YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

రెంటికీ చెడ్డ రేవడిగా వల్లభనేని

రెంటికీ చెడ్డ రేవడిగా వల్లభనేని

విజయవాడ, మే 13,
గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా తయారైంది. గత ఎన్నికల్లో టీడీపీ టిక్కెట్‌పై వంశీ గెలిచినా.. జగన్ పార్టీ అధికారంలోకి రావడంతో.. ఆ పార్టీలోకి వెళ్లితే.. తనకు అందలం దక్కుతుందని ఆయన భావించారు. కానీ అనుకున్నది ఒకటి అయింది మరొకటి. దీంతో తన సీన్ ఇంతలా సితారవుతుందని అనుకోలేదని వల్లభనేని వంశీ మధనపడుతున్నారట. రాష్ట్ర వ్యాప్తంగా   గడప గడపకు వైసీపీ   కార్యక్రమానికి ఆ పార్టీ నేతలు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే.  అయితే ఇది మా పార్టీ ఫ్యామిలీ పండగ.. మేం  మాత్రమే చేసుకుంటామంటూ   ఫ్యాన్ పార్టీ నేతలు దీర్ఘాలు తీస్తూ కండీషన్లు పెట్టి ఈ కార్యక్రమానికి వల్లభనేని వంశీని దూరం పెట్టేశారుట. దీంతో టీడీపీలో గెలిచి.. ఫ్యాన్ పార్టీలోకి జంప్ కొట్టిన వల్లభనేని వంశీకి ఆయన వర్గానికి అనుకోని విధంగా ఎదురు దెబ్బ తగిలినట్లైంది. అంతే కాకుండా    నియోజకవర్గంలో వల్లభనేని వంశీ వ్యతిరేకులు అంటే డాక్టర్ దుట్టా రామచంద్రరావు, యార్లగడ్డ వెంకట్రావ్ తదితరులు ఏక తాటిపైకి వచ్చి.. గడపగడపకూ కార్యక్రమం అంతా తామే అన్నట్లు వ్యవహరిస్తూ.. నియోజకవర్గమంతటా  భారీగా ఫ్లెక్సీలు  ఏర్పాటు చేశారు. దీంతో  చేసేదేమీ లేక వల్లభనేని వంశీ, ఆయన వర్గం నోటిపై వేలేసుకుని మరీ సైలెంట్ అయిపోయారట.  2014 ఎన్నికల తర్వాత చంద్రబాబు అధికారంలో రావడంతో...  ప్రతిపక్షంలోని వైయస్ జగన్ పార్టీ నుంచి వెళ్లిన ఎమ్మెల్యేలకు .. నిధులు ఇచ్చి.. తననూ ప్రోత్సహిస్తారని వల్లభనేని వంశ ఆశించారట.    ఆ క్రమంలో తన  స్నేహితుడు, మాజీ మంత్రి కొడాలి నానితో కలిసి.. టీడీపీకి వ్యతిరేకంగా గట్టిగానే గళమెత్తారు. ఆ క్రమంలో చంద్రబాబుతోపాటు ఆయన భార్య నారా భువనేశ్వరిపై వల్లభనేని వంశీ అనుచిత వ్యాఖ్యలు చేసి.. తానేమి కొడాలి నాని కంటే తక్కువ కాదనట్లు నిరూపించుకొన్నారు. ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలన్నీ   తెలిసినవే. టీడీపీకి తనకు తానుగా దూరమైన వల్లభనేని వంశీని.. ఫ్యాన్ పార్టీ నేతలు మాత్రం కావాలని  దూరంగా పెట్టారట. ఆ క్రమంలోనే ఫ్యాన్ పార్టీలోని వంశీ వ్యతిరేక వర్గం.. ఏకంగా పార్టీలో కీలక నేత విజయసాయిరెడ్డికి కొండవీటి చాంతాడంత లేఖ రాసి మరీ వంశీకి గన్నవరం నియోజకవర్గ పార్టీ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు అప్పగిస్తే.. ఫ్యాన్ పార్టీ గెలుపు కష్టమవుతోందని వంశీకి కాకుండా ఎవరికి  అవకాశం ఇచ్చినా   తామంతా కష్టపడి మరీ పార్టీని గెలుపించుకొనేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తామని స్పష్టం చేశారట. వల్లభనేని వంశి పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా మారడానికి కారణమేమిటన్నదానికి మరోవైపు వల్లభనేని వంశీని అటు టీడీపీ వాళ్లు.. ఇటు వైసీపీ వాళ్లు ఎందుకిలా పగ పట్టారంటే మాత్రం.. గన్నవరం నియోజకవర్గంలో ఓ టాక్  జోరుగా వైరల్ అవుతోంది. 2014 ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చింది. ఆ క్రమంలో గన్నవరం నుంచి గెలిచిన వల్లభనేని వంశీ చాలా దూకుడుగా వ్యవహరించారట.  ఎలా అంటే నాటి ప్రతిపక్షంలో ఉన్న వైయస్ఆర్సీపీ శ్రేణులపై కేసులు పెట్టించారట. అలాగే వారి ఆర్థిక మూలాలను సైతం ఆయన తీవ్రంగా దెబ్బ కొట్టారట. ఈ నేపథ్యంలో ప్రస్తుత అధికార పార్టీలోని ద్వితీయ శ్రేణి నేతలకు సైతం ఈ వల్లభనేని వంశీపై కన్నెర్రగా ఉందన్నదే ఆ టాక్.   అదీకాక రానున్న ఎన్నికల్లో గన్నవరం ఎమ్మెల్యే అభ్యర్థిగా మళ్లీ యార్లగడ్డ వెంకట్రావ్ బరిలోకి దిగాలని భావిస్తుండగా.. మరో వైపు వైఎస్ ఫ్యామిలీకి అత్యంత ఆప్తుడు దుట్టా రామచంద్రరావు   అల్లుడిని రంగంలోకి దింపేందుకు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ఆ క్రమంలో వీరిద్దరు వ్యూహాత్మకంగా  అడుగులు వేస్తున్నారట. దుట్టా రామచంద్రరావు అల్లుడు వైయస్ జగన్ భార్యకు సమీప బంధువు అని తెలుస్తోంది.ఆ క్రమంలో ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. అయితే వల్లభనేని వంశీకి మాత్రం టికెట్ రాకూడదనే విధంగా కూడా వీరు వ్యూహాలు రచిస్తున్నట్లు సమాచారంమరోవైపు.. వచ్చే ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి తమ పార్టీ తరఫున బలమైన అభ్యర్థిని రంగంలోకి దింపాలని ఇప్పటికే చంద్రబాబు స్కెచ్ వేశారు. ఎందుకంటే.. ఫ్యాన్ పార్టీ అధినేత జగన్ ఓ వేళ.. ఎవరినీ కాదని.. వల్లభనేని వంశీకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినా.. అతడి ఓడించాలనే ఓ విధమైన దృఢ సంకల్పంతో సైకిల్ పార్టీ అధినేత ఉన్నట్లు తెలుగుదేశం వర్గాలు చెబుతున్నాయి. వల్లభనేని వంశీ.. పార్టీ మారి తప్ప చేశారని.. ఓ వేళ పార్టీ మారినా ఆయన చంద్రబాబు ఫ్యామిలీ గురించి అలా మాట్లాడకుండా ఉండాల్సిందనే ఓ అభిప్రాయం అయితే గన్నవరం నియోజకవర్గంలో  బలంగా వినిపిస్తోంది.

Related Posts