కొలంబో మే 12
: శ్రీ లంక మాజీ ప్రధాని మహింద రాజపక్సకు భారీ షాక్ తగిలింది. ఆందోళనకారులకు భయపడి.. ఆయన తన కుటుంబం, అనుచరగణంతో భద్రంగా తలదాచుకున్న విషయం తెలిసిందే. కాస్త అవకాశం దొరికినా దేశం విడిచిపోవాలని చూస్తున్నారంటూ స్థానిక మీడియాలు కథనాలు ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొలంబో కోర్టు గురువారం కీలక ఆదేశాలు జారీ చేసింది. మాజీ ప్రధాని మహింద రాజపక్స, ఆయన తనయుడు నమల్, రాజపక్స మిత్రపక్షాలకు చెందిన సభ్యులను దేశం విడిచి వెళ్లడాన్ని నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు ప్రధాని భవనం టెంపుల్ ట్రీస్ వద్ద శాంతియుతంగా ధర్నా చేపట్టిన నిరసనకారుల మీద జరిగిన దాడులు.. ఆ తర్వాత చెలరేగిన హింస మీద దర్యాప్తు చేపట్టాలని పోలీస్ శాఖను మెజిస్ట్రేట్ ఆదేశించారు.ఇదిలా ఉంటే.. సోమవారం మహింద రాజీనామా ప్రకటన నేపథ్యంలో హైడ్రామా జరిగింది. ఆయన మద్ధతుదారులు.. నిరసనకారుల మీద విరుచుకుపడ్డారు. ఆ తర్వాత హింస చెలరేగింది. ఈ హింసలో ఇప్పటిదాకా తొమ్మిది మంది మరణించగా(అనధికారికంగా ఇంకా ఎక్కువే!).. వందల సంఖ్యలో గాయపడ్డారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే నిరసన, ఆందోళనకారులపై కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు జారీ చేసింది శ్రీ లంక రక్షణ శాఖ. మరోవైపు రాజీనామా హైడ్రామా నడిపిన మహింద రాజపక్స, ఆపై చెలరేగిన హింసతో నిజంగానే రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఎదురైంది. ఆపై కుటుంబం, అనుచర గణంతో నేవీ బేస్‌లో తలదాచుకున్నారాయన. మరోవైపు ఆగ్రహంతో ఊగిపోయిన నిరసనకారులు.. రాజపక్స కుటుంబం, బంధువులు, అనుచరణ గణానికి చెందిన ఇళ్లను తగలబెట్టేస్తున్నారు. మరోవైపు మహీంద, ఆయన మద్దతుదారులు దేశం విడిచిపారిపోకుండా ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేసిన నిరసనకారులు.. ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీలు చేపడుతున్నారు. ఈ తరుణంలో దేశం దాటిపోకుండా కోర్టు నిషేధం విధించడం విశేషం.