వాజుభాయి వాలా…. నిన్నమొన్నటి దాకా ఈ పేరు ఎవరిదో చాలా మందికి తెలియదు. కర్ణాటక ప్రధమ పౌరుడైన ఆయన గురించి ఆ రాష్ట్రంలోనే చాలామందికి తెలియందంటే ఆశ్చర్యం కలగక మానదు. వాజుభాయికి సంక్షోభ పరిష్కర్తగా పేరుంది. ఎంతటి క్లిష్ట సమస్యను అయినా ఇట్టే పరిష్కరించడంలో దిట్ట అని అనుచరులు, సహచరులు చెబుతుంటారు. 1990ల్లో శంకర్ సింగ్ వాఘేలా తిరుగుబాటు ఫలితంగా కేశూభాయి పటేల్ ప్రభుత్వం పడిపోయింది. ఈ నేపథ్యంలో పార్టీలో ఏర్పడిన సంక్షోభాన్ని పరిష్కరిస్తారన్న నమ్మకంతో ఆయనకు రాష్ట్ర అధ్యక్ష పగ్గాలు పార్టీ అందించింది. అనుకున్నట్లుగానే సంక్షోభాన్ని చక్కదిద్ది పార్టీని కాపాడారు. శాసనసభ స్పీకర్ గా సంక్లిష్టమైన సందర్భాలను తేలిగ్గా అధిగమించారు. అధికార, విపక్షాల వాగ్వాదాల నడుమ సభ గాడి తప్పకుండా నడపడంలో పేరుపొందారు. గంభీర సన్నివేశాలు, వాద, ప్రతివాదనలతో సభ వేడెక్కే తరుణంలో చక్కటి హాస్యంతో సభను తేలిక పరచే వారు. తన సుదీర్ఘ అనుభవంతో రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ సంక్షోభాన్ని చాకచక్యంగా, సమర్థంగా నిర్వహిస్తారని భావిస్తున్నారు. ‘‘ఎన్నికలకు ముందు పొత్తు నైతికం. ఎన్నికల అనంతర పొత్తు అనైతికం’’ అని భావించే వాజూభాయి వాలా తొలుత అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీకి అవకాశమిచ్చారంటున్నారు. మొత్తం మీద వాజూభాయి వాలా ఆషామాషీ వ్యక్తి కాదన్నది ఆయన గత చరిత్ర తెలిసిన వారికి తెలయనది కాదు.కానీ ఇప్పుడు ఒక్కసారి దేశవ్యాప్తంగా వాజూభాయి వాలా పేరు మార్మోగుతోంది. జాతీయ మీడియా ఒక్కసారిగా ఆయనపై దృష్టి సారించింది. ఆయన పుట్టుపూర్వోత్తరాలు, గుణ గణాలు, నేపథ్యం గురించి తెలుసుకునే ప్రయత్నంలో పడ్డాయి. వ్యక్తిత్వాన్ని అంచనావేసే, విశ్లేషించే పనిలో క్షణం తీరికలేకుండాఉన్నాయి. నిబద్ధత గురించి నిగూడార్థాలు తీస్తున్నాయి.వాస్తవానికి వాజూభాయి వాలా ఆషామాషీ నాయకుడేమీ కాదు. ఆయన గురించి తెలుసుకోవాల్సింది చాలానే ఉంది. రాజకీయాల్లో ఆరితేరిన, అనుభవజ్ఞుడైన నాయకుడు. ఆయనకు గల ఆర్ఎస్ఎస్ నేపథ్యం తిరుగులేనిది. గుజరాత్ కు చెందిన వాజూభాయి ప్రస్థానం విలువైనది…విశేషమైనది. అన్నింటికీ మించి ప్రధాని నరేంద్రమోదీకి అత్యంత విశ్వాసపాత్రుడు. ఒక్కమాటలో చెప్పాలంటే నమ్మినబంటు. ఆయన మాటను వాజూభాయి జవదాటరు.ఆర్ఎస్ఎస్ లో చేరడంతో వాలా ప్రస్థానం ప్రారంభమైంది. అనంతరం 1971లో జనసంఘ్ పార్టీలో కీలక నేతగా ఎదిగారు. ఆర్ఎస్ఎస్ లో ఆయన అనుబంధానికి 57 ఏళ్ల చరిత్ర ఉంది. అత్యవసర కాలంలో జైలుకు వెళ్లారు. 80వ దశకంలో రాజకోట్ మేయర్ గా పనిచేశారు. అప్పట్లో నగర ప్రజల నీటి కష్టాలను తీర్చేందుకు రైల్లో నీటిని తెప్పించారు. ఇదీ ప్రజలసమస్యల పరిష్కారంపై ఆయనకు గల నిబద్ధత. 1985లో తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 1990లోబీజేపీ-జనతాదళ్ మంత్రివర్గంలో మంత్రిగా విశేష సేవలందించారు. ప్రజల మన్నలను అందుకున్నారు. 1990 నుంచి 2012 వరకూ మధ్యలో రెండేళ్లు మినహా మంత్రిగా సుదీర్ఘకాలం పనిచేసిన అనుభవం ఆయన సొంతం. మొత్తం ఏడుసార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. నిర్వహించని శాఖ లేదు. ఆర్థిక, రెవెన్యూ, పట్టణాభివృద్ధి, ఇంధనం, పెట్రోలియం వంటి కీలక శాఖల మంత్రిగా వాటిని తీర్చిదిద్దారు.2014లో కర్ణాటక గవర్నర్ గా నియమితులయ్యే ముందు స్పీకర్ గా ఉన్నారు. వాస్తవానికి అప్పట్లో ఆనందీబెన్ పటేల్ స్థానంలో వాజూభాయి వాలా గుజరాత్ ముఖ్యమంత్రి కావాల్సింది. అనూహ్య రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆ పదవి తప్పిపోవడంతో గవర్నర్ గా వచ్చారు. 1996 నుంచి 1998 వరకూ, 2005 నుంచి 2006 వరకూ రెండుసార్లు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా పార్టీని సమన్వయంతో ముందుకు నడిపించారు. రాష్ట్ర ఆర్థిక మంత్రిగా 18 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత ఆయన సొంతం. మంచి ఆర్థికవేత్తగా పేరుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కొణిజేటి రోశయ్య 13 సార్లు ఆర్థికమంత్రి హోదాలో బడ్జెట్ ను ప్రవేశపెట్టారు.ఇక రాజకీయంగా ప్రధాని నరేంద్ర మోదీ నమ్మిన బంటు. రాష్ట్ర రాజకీయాల్లో మోదీకి కళ్లు,చెవులుగా పనిచేసేవారు. మోదీ కోసం ఎంతవరకైనా ముందుకొస్తారన్న పేరుంది. మోదీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఆయనను ఆదుకున్నారన్నారని చెబుతారు. 2001లో మోదీ గుజరాత్ ముఖ్యమంత్రి అయ్యే నాటికి ఆయన కనీసం శాసనసభ్యుడు కూడా కాదు. రాజకీయంగా మోదీకి పెద్ద పట్టుకూడా లేదు. కనీసం ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి అనువైన నియోజకవర్గం కూడా లేదు. కొన్ని ఉన్నప్పటికీ ఆయన కోసం తమ నియోజకవర్గాన్ని వదులుకునేందుకు ఎవరూ ముందుకురాని పరిస్థితి. అటువంటి సంక్లిష్ట సమయంలో నేనున్నానంటూ మోదీకి మద్దతుగా నిలిచారు వాజూభాయి వాలా. అప్పట్లో రాజ్ కోట్ (పశ్చిమ) ఎమ్మెల్యేగా ఉన్న వాజూభాయి ఆ స్థానాన్ని మోదీ కోసం ఖాళీ చేశారు. దీంతో అక్కడి నుంచి ఎన్నికైన మోదీ అసెంబ్లీకి వెళ్లారు. ఆ తర్వాత ఆయనకు ఎదురులేకుండా పోయింది. ముఖ్యమంత్రిగా, ప్రధానిగా తిరుగులేని నాయకుడు అయ్యారు. ఆరోజు తన కోసం త్యాగం చేసిన మిత్రుడిని మోదీ మర్చిపోలేదు. అప్పటి నుంచి వాజూభాయికి ఏదో ఒక పదవిని కట్టబెట్టేవారు. 2014లో తాను ప్రధాని కాగానే నాలుగు నెలల్లో దక్షిణాదిన కీలక రాష్ట్రమైన కర్ణాటకకు గవర్నర్ గా పంపారు.