విశాఖపట్టణం, మే 13,
అనకాపల్లి జిల్లాలో దశాబ్దాలుగా ప్రయాణికుల రాకపోకలకు ఉపయోగపడిన వంతెన ఉన్నట్టుండి కుంగిపోయింది. పిల్లర్ పక్కకు ఒరిగిపోవడంతో పెద్దేరు వంతెన కుంగింది. దీంతో నర్సీపట్నం-చోడవరం మధ్య వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.అనకాపల్లి జిల్లాలో దశాబ్దాల చరిత్ర ఉన్న ఓ వంతెన కుంగిపోయింది. బుచ్చయ్యపేట మండలం వడ్డాది సమీపంలోని పెద్దేరు నదిపై ఉన్న వంతెన బుధవారం రాత్రి 12 గంటల సమయంలో కుంగిపోయింది. మధ్య భాగంలో ఉన్న పిల్లర్ పక్కకు ఒరిగిపోవడంతో... వంతెన ప్రమాదకరంగా మారింది. దీంతో చోడవరం-నర్సీపట్నం మధ్య వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.ఇటీవల కాలంలో పెద్దేరు జలాశయం నుంచి 10 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసినప్పుడు, ఇతర గెడ్డలు కలసి నీరు ఉధృతంగా ప్రవహించినప్పుడు కూడా ఈ వంతెన చెక్కుచెదరలేదు. ఎనో వరదలు, తుఫాన్లను తట్టుకొని నిలబడిన ఈ బ్రిడ్జి మధ్యలో కుంగిపోవడానికి ఈ ప్రాంతంలో జరుగుతున్న ఇసుక తవ్వకాలే కారణమనే ఆరోపణలు ఉన్నాయి.అధిక బరువుతో ఉన్న గ్రానైట్ లారీలు తరచూ బ్రిడ్జిపై నుంచి ప్రయాణించడం కూడా వంతెన దెబ్బతినడానికి కారణమని స్థానికులు చెబుతున్నారు. నర్సీపట్నం వెళ్లే మార్గానికి ఈ వంతెన వడ్డాది ప్రాంత ముఖద్వారం కావడంతో.. చోడవరం నుంచి నర్సీపట్నం, పాడేరు నుంచి రాజమండ్రి వైపు వెళ్లే వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. ప్రస్తుతం ఈ వంతెన పైకి పాదచారులు, టూవీలర్లను మాత్రమే అనుమతిస్తున్నారు.ఈ విషయమై అనకాపల్లి జిల్లా ఆర్ అండ్ బి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రమేష్ మాట్లాడుతూ.. శారదానదిపై తాత్కాలిక వంతెన ఏర్పాటుకు సుమారు నెల రోజులు పడుతుందన్నారు. దీనికి 50-60 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. నదిపై కొత్త బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలనే ప్రతిపాదనలు కూడా ఉన్నాయన్నారు.