YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

వివేకా హత్య కేసులో సీబీఐకే బెదిరింపులు

వివేకా హత్య కేసులో సీబీఐకే బెదిరింపులు

కడప మే 12,
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి సొంత బాబాయి.. మాజీ మంత్రి వైయస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు ఓ కొలిక్కి వస్తున్న తరుణంలో.. ఊహించని ట్విస్టులు చేటు చేసుకొంటున్నాయి. దీంతో సీబీఐ అధికారులు తలలు పట్టుకొంటున్నారని సమాచారం. వివేకా హత్య కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులకు దుండగుల నుంచి బెదిరింపులు వస్తున్నట్లు తెలుస్తోంది. కడపలో సీబీఐ అధికారులు ప్రయాణిస్తున్న వాహనాన్ని ఆగంతకులు అడ్డగించి.. ఈ నగరం నుంచి వెళ్లిపోవాలని వారిని హెచ్చరిస్తున్నారట. తమకు వస్తున్న బెదిరింపులపై సీబీఐ అధికారులతోపాటు కారు డ్రైవర్.. స్థానిక చిన్న చౌక్ పోలీసులను ఆశ్రయించి.. ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై వెంటనే స్పందించిన పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారని సమాచారం. అందులోభాగంగా.. సీబీఐ అధికారులు, కారు డ్రైవర్‌ను బెదిరించిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు.. అందులోభాగంగా సీసీ ఫుటేజ్‌లను పోలీసులు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.  వివేకా హత్య కేసు.. దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులు గత కొంత కాలంగా సైలెంట్‌గా ఉంటున్నారు. అయితే గతంలో వారిని గెస్ట్ హౌస్ ఖాళీ చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఒత్తిడి తెచ్చిన సంగతి తెలిసిందే. అలాగే మరోసారి.. సీబీఐ అదికారులపై ఆగంతకుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆ క్రమంలో సీబీఐ అదికారులు హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు. అయితే తాజాగా సీబీఐ అధికారులకే బెదిరింపులు రావడంతో.. కడప జిల్లాలో కలకలం రేగుతోంది. అయితే ఇదంతా అధికార పార్టీకి చెందిన వారే చేస్తున్నారని.. అందుకే పోలీసులు ఏలాంటి చర్యలు తీసుకోవడం లేదనే ఓ టాక్ అయితే తాజాగా జిల్లాలో జోరుగా వైరల్ అవుతోంది. 2019, మార్చి 15న వైయస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. తొలుత వివేకాది గుండెపోటు అంటూ నాటి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ప్రకటించారు. అలాగే సీఎం జగన్‌కు చెందినసొంత మీడియాలో సైతం ఇదే ప్రచారం చేశారు. ఆ తర్వాత వైయస్ వివేకా గుండెపోటుతో మరణించలేదని.. ఆయన దారుణ హత్యకు గురయ్యారంటూ మీడియాలో కథనాలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో  పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆ క్రమంలో అప్పటి టీడీపీ ప్రభుత్వం.. ఈ హత్యపై ప్రత్యేక దర్యాప్తు సంస్థ (సీట్)ను ఏర్పాటు చేసింది. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో వైయస్ జగన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో.. తన తండ్రి హత్య కేసులో అసలు దోషులు ఎవరో తెలుస్తోందని వైయస్ వివేకా కుమార్తె వైయస్ సునీత వెయ్యి కళ్లతో ఎదురు చూశారు. కానీ తన సోదరుడు సీఎం జగన్ ప్రభుత్వంలో సైతం తమకు న్యాయం జరగడం లేదనే విషయం ఆమె మెల్లగా అర్థమైందీ. ఈ నేపథ్యంలో వైయస్ వివేకా భార్యతోపాటు ఆయన కుమార్తె వైయస్ సునీత.. హైకోర్టులో ఫిటిషన్ దాఖలు చేసి.. ఈ హత్య కేసును సీబీఐకు అప్పగించాలని అభ్యర్థించారు. దీంతో ఈ హత్య కేసును సీబీఐకు అప్పగిస్తూ హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.ఆ తర్వాత వివేకా హత్య కేసు.. సీబీఐ దర్యాప్తు చేపట్టినా... విచారణ అంతగా ముందుకు సాగలేదన్నది మాత్రం సుస్పష్టమే. అయితే.. వైయస్ వివేకానందరెడ్డి మాజీ కార్ డ్రైవర్ దస్తగిరి అప్రూవర్‌గా మారి.. ఈ హత్య కేసులో పాత్రధారులు, సూత్రధారులు ఎవరు అన్నది.. అలాగే వివేకా హత్యకు సూపారీ ఎంత ఇచ్చారు.. తదితర అంశాలన్నీ సీబీఐకి దస్తాగిరి క్లియర్ కట్‌గా పూసగుచ్చినట్లు చెప్పేశారు. దాంతో తెలుగు ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడారు. ఈ నేపథ్యంలో ఈ హత్య కేసులో నిందితులు అప్రమత్తమై.. ఈ కేసును పక్క తోవ పట్టించేందుకు పలు పథకాలు తెరపైకీ తీసుకొచ్చారు. ఆ క్రమంలో వివేకా హత్యను దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులపైనే కాకుండా..  వైయస్ వివేకా కుమార్తె సునీత ఆమె భర్త రాజశేఖర్‌రెడ్డిలపై పోలీసు ఉన్నతాధికారుల ఫిర్యాదు చేశారు. దీంతో అసలు ఈ కేసులో ఏం జరుగుతుందో అర్థంకాక ప్రజలంతా తీవ్ర కన్యూఫ్యూజ్‌కు గురయ్యారు. ఆ సమయంలో సీబీఐ అదికారులు సైతం ఢిల్లీకి వెళ్లిపోయి.. ఈ హత్య కేసులో విచారణ జరుగుతున్న తీరు.. చోటు చేసుకుంటున్న పరిణామాలను సైతం సదరు సీబీఐ అధికారులు.. ఆ కార్యాలయంలోని ఉన్నతాధికారులకు విపులీకరించారు. దాంతో ఈ కేసు దర్యాప్తు చేస్తున్న అధికారులకు వారు అభయ హస్తం అందించారని సమాచారం. దీంతో సదరు సీబీఐ అధికారులు.. మళ్లీ కడపకు వచ్చి.. వివేకా హత్య కేసు దర్యాప్తును షూరు చేశారు. ఆ క్రమంలో ఢిల్లీ నుంచి నేరుగా సీబీఐ ఉన్నతాధికారి.. కడప సెంట్రల్ జైలు అతిథి గృహాంలో మకాం వేసి.. దర్యాప్తు చేశారు. అయితే అదే సమయంలో వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డితోపాటు ఆయన తండ్రి భాస్కరరెడ్డికి కూడా నోటిసులు జారీ చేశారని.. కానీ వాటిని వారు తీసుకునేందుకు నిరాకరించినట్లు నాడు మీడియాలో, సోషల్ మీడియాలో వైరల్ అయింది.ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలన్నీ అందరికీ తెలిసినవే. అయితే తాజాగా వివేకా హత్య కేసులో దర్యాప్తు తుది దశకు చేరుకోనుందని భావిస్తున్న తరుణంలో... సీబీఐ అధికారులకు ఆగంతకుల నుంచి బెదిరింపులు రావడం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు.. ఈ కేసు వివేకా కుమార్తె వైయస్ సునీత నివాసం వద్ద కూడా దుండగులు రెక్కీ నిర్వహించారని ఇటీవల వార్తలు వెలువడ్డాయి. దీంతో స్థానికంగా కలకలం రేగుతోంది. అయితే ఇలాంటి తరుణంలో వైయస్ వివేకా హత్య కేసులో దోషులను పట్టుకునేందుకు సీబీఐకు మరింత కాలం పట్టవచ్చునని ఓ టాక్ అయితే కడప జిల్లాలో వైరల్ అవుతోంది.

Related Posts