విశాఖపట్నం
రాష్ట్రం తిరిగి అభివృద్ధి పట్టాలెక్కాలంటే చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి కావడం ఒక్కటే మార్గమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష అన్నారు.విశాఖ జిల్లా కార్యాలయంలో ప్రవాస భారతీయుల మినీమహానాడు కోసం రూపొందించిన పార్టీ పాటల క్యాసెట్ను మరో ప్రధాన కార్యదర్శి మహ్మద్ నజీర్తో కలిసి ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా నిర్వహించే మినీ మహానాడును ఘనంగా జరిపేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.ప్రవాసాంధ్రుల్లో స్ఫూర్తి నింపే పాటలు ఇందులో ఉన్నాయన్నారు. నలభై దేశాలలో ఉన్న పార్టీ ప్రవాసాంధ్రుల కోసం ఈ మినీ మహానాడు జరుగుతుందని, ఇందుకోసం ఎన్ఆర్ఐలు ఎంతో ఉత్సాహంతో ఎదురు చూస్తున్నారని చెప్పారు. మే 14న దక్షిణాఫ్రికా, 20, 21 తేదీల్లో అమెరికాలోని బోస్టన్ నగరంలో జరిగే మినీ మహానాడుల్లో తాను పాల్గొననున్నట్లు శిరీష తెలిపారు. ఎన్ఆర్ఐలకు సభ్యత్వం, జన్మభూమి అభివృద్ధి కోసం వారి సూచనలు, సలహాలు స్వీకరించడం ఈ మినీమహానాడు ఉద్దేశమని చెప్పారు.