YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఇంతింతై..వటుడింతై... నారాయణ... విద్యా సంస్థల ప్రస్థానం

ఇంతింతై..వటుడింతై... నారాయణ... విద్యా సంస్థల ప్రస్థానం

నెల్లూరు, హైదరాబాద్, మే 11,
ఆంధ్ర ప్రదేశ్‌లో పదవ తరగతి పేపర్‌ లీకేజ్‌ వ్యవహారం నారాయణ విద్యా సంస్థల యజమాని, మాజీ మంత్రి నారాయణ మెడకు చుట్టుకుంది. హైదరాబాద్‌లో నారాయణను ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. ఆయనపై ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ ఎగ్జామినేషన్స్‌ – ప్రివెన్షన్‌ ఆఫ్ మాల్‌ప్రాక్టీసెస్‌ అండ్‌ అన్‌ఫెయిర్‌ మీన్స్‌ చట్టంలోని సెక్షన్‌ 5, 8తో పాటు ఐపీసీ సెక్షన్‌ 408 కింద కేసు నమోదు చేశారు. నారాయణను అరెస్ట్‌ చేయడంతో రాజకీయ రగడ జరుగుతోంది. ఆయనను పోలీసులు చిత్తూరుకు తరలించారు.హైదరాబాద్‌ ఐకియా షోరూమ్‌ దగ్గర నారాయణను అరెస్టు చేసిన విషయం స్థానిక పోలీసులకు సమాచారం లేకపోవడం, మీడియాలో హడావుడి చోటుచేసుకోవడంతో నారాయణ ప్రయాణిస్తున్న కారును తెలంగాణ పోలీసులు కొత్తూరు టోల్‌గేట్‌ సమీపంలో ఆపారు. ఏపీ పోలీసులు FIR కాపీని చూపించడం, దాన్ని తెలంగాణ పోలీసులు ఉన్నతాధికారులకు పంపించడం చకచకా జరిగిపోయాయి. తెలంగాణ పోలీసు ఉన్నతాధికారుల నుంచి ఆమోదం రావడంతో నారాయణను ఏపీ పోలీసులు చిత్తూరుకు తరలించారు.1979 లో ఓ చిన్న అద్దె గదిలో నారాయణ ట్యూషన్ సెంటర్ మొదలైంది. నెల్లూరు హరనాథపురంలో ఏర్పాటైన ఈ ట్యూషన్ సెంటర్ మొదలు కేవలం అయిదుగురు విద్యార్థులతో ప్రారంభమైంది. ఆ సంఖ్య రోజురోజుకీ పెరుగుతూ పోయింది. అతి కష్టమైన, క్లిష్టమైన లెక్కల్ని విద్యార్థులకు సులువుగా అర్ధమయ్యేలా చెప్పేందుకు నారాయణ చేసిన కృషి వృధాగా పోలేదు. నారాయణ ట్యూషన్ సెంటర్లో గణితం భలే చెబుతున్నారన్న విషయం ఆ నోటా ఈ నోటా పాకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతా తెలిసిపోయింది. దీంతో, ఈ సెంటర్ లో మాథ్స్ నేర్పించాలని హైదరాబాద్, విశాఖపట్నం నుండి కూడా పిల్లలను తల్లిదండ్రులు తీసుకు రావడం మొదలయ్యింది. దీంతో, గణితంతో పాటూ ఇతర సబ్జెక్ట్స్ కూడా భోదించే ఉపాధ్యాయుల్ని కూడా తన బృందంలో చేర్చుకున్నారు.అలా ఓ చిన్న ట్యూషన్ సెంటర్‌గా మొదలైన ఆ ప్రస్థానం అనతి కాలంలోనే ఓ కోచింగ్ సెంటర్‌గా రూపుదిద్దుకుంది. డాక్టర్ నారాయణ ప్రణాళిక, చిత్తశుద్ధి, కృషితో పాటు బోధనా రంగంలో ఎంచుకున్న వినూత్న పద్దతులు, అద్భుత ఫలితాలు ఇచ్చాయి. నారాయణ కోచింగ్ సెంటర్‌లో చదువుకున్న విద్యార్థులు పోటీ పరీక్షల్లో ఉత్తమ ర్యాంకులు సాధించడం మొదలైంది. ఇంజనీరింగ్ విభాగంలో అయితే నారయణకు పోటీ కూడా లేకుండా పోయింది. ఎంసెట్‌తో పాటు ఐఐటి పోటీ పరీక్షల్లోనూ నారాయణ విద్యార్థులు విజయ దుదుంభి మోగించారు. ఒకప్పుడు ఐఐటి సీటు అంటే తెలుగు విద్యార్థులకు సాధ్యమా అనుకునే పరిస్థితి నుండి ఆ విభాగంలో అత్యధిక స్థానాలు ఇక్కడి విద్యార్థులే సాధించే పరిస్థతి వచ్చింది. ఈ విషయంలో నారాయణ విద్యాసంస్థల పాత్ర ఎంత ఉందో ఆ సంస్థ విద్యార్థుల విజయాలే ఢంకా బజాయించి మరీ చెబుతాయి.అలాగే, వివిధ పోటీ పరీక్షల్లో విద్యార్థులని సన్నద్ధం చేసేందుకు మైక్రో షెడ్యూల్స్ రూపకల్పన చేయడానికి ఆయన ఆద్యుడు. దీంతోపాటు, ఏ పోటీ పరీక్షకు ఎలా సిద్ధం కావాలి అన్నదానిపై నారాయణ నిర్దేశకత్వంలో సంస్థ ఎన్నో ప్రయోగాలు చేసి అద్భుత ఫలితాలు చూపింది. దానికి సాక్ష్యమే ఇప్పుడు ఐఐటీ విద్యాసంస్థల్లో 15 నుండి 20 శాతం దాకా తెలుగు విద్యార్థులు చదువుకోవడం. నారాయణ విద్యాసంస్థ విజయాలతో పాటు అక్కడి క్రమశిక్షణ, బోధనా పద్దతుల గురించి తెలియడంతో విద్యార్థులు సంఖ్య బాగా పెరిగింది.నెల్లూరులో ఓ చిన్న అద్దెగదిలో మొదలైన నారాయణ సంస్థ ఇప్పుడు దేశమంతటా విస్తరించింది. ఓ ప్రతిష్టాత్మకమైన విద్యాసంస్థగా ఆవిర్భవించింది. దాదాపు 21 రాష్ట్రాల్లో 6 లక్షల మందికి పైగా విద్యార్థులు, 60 వేల మంది సిబ్బందితో విద్యాప్రస్థానం సాగిస్తున్నది. నారాయణ విద్యా సంస్థలో చదువుకుంటున్న విద్యార్థులు ఐఐటీ – జేఈఈ, నీట్, బిట్ శాట్, ఏ.ఎఫ్.ఎం.సి, ఎయిమ్స్, జిప్ మర్ వంటి ప్రతిష్టాత్మక పోటీ పరీక్షల్లో రాణిస్తున్నారు.1979లో నెల్లూరులో నారాయణ కోచింగ్ సెంటర్‌గా మొదలైన ఈ సంస్థ రాష్ట్ర స్థాయి ఎంట్రెన్స్ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులకు కోచింగ్ ఇచ్చేది. ప్రారంభించింది మొదలుగా గుర్తింపు పొందిన నారాయణ కోచింగ్ సెంటర్ నారాయణ ఆధ్వర్యంలో 1983 నాటికి పూర్తిస్థాయి విద్యాసంస్థగా అవతరించింది. 1990లో ఉన్నత పాఠశాల ప్రారంభించారు. 1993లో నెల్లూరులో నారాయణ మహిళా కళాశాల పేరిట బాలికల రెసిడెన్సియల్ కాలేజిని స్థాపించారు. 1999లో జూనియర్ కాలేజిని స్థాపించారు. అదే సంవత్సరం నెల్లూరు, హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడల్లో ఐఐటీ-జేఈఈ కోచింగ్ కేంద్రాలను స్థాపించారు.1990ల చివర్లో నారాయణ విద్యాసంస్థ ప్రొఫెషనల్ విద్యారంగంలో అడుగుపెట్టింది. 1998లో నెల్లూరులో 2001లో గూడూరులో ఇంజనీరింగ్ కాలేజీలను స్థాపించారు. 1999లో వైద్య కళాశాలను, 2001లో దంతవైద్య కళాశాలను స్థాపించారు. 2002లో మెడికల్ కాలేజీలో పారామెడికల్ విభాగాన్ని ప్రారంభించారు. అదే సంవత్సరం జూనియర్ కాలేజీలు, ఎంసెట్ కోచింగ్ సెంటర్లను తిరుపతి, కర్నూలు, అనంతపురం, రాజమండ్రి, కాకినాడ పట్టణాల్లో ప్రారంభించారు. ఉత్తర భారత దేశం లో ని వివిధ ప్రాంతాల్లో లో పిఎమ్‌టి, ఐఐటి-జేఈఈ కోచింగ్ సెంటర్ల ఏర్పాటుతో నారాయణ విద్యాసంస్థల నేతృత్వం మరింత బలోపేతమయింది. ఈ సంస్థ 2004-05లో కరెస్పాండెన్స్ విభాగాన్ని, 2007లో అఖిలభారత టెస్ట్ సీరీస్‌ ఆన్‌లైన్ వెర్షన్‌ను ప్రారంభించింది. పదోవ తరగతి ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారాన్ని విద్యా శాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావడంతో రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించింది. గత నెల 27న మొదలైన టెన్త్‌ పేపర్స్‌ వాట్సప్‌ గ్రూప్స్‌లో సర్క్యులేట్‌ అయ్యాయి. దీంతో చిత్తూరు జిల్లా డీఈవో పురుషోత్తం ఇచ్చిన ఫిర్యాదుతో చిత్తూరు వన్‌ టౌన్‌ పోలీసులు ఏప్రిల్‌ 27న కేసు నమోదు చేశారు. పరీక్షల నిర్వహణలో ఎటువంటి తప్పిదాలకు అస్కారం లేకుండా తాము చర్యలు చేపట్టామని, తమ నుంచి పరీక్ష పత్రం లీకేజీ అయ్యే అవకాశం అణువంత కూడా లేదని  పోలీసులకిచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

Related Posts