బాపట్ల
జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కేవలం పదిగజాల స్థలం వివాదం నేపధ్యంలో కొంతమంది వ్యక్తులు ఓ వ్యక్తిపై విచక్షణా రహితంగా దాడిచేయడంతో తీవ్రగాయాలపాలైన ఆ వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇక వివరాల్లోకి వెళితే చీరాల, పేరాల రెడ్డిపాలెంకు చెందిన తులారి సుబ్బారావు ఆర్టీసి ఉద్యోగిపై అదే ప్రాంతానికి చెందిన నామని కృష్ణమోహన్, రజని, అఖిలేష్, వెంకటేష్, నందినిలు కర్రలు, ఇనుపరాడ్లతో విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డారు. దీంతో తీవ్రగాయాలపాలైన సుబ్బారావును 108 ద్వారా చీరాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ సందర్భంగా క్షతగాత్రుని బంధువులు మాట్లాడుతూ వీరు ఐదుగురు మా మామయ్య బస్టాండు సెంటర్ కి వెళ్లి టిఫిన్ తీసుకుని వస్తుండగా దారికాచి అతిదారుణంగా కర్రలు ఇనుపరాడ్లతో దాడిచేశారని, కేవలం పదిగజాల స్థలం విషయమై గత సంవత్సరం డిసెంబర్ నుండి గొడవలు జరుగుతున్నాయని అన్నారు. అప్పటినుండి మేము పైవ్యక్తులపై రెండవ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, గతరాత్రి వీరంతా మా మామయ్యపై దాడికి పాల్పడ్డారని, అడ్డుపడుతున్న స్థానికులపై కూడా దాడికి దిగారని చివరికి మేము డీఎస్పీని కలిసి చెప్పగా ఆయన కూడా ఈ విషయంపై విచారిస్తానని అన్నారని వారు తెలిపారు.