా పదుకునే చెవులు, ముక్కులు కోసినవారికి క్షత్రియ కమ్యూనిటీ రూ.కోటి బహుమతిగా ఇస్తుంది' అని ఆయన ప్రకటించారు. తన అధికారిక ట్విటర్ పేజీలో ఈ మేరకు సంచలన ఆఫర్ చేశారు. ఇదిలా ఉండగా, పద్మావత్ చిత్రం విడుదల అయినప్పటికీ ఆందోళనలు ఎక్కడా ఆగడం లేదు. పోలీసులు ఎక్కడివారిని అక్కడ నిర్బందంలోకి తీసుకుంటున్నా ఏ మాత్రం వారు వెనక్కి తగ్గడం లేదు. గురువారం దాదాపు అన్ని ప్రాంతాల్లో ఆత్మహత్యా ప్రయత్నాలు కూడా జరగుతున్నాయి. మహిళలు కూడా పెద్ద మొత్తంలో ఈ ఆందోళనల్లో పాలుపంచుకుంటున్నారు. కొంతమంది కత్తులతో రోడ్లపై వీరంగం చేస్తున్నారు. మాల్స్‌పై కూడా దండయాత్రలు చేస్తున్నారు.
ఆందోళనా కారులకు దిగ్విజయ్ సింగ్ మద్దతు ..
పద్మావతి చిత్రానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నవారికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ మద్దతిచ్చారు. ఓ మతాన్నిగాని, కులాన్నిగానీ కించపరిచే ఏ సినిమాలను కూడా అసలు విడుదల కానివ్వొద్దంటూ వ్యాఖ్యానించారు. ఇలాంటి చిత్రాన్ని అసలు తీయకుండా ఉండాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారు. పద్మావత్ చిత్రం తమ మనోభావాలను దెబ్బకొట్టిందంటూ గత కొద్ది రోజులుగా శ్రీ రాజ్‌పుత్ కర్ణిసేన తీవ్ర స్థాయిలో ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే.
సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా లెక్కచేయకుండా వారు హింసాత్మకంగా ఆందోళన చేస్తున్నారు. ఈ సమయంలో దిగ్విజయ్ వారికి మద్దతుగా మాట్లాడటం చర్చనీయాంశం అయింది. అంతేకాదు.. ఈ ఆందోళన మొత్తానికి కూడా ప్రధాని నరేంద్రమోదీ, ఆయన పార్టీ బీజేపీ అని ఆరోపించారు. గుర్గావ్‌లో పాఠశాల బస్సుపై జరిగిన దాడిని గురించి స్పందన తెలియజేస్తూ 'మొత్తం దేశాన్ని బీజేపీ మంటల్లోకి నెడుతోంది' అంటూ తీవ్రంగా విమర్శించారు.