న్యూ ఢిల్లీ మే 12
రాజద్రోహ సెక్షన్‌పై కేంద్ర న్యాయ శాఖా మంత్రి కిరణ్ రిజిజు చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం కౌంటర్ ఇచ్చారు. సుప్రీంకు లక్ష్మణ రేఖ గీసే అధికారం కేంద్రానికి లేదని చిదంబరం కౌంటర్ ఇచ్చారు. రాజ్యాంగంలోని 13 వ సెక్షన్‌ను కేంద్ర న్యాయశాఖ మంత్రి చదువుకోవాలని చిదంబరం హితవు పలికారు. ప్రాథమిక హక్కులను హరించేలా ప్రభుత్వాలు చట్టాలను చేయలేవని, అలాంటి చట్టాలను అనుమతించరని చిదంబరం పేర్కొన్నారు.తాము తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకూ రాజద్రోహం నమోదు చేయరాదన్న సుప్రీం వ్యాఖ్యలపై కేంద్రం స్పందించింది. కేంద్ర న్యాయశాఖా మంత్రి కిరణ్ రిజిజు స్పందించారు. సుప్రీం కోర్టు చేసిన సూచనలను తాము గౌరవిస్తామని, సుప్రీంకున్న స్వతంత్రతను కూడా అంతే గౌరవిస్తామన్నారు. అయితే.. లక్ష్మణ రేఖ అంటూ ఒకటి ఉంటుందని, దాన్ని దాటకుండా వుంటే బాగుంటుందన్నారు.తమ అభిప్రాయాలను, ప్రధాని మోదీ అభిప్రాయాలను తాము సుప్రీంకు విన్నవించామని కిరణ్ రిజిజు వెల్లడించారు. సుప్రీం స్వతంత్రతను గౌరవిస్తామని, కానీ.. లక్ష్మణ రేఖ అంటూ ఒకటి ఉంటుందని, దాన్ని అన్ని వ్యవస్థలూ పాటించాలన్నారు. అన్ని వ్యవస్థలూ పరస్పరం గౌరవించుకోవాలన్నారు. అయితే తాము రాజ్యాంగంలోని అన్ని నిబంధనలను, చట్టాలను గౌరవిస్తున్నామన్న విషయాన్ని కచ్చితంగా పరిగణనలోకి తీసుకోవాలని రిజిజు కోరారు.