కర్నూలు
ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాంకు చేదు అనుభవం ఎదురైంది. మంత్రి జయరాం కర్నూలు జిల్లా అలూరు మండలం హాత్తిబెళగల్ గ్రామంలో గడప గడపకు వైఎస్సార్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే ఆయనను స్థానికులు అడ్డుకున్నారు. అమ్మ ఒడి లేకున్నా సరే.. రోడ్డు వేయించాలని మంత్రిని స్థానికులు నిలదీశారు. తమకు అమ్మఒడి రాలేదని చెప్పిన కొందరు మహిళలు.. అదిపోయిన తమకు రోడ్లు వేయించాలని కోరారు. అంతేకాకుండా మంత్రి ముందు పలు సమస్యలను ప్రస్తావించారు. త్రాగునీటి సమస్య పరిష్కరించాలని కోరారు. దీంతో మంత్రి వాటిని పరిశీలిస్తానని హామీ ఇచ్చారు. ఇక, రానున్న ఎన్నికలను లక్ష్యంగా పెట్టుకుని వైసీపీ అడుగులు వేస్తుంది. మంత్రులు, వైసీసీ ఎమ్మెల్యేలు ప్రజల్లోకి వెళ్లేలా సీఎం జగన్ ప్రణాళికలు రచించారు. నేటి నుంచి గడప గడపకు వైసీపీకి శ్రీకారం చుట్టారు. ప్రతి ఒక్క ఎమ్మెల్యే తప్పనిసరిగా సచివాలయాల కేంద్రంగా గడప గడపకు వెళ్లాలని పార్టీ అధినేత జగన్ ఆదేశాలు జారీ చేశారు. నెలలో కనీసం 10 సచివాలయాలను సందర్శించాలని చెప్పారు. దీంతో మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పథకాల గురించి వివరించడమే కాకుండా.. అవి అందుతున్నాయా..? లేదా..? అని అడిగి తెలుసుకుంటున్నారు. అయితే కొన్నిచోట్ల మంత్రులు, ఎమ్మెల్యేలకు స్థానికుల నుంచి ప్రశ్నలు ఎదురవుతున్నాయి.