విజయవాడ, మే 11,
ఆంధ్రప్రదేశ్ లో పొత్తు పొడుపుతు ఖాయమని తేలిపోయింది. తెలుగుదేశం, జనసేన పార్టీల మధ్య వచ్చే ఎన్నికలలో అవగాహన తథ్యమని దాదాపు ఖరారైపోయింది. ఇరు పార్టీల అధినేతలూ ఈ విషయంలో ఎలాంటి కన్ఫ్యూజన్ కూ తావు లేకుండా ఒక క్లారిటీ ఇచ్చేశారు. రాష్ట్రంలో వైకాపాను ఓడించేందుకు అందరూ కలిసి రావాలన్న చంద్రబాబు పిలుపుకు జనసేనాని పవన్ కల్యాణ్ సానుకూలంగా స్పందించారు. దీంతో ఈ రెండు పార్టీల మధ్య పొత్తు ఉంటుందని దాదాపుగా ఖరారైంది. అయితే వీరితో పాటు బీజేపీ కలుస్తుందా లేదా అన్న విషయంలో మాత్రం ఇప్పటికీ క్లారిటీ రాలేదు.అయితే చంద్రబాబు కలిసిరావాలన్న పిలుపుపై ఒకింత చర్చ మాత్రం బీజేపీలో ప్రారంభమైనట్లే కనిపిస్తున్నది. చంద్రబాబు పిలుపుపై సోము వీర్రాజు స్పందన ఒకలా..ఇతర నేతల స్పందన ఒకలా ఉంది. సోము వీర్రాజు చంద్రబాబు కలిసి రావాలని ఇచ్చిన పిలుపై స్పందించిన తీరుపై తెలుగుదేశం నాయకులు ఘాటు వ్యాఖ్యలు చేశారు. పొత్తులపై నిర్ణయం తీసుకునేది సోము వీర్రాజు కాదని చెబుతూ ఆయన స్థాయి ఏమిటన్నది తేల్చేసి చిన్నబుచ్చారు.రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులను గమనిస్తున్న వారు మాత్రం వచ్చే ఎన్నికలలో 2014 నాటి సీన్ రిపీట్ అయ్యే అవకాశాలే ఎక్కువ ఉన్నాయని భావిస్తున్నారు. అంటే తెలుగుదేశం, జనసేనలతో పాటు బీజేపీ కూడా కలిసి ఉంటుందని వారి ఉద్దేశం. పైగా ప్రస్తుతం జనసేన, బీజేపీల మధ్య పొత్తు ఉంది. అయితే జనసైనికులు మాత్రం బీజేపీతో పొత్తు పట్ల ఒకింత విముఖంగానే ఉన్నారు. ఆ పార్టీకి రాష్ట్రంలో ఉన్న బలం, పట్టును బట్టి బీజేపీతో పొత్తు వల్ల జనసేనకు ఒరిగేదేమీ లేకపోగా... ఆ పార్టీ భారాన్ని కూడా పవన్ కల్యాణే మోయాల్సి ఉంటుందని జనసైనికులు అంటున్నారు. దీనికి తోడు బీజేపీతో పొత్త వల్ల మైనారిటీలు పార్టీకి దూరమయ్యే పరిస్థితి కూడా ఉందని అంటున్నారు. దీనికి తోడు జనసేన ఊసెత్తకుండా, వచ్చే ఎన్నికలలో విజయం సాధించి రాష్ట్రంలో అధికారం చేపడతామంటూ బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటలను జనసైనికులు తప్పుపడుతున్నారు. పొత్తు జనసేనతోనూ.. కానీ చర్యలు మాత్రం రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీకి అనుకూలంగాను సోము వీర్రాజు వ్యాఖ్యలు ఉన్నాయని వారు విమర్శిస్తున్నారు. అయితే సోము వీర్రాజు వ్యాఖ్యలపై జనసేనాని మాత్రం స్పందించలేదు.మొత్తం మీద రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా ఉండేందుకు సమైక్యంగా ఉండటం అవసరమన్న విషయంలో తెలుగుదేవం, జనసేప పార్టీలలో క్లారిటీ ఉంది. అయితే అటువంటి క్లారిటీ జాతీయ పార్టీ అయిన బీజేపీలో మాత్రం కానరావడం లేదు. రాష్ట్రంలో కనీసం ఒక్క శాతం ఓటు బ్యాంకు అయినా లేని బీజేపీ ఏ ధైర్యంతో, ఎవరి అండతో ఒంటరిగా అధికారం అన్న విశ్వాసాన్ని ప్రదర్శిస్తున్నదో అర్ధం కాదు. అందుకే 2014 సీన్ రిపీట్ అయ్యే అంశంలో అంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీల మధ్య పొత్తు విషయంలో స్పష్టత లేకపోయినా, కమలం పార్టీ కలిసినా కలవకున్నా జనసేన, తెలుగుదేశం పార్టీల మధ్య స్పష్టమైన ఎన్నికల అవగాహన కుదరడం మాత్రం ఖాయమని పరిశీలకులు అంటున్నారు