YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

అసని తో రైతులు విలవిల

అసని తో రైతులు విలవిల

శ్రీకాకుళం, మే 16,
తీర ప్రాంతాల్లో అసని తుపాను కల్లోలం సృష్టించింది.  వందల ఎకరాల్లో పంటలు ధ్వంసం అయ్యాయి. మచిలీపట్నానికి 20 కిలో మీటర్లు, నర్సాపురానికి 40 కిలోమీటర్ల మధ్య కొద్ది రోజుల  తీరం దాటిన   ‘అసని’ ప్రభావంతో    జిల్లాల్లో కోట్లాది రూపాయల విలువైన వరి, అరటి, మామిడి, జీడిమామిడి, బొప్పాయి, కొబ్బరి, నిమ్మ, మొక్కజొన్న, వేరుశనగ పంటలు నేల మట్టం అయ్యాయి. ఉద్యానవన పంటలకూ తీవ్ర నష్టం వాటిల్లింది.  అయినా జగన్ సర్కార్ తుపాను సమయంలో ఏమాత్రం సహాయక చర్యలు నిర్వహించలేదనే ఆరోపణలు సర్వత్రా వినవస్తున్నాయి.అసని తుపాను వెళ్లిపోయినా ప్రభుత్వ యంత్రాంగం ఇంకా పంట, ఆస్తి నష్టాలను అంచనా వేయడానికి, సహాయం చేయడానికి రావడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  తుపాను, వరదల కారణంగా జరిగిన పంట నష్టాన్ని అంచనా వేసి, వెంటనే అన్నదాతలను ఆదుకోవాలని సీపీఐ నాయకుడు రామకృష్ణ జగన్ కు లేఖ రాశారు.  వర్షాలు, వరదల కారణంగా ఒక్కో ఎకరానికి సుమారు 50 వేల నుంచి లక్ష రూపాయల వరకు నష్టం వాటిల్లిందని  పేర్కొన్నారు. తుపానులు, వరదల బీభత్సం వల్ల జరిగిన నష్టాన్ని జాతీయ విపత్తుగా గుర్తించి, తగిన నిధులు విడుదల చేసేలా కేంద్రంపై వైసీపీ సర్కార్ ఒత్తిడి పెంచాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.అసని తుపాను కారణంగా ఏపీలోని పంటలకు 2 వేల 500 కోట్ల మేర నష్టం జరిగిందని గ్లోబల్ కన్సల్టెన్సీ ఆర్ఎంఎస్ఐ అంచనా వేసింది. ఏపీలో అసని తుపాను కారణంగా అత్యధికంగా 30వేల హెక్టార్లలో వరిపంట నాశనమైందని ప్రాథమిక అంచనా. మొక్కజొన్న 6 వేల 95 హెక్టార్లలో, మినుము పంట, 3 వేల 882 హెక్టార్లలో, వేరుశనగ, 875 హెక్టార్లలో నువ్వుల పంట, 589 హెక్టార్లలో పొద్దుతిరుగుడు, 200 హెక్టార్లలో, బఠాని పంటలు నాశనమయ్యాయి. వాటితో పాటు సజ్జలు, పత్తి, చెరకు, రాగి, మిర్చి, టమోటా, మునగ, జామ, దానిమ్మ, తమలపాకు, కాయగూరలు, ఆకుకూరల పంటలకు కూడా పెద్ద ఎత్తున నష్టం వాటిల్లినట్లు వ్యవసాయశాఖ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. అయితే.. పంట నష్టాన్ని పూర్తిస్థాయిలో ఎప్పుడు అంచనా వేస్తారు, నష్టపరిహారం ఎప్పుడు అందచేస్తారన్న విషయం అంతు చిక్కకుండా ఉందని బాధితులు వాపోతున్నారు.అసని తుపాను ప్రభావంతో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో వరి, మామిడి, అరటి రైతులు బాగా నష్టపోయారు. వందలాది ఎకరాల్లోని మామిడి నేల రాలిపోయింది. నేల రాలిన మామిడి పంటను చూసిన రైతుల కళ్లలో నీళ్లు సుడులు తిరుగుతున్నాయి. గెలలు వేసిన అరటి తోటలు నేలమట్టం అవటంతో రైతుల పరిస్థితి దీయనీయంగా మారింది. రాయలసీమలోని కడప, చిత్తూరు జిల్లాల్లో కూడా వర్షాలకు భారీగా పంట నష్టం వాటిల్లింది. శ్రీకాకుళం జిల్లాలో మామిడి, జీడిమామిడి తోటల రైతులు బాగా నష్టపోయారు.   మొక్కజొన్న, వేరుశనగ, అరటి, బొప్పాయి పంటలు ధ్వంసం అవడంతో రైతులు దీనస్థితిలోకి వెళ్లిపోయారు. కోనసీమ జిల్లాలో వేలాది రూపాయల పెట్టుబడి పెట్టి సాగు చేసిన వరి పంటతో పాటు రాసులుగా పోయిన ధాన్యం తడిసి ముద్దై పోయింది.అంబాజీపేట, పి.గన్నవరం, అయినవిల్లి, రాజోలు, అమలాపురం, మాచవరంలలో వరి పంటలు నేలకొరిగాయి. కాకినాడ జిల్లా రైతులకైతే అసని గుండెకోత మిగిల్చింది. అసని కారణంగా కృష్ణా జిల్లాలోని అరటి, మొక్కజొన్న తోటలు ధ్వంసం అయ్యాయి. ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, గుంటూరు జిల్లాల్లో బొప్పాయి, మామిడి, అరటి పంటలు ధ్వంసం అయ్యాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో సుమారు 12 కోట్ల మేర పంట నష్టం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు.అసని తుపానుతో పంటలకు ఇంత భారీ ఎత్తున నష్టం వాటిల్లినా ఏపీ సర్కార్ ఏమి చేస్తోందని, పంట నష్టాన్ని అంచనా వేసేందుకు ముందుకు రావడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Related Posts