YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

పాపం... ఆర్కే...

పాపం... ఆర్కే...

గుంటూరు, మే 13,
ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికలు జరగడానికి ఇంకా రెండేళ్ల సమయం ఉంది. అయితే.. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సహా కొందరు వైసీపీ నేతల మాటల్ని బట్టి, సీఎం జగన్ పార్టీ నేతలతో చేస్తున్న సమీక్షలు, ఇప్పటి నుంచే వారికి పార్టీ పరంగా అప్పజెబుతున్న బాధ్యతల నేపథ్యంలో ముందస్తు ఎన్నికలు రావచ్చనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నగరం అమరావతి ప్రాంతంలో ముఖ్యమైన, చారిత్రక మంగళగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఈసారి గడ్డుకాలం ఎదుర్కోక తప్పదనే అంచనాలు వస్తున్నారు. ఆర్కే 2014లో తొలిసారిగా వైసీపీ ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2019 ఎన్నికల్లో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై 5 వేల 337 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 2019 నుంచి రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ సీఆర్ డీఏ చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు.మంగళగిరి నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించి అసెంబ్లీకి పంపించిన నియోజకవర్గం ప్రజలకు ఆర్కే చేసిన మేలు ఏమిటనేది చూస్తే.. అతి స్వల్పమే అంటారు స్థానికులు. నియోజకవర్గం బాగోగుల గురించి అంతగా పట్టించుకోని ఆర్కే.. ఎంతసేపూ సీఆర్ డీఏ చైర్మన్ హోదాలో అమరావతిలో అసైన్డ్ భూముల కొనుగోలు, అమ్మకాలపై ఫిర్యాదులు చేయడానికే సమయం అంతా వెచ్చిస్తుంటారనే ఆరోపణలు ఉన్నాయి. అమరావతి భూముల విషయంలో ప్రతినిత్యం టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు పైన, టీడీపీ హయాంలో మున్సిపల్ మంత్రిగా వ్యవహరించిన పొంగూరు నారాయణపైన ఆరోపణలు చేయడం, ఫిర్యాదులు చేయడంపైనే ఉంటారని చెబుతారు.రాజధాని అమరావతి నిర్మాణం కోసం తాము సంతోషంగా తమ భూములు ఇస్తే.. చంద్రబాబు బలవంతంగా లాక్కున్నారంటూ ఆర్కే ఆరోపణలు చేయడం సరికాదని కొందరు దళితులు ఖండించడం విశేషం. దళితులను అవహేళన చేస్తూ మాట్లాడిన ఎమ్మెల్యే ఆర్కేపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలని దళితులు తుళ్లూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం అనూహ్య పరిణామమే. ఆర్కేకి నిజంగా మంగళగిరిపై, దళితులపై ప్రేమ ఉంటే.. అమరావతిని అభివృద్ధి చేసి చూపించాలనేది దళితుల సవాల్. అమరావతి నిర్మాణం కోసం రైతుల భూమిని బలవంతంగా లాక్కున్నారన్న ఎమ్మెల్యే ఆర్కే వ్యాఖ్యలను పలువురు రాజధాని ప్రాంత రైతులు కూడా ఖండించడం గమనార్హం. అమరావతి భూముల విషయాన్ని ఎమ్మెల్యే ఆర్కే రాజకీయం చేస్తున్నారని వారు తూర్పారపడుతుండడం గమనించదగ్గ విషయం.ప్రతినిత్యం వైసీపీ అధినేత వైఎస్ జగన్ భజనతోనే ఎమ్మెల్యే ఆర్కే తరిస్తుంటారని, నియోజకవర్గం అభివృద్ధి కోసం ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టిన ఈ ఎనిమిదేళ్లలో ఆయన చేసిందేమీ లేదని ప్రజలు పెదవి విరుస్తుండడం విశేషం. ఒకసారి గెలిపిస్తే.. ప్రతిపక్షంలో ఉండడం వల్లే అభివృద్ధి చేయలేకపోయారని సరిపెట్టుకున్నామని, ఈ సారి అధికారపక్షంలో ఉన్నా ఆర్కే తమకేమీ ఒరగబెట్ట లేదని వారు ప్రత్యక్షంగానే వారు విమర్శిస్తున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే జరిగినా.. లేదా ముందుగా జరిగినా.. ఆర్కే గెలిచే పరిస్థితి ఉండబోదని స్థానికులే చెబుతుండడం గమనార్హం.మరో పక్కన ఈ సారి కూడా మంగళగిరి నుంచే పోటీ చేయాలని టీడీపీ యువనేత, మాజీ మంత్రి నారా లోకేష్ డిసైడ్ అయ్యారనే అంచనాలే వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆయన కొన్నాళ్లుగా మంగళగిరిలోనే అనునిత్యం గడుపుతున్నారు. ప్రతిరోజూ సాయంత్రం అయ్యేసరికి నియోజకవర్గంలో ఏడో ఒక చోట ప్రజల మధ్య లోకేష్ ప్రత్యక్షం అవుతున్నారు. ‘పోగొట్టుకున్న చోటే వెదుక్కోవాలి’ అన్న లోకోక్తి ప్రకారం గతంలో మంగళగిరిలోనే ఓడిన నారా లోకేష్ ఇదే నియోజకవర్గంలో రెట్టించిన పట్టుదలతో కృషి చేస్తున్నారు. ఎవరికి ఏమి కష్టం వచ్చినా.. వెంటనే అక్కడ వాలిపోతున్నారు. బాధితుల పక్షాన నిలబడి ప్రభుత్వాన్ని, వైసీపీ నేతలను, సీఎం జగన్ ను నిలబెట్టి కడిగేస్తున్నారు. గతంలో తానెవరో నియోజకవర్గం ప్రజలకు అంతగా తెలియకపోయినా సిటింగ్ ఎమ్మెల్యే ఆర్కేకు గట్టి పోటీనే ఇచ్చారు. వారిద్దరి మధ్యా ఓట్ల తేడా స్వల్పమే. ఇప్పుడు నియోజకవర్గం ప్రజల మధ్యే నిరంతరం ఉండడంతో లోకేష్ అంటే మరింత క్రేజ్ వచ్చిందంటున్నారు.గత ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఆర్కే పేదలకు 4 రూపాయలకే భోజనం, 10 రూపాయలకే సంచి నిండా కూరగాయలు లాంటి టక్కు టమార విద్యలు ప్రదర్శించారంటారు. అయితే.. రెండోసారి గెలిపించిన ప్రజలకు ఆర్కే జనాలకు అవసరమైన కార్యక్రమాలు చేయడం లేదనే విమర్శలు వస్తున్నాయి. గత ఎన్నికల ముందు ఆర్కే ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని, అసలు నియోజకవర్గంలోనే కనిపించడంలేదని లోకేష్ తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. ప్రజలకు ఏవైనా సమస్యలు వస్తే స్థానిక ఎమ్మెల్యేగా ఆర్కే ఏ మాత్రం స్పందించడం లేదని, ఎమ్మెల్యే మిస్సయిపోయారంటూ లోకేష్ చేస్తున్న విమర్శల్లో వాస్తవం ఉందనేది జనం మాటగా ఉంది. నియోజవర్గాన్ని చుట్టేస్తున్న లోకేష్.. గత ఎన్నికల్లో తనకు పెద్దగా ఓట్లు పడని ప్రాంతాలపై మరింతగా దృష్టి సారించి పనిచేసుకుపోతున్నారు.ఇటీవలే జరిగిన దుగ్గిరాల ఎంపీపీ ఎన్నికల సందర్భంగా మహిళా అభ్యర్థిని ఎమ్మెల్యే ఆర్కే కిడ్నాప్ చేయించారని మీడియాలో వార్తలు రావడం ఆయన పట్ల వ్యతిరేకత పెరిగిందంటున్నారు. దుగ్గిరాల పర్యటనకు వచ్చిన నారా లోకేష్ పై ఆళ్ల డ్రైవర్ రాళ్ల దాడి చేయించిన సంఘటనతో ఆర్కేపై నియోజవర్గం ప్రజల్లో మరింత వ్యతిరేకత వచ్చిందంటున్నారు. మంగళగిరిలో ఎమ్మెల్యే ఆర్కే చేసుకున్న స్వయం కృతం, నారా లోకేష్ ప్రజల మధ్యకు దూసుకుపోతున్న కారణంగా ఈ సారి ఎన్నికల్లో ఆర్కేకు గడ్డు పరిస్థితులు తప్పవనే రాజకీయ విశ్లేషకుల అంచనా.

Related Posts