కొలంబో మే 11
ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న శ్రీలంకలో ప్రధాని మహింద రాజపక్స రాజీనామా అనంతరం రాజకీయ సంక్షోభం మరింత ముదిరింది. స్వాతంత్య్రం అనంతరం తొలిసారిగా దేశంలో ఆర్థిక సంక్షోభం ఎదురవడంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీగా నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ వారంలో పార్లమెంట్ సమావేశాలను ఏర్పాటు చేయాలని మంగళవారం స్పీకర్ మహింద యాపా అబేయవర్ధనే.. అధ్యక్షుడు గోటబయ రాజపక్సను కోరారు.మరో వైపు మహింద రాజపక్సపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం ఆయన నివాసాన్ని, ట్రింకోమలీలోని నౌకాదళ ప్రధాన కార్యాలయాన్ని ఓ గ్రూప్ చుట్టుముట్టింది. ఇదే సమయంలో రాజపక్స కుటుంబం, ఆయన అనుయాయులు దేశం విడిచిపారిపోకుండా అడ్డుకునేందుకు ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులు మంగళవారం కొలంబోలోని బండారునాయకే అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లే రహదారిపై చెక్‌పోస్ట్‌ను ఏర్పాటు చేసినట్లు స్థానిక మీడియా తెలిపింది.
పార్లమెంట్‌ను సమావేశ పరచాలని కోరిన స్పీకర్
అధికార వర్గానికి చెందిన విధేయులు దేశం విడిచి వెళ్లకుండా నిరోధించేందుకు నిరసనకారులు ప్రయత్నిస్తున్నారు. స్పీకర్ మహింద యాపా అబేవర్ధనే మాట్లాడుతూ తాను అధ్యక్షుడు గోటబయ రాజపక్సకు ఫోన్ చేసినట్లు తెలిపారు. దేశంలో ప్రస్తుతం ప్రధానమంత్రి, ప్రభుత్వం లేనందున మే 17న షెడ్యూల్ తేదీ కంటే ముందే మళ్లీ పార్లమెంట్‌ను సమావేశ పరచాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు పార్లమెంట్‌లో ప్రాతినిథ్యం వహిస్తున్న రాజకీయ పార్టీల నేతలతో అధ్యక్షుడు గోటబయ రాజపక్సే భేటీ కానున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.సభా పని తీరుపై చర్చించేందుకు పార్టీ నేతల సమావేశం గురించి తానే స్వయంగా తెలియజేసినట్లు స్పీకర్ అబేవర్ధనే తెలిపారు. సోమవారం, శ్రీలంక ప్రధాన మంత్రి మహింద రాజపక్స తీవ్రమైన ఆర్థిక సంక్షోభం మధ్య రాజీనామా చేశారు. దేశంలోని ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులపై ఆయన మద్దతుదారులు దాడి చేసిన కొన్ని గంటల తర్వాత.. తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న విపక్షాల డిమాండ్‌కు తలొగ్గిన రాజపక్స ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రజల కోసం ఎలాంటి త్యాగానికైనా సిద్ధమని ఇంతకు ముందే ప్రకటించారు. సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని అధ్యక్షుడు గోటబయ రాజపక్సపై ఒత్తిడి పెరిగింది.
మాజీ ప్రధానిని అరెస్ట్ చేయాలని రాజకీయ నేతల డిమాండ్
ప్రభుత్వానికి వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ప్రజలపై దాడికి పాల్పడినందుకు మాజీ ప్రధాని మహింద రాజపక్సను అరెస్టు చేయాలని రాజకీయ నేతలు డిమాండ్ చేశారు. సోమవారం నాటి హింసలో కనీసం ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోగా.. 200 మంది వరకు గాయపడ్డారు. అలాగే పలువురు రాజకీయ నాయకుల ఇండ్లకు నిరసనకారులు నిప్పుపెట్టారు. హింసాకాండపై పోలీస్ చీఫ్ చందన విక్రమరత్నే మాట్లాడుతూ శాంతియుతంగా నిరసన చేస్తున్న నిరసనకారులపై రాజపక్స మద్దతుదారులు దాడి చేయడంపై దర్యాప్తు చేయాల్సిందిగా క్రైమ్ డిపార్ట్‌మెంట్‌ను ఆదేశించినట్లు తెలిపారు.విచారణ కోసం అటార్నీ జనరల్ పోలీస్ చీఫ్‌కు లేఖ కూడా రాశారు. ఇదిలా ఉండగా.. సోమవారం రాత్రి నిరసనకారులు మహింద రాజపక్స టెంపుల్ ట్రీ నివాస ప్రాంగణంలోకి ప్రశించేందుకు యత్నించారు. ఆ తర్వాత ఇంటికి నిప్పుపెట్టారు. ఈ సందర్భంగా జనాన్ని అదుపు చేసేందుకు పోలీసులు టియర్ గ్యాస్‌ను ప్రయోగించారు. మంగళవారం ఉదయం ప్రధాని రాజపక్స కుటుంబం ఇంట్లో నుంచి వెళ్లి ట్రింకోమలీలోని నౌకాదళ ప్రధాన కార్యాలయంలో తలదాచుకున్నట్లు తెలుస్తున్నది. ఆ తర్వాత నిరసనకారులు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. నౌకాదళ కార్యాలయం నుంచి ఆయనను బయటకు పంపాలని డిమాండ్ చేస్తున్నారు.