గాంధీనగర్, మే 12,
పార్టీకి తిరిగి పూర్వవైభవం తీసుకువచ్చేందుకు కాంగ్రెస్ అధిష్టానం దృష్టి సారించింది.మరి కొన్ని నెలల్లో ఎన్నికలు జరబోతున్న గుజరాత్ నుండి ఈ మార్పుకు శ్రీకారం చుట్టాని భావిస్తోంది. ఇందులో భాగంగా ఏఐసీసీ అగ్రనేతలంతా ఆపరేషన్ గుజరాత్ పై ఫోకస్ పెట్టారు. తాజాగా ఆ రాష్ట్రంలో పర్యటించిన రాహుల్ గాంధీ అక్కడి నేతలకు ఓ ఎమ్మెల్యేను చూసి నేర్చుకోవాలని సూచించడం ఆసక్తికరంగా మారింది. అయితే ఆదర్శంగా నిలిచిన సదరు ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీకి చెందిన వాడు కాకపోవడంతో రాజకీయంగా మరింత చర్చనీయాంశం అయింది.వాద్గామ్ నియోజకవర్గం నుండి ప్రాతినిథ్యం వహిస్తున్న ఇండిపెండెంట్ ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానీ పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. ఇటీవల ఆయనపై బీజేపీ సర్కార్ అనుసరిస్తున్న తీరుపై రాజకీయంగా హాట్ టాపిక్ అవుతోంది. నరేంద్ర మోడీ కార్యాలయంలో గాడ్సే భక్తులు ఉన్నారంటూ మేవానీ చేసిన ట్వీట్ తో ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. బెయిల్ పై బయటకు వచ్చినా ఆ వెంటనే మరో కేసులో అరెస్టు చేయడం దుమారం రేపింది. ప్రస్తుతం బెయిల్ పై బయటకు వచ్చిన మేవానీ బీజేపీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. దాహోద్‌లోని పార్టీ ఆదివాసీ సత్యాగ్రహంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ బీజేపీ పై నిర్భయంగా మేవానీ పోరాటం చేసినట్లే గుజరాత్‌లోని గిరిజన యువకులు తమ హక్కుల కోసం పోరాడాలని సూచించారు. బీజేపీ బీజేపీ ప్రభుత్వం మీకు ఏమీ ఇవ్వదు, కానీ మీ నుండి ప్రతిదీ తీసుకుంటుంది. మీ హక్కులను కాలరాస్తుంది అన్నారు. ఈ ఏడాది జరగనున్న ఎన్నికల్లో గుజరాత్‌లోని గిరిజన ప్రాంతమైన పూర్వ పట్టి నుంచి 40 సీట్లు సాధించాలని కాంగ్రెస్ లక్ష్యంగా పెట్టుకుంది. 40 సీట్లలో ఇరవై ఏడు షెడ్యూల్డ్ తెగల అభ్యర్థులకు రిజర్వ్ చేయబడ్డాయి. ఈ నేపథ్యంలో ఓ స్వతంత్ర ఎమ్మెల్యే చేస్తున్న పోరాటాన్ని ఆదర్శంగా తీసుకోవాలని రాహుల్ సూచించడం ఆసక్తికరంగా మారింది.