అమరావతి
వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో మైనర్ బాలిపై జరిగిన అఘాయిత్యంపై రాష్ట్ర మహిళా కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈమేరకు మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వైఎస్ఆర్ జిల్లా ఎస్పీతో గురువారం ఫోన్ లో మాట్లాడి ఘటన వివరాలు తెలుసుకున్నారు. పోలీసు సిబ్బంది చొరవతోనే అత్యాచార ఘటన వెలుగులోకి వచ్చిందని.. బాధితురాలిని విచారించి నేరస్తులను గుర్తించే ప్రక్రియ కొనసాగుతుందని ఎస్పీ అన్బురాజన్ వివరణ ఇచ్చారు. బాధితురాలితో పాటు బాలిక తండ్రి కూడా స్థానికంగా భిక్షాటన చేస్తుంటారని.. ఈ విషయాన్ని పసిగట్టి నేరస్తులు అఘాయిత్యానికి తెగించారని ఎస్పీ చెప్పారు. ఈ విషయంపై వేగవంతంగా దర్యాప్తును పూర్తిచేసి కేసు నిగ్గుతేల్చాలని వాసిరెడ్డి పద్మ ఎస్పీని ఆదేశించారు. నేరానికి పాల్పడిన వారు ఎంతటి వారైనప్పటికీ తక్షణమే అరెస్టు చేయాలన్నారు. అదేవిధంగా బాధిత బాలిక ఆరోగ్యం కుదుటపడేవరకు జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు బాధ్యత తీసుకోవాలని ఆదేశించారు. వైఎస్ఆర్ జిల్లా పర్యవేక్షించే మహిళా కమిషన్ సభ్యులు గజ్జల లక్ష్మిని హుటాహుటిన బాధిత బాలిక వద్దకు పంపారు. ఈ కేసును మహిళా కమిషన్ సూమొటోగా స్వీకరిస్తుందని.. బాధితురాలికి అన్నిరకాలుగా కమిషన్ అండగా ఉంటుందని చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ మీడియాకు స్పష్టం చేశారు.