YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

రాజ్యసభ లెక్కలు... ఫ్యాన్ ఖాతా...

రాజ్యసభ లెక్కలు... ఫ్యాన్ ఖాతా...

విజయవాడ, మే 16,
దేశవ్యాప్తంగా ఖాళీ అవబోతున్న 57 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైంది. కేంద్ర ఎన్నికల సంఘం గురువారం షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఆయా స్థానాలకు ఈ నెల 24న నోటిఫికేషన్‌ జారీ కానుంది. నామినేషన్ల స్వీకరణకు తుది గడువు ఈ నెల 31వ తేదీ గా నిర్ణయించారు. జూన్‌ 1న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. జూన్ 3వ తేదీ వరకు అభ్యర్థులు నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు. ఇక జూన్‌ 10వ తేదీన ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ జరుగుతుంది. పోలింగ్‌ ముగిసిన తర్వాత అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ఉండనుంది.  జూన్‌ నుంచి ఆగస్టు నెల వరకు 15 రాష్ట్రాల్లో మొత్తం 57 రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. వీటన్నింటికీ కలిపి ఎన్నికల సంఘం ఒకేసారి షెడ్యూల్‌ను విడుదల చేసింది. తెలుగు రాష్ట్రాల్లో 6 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఆంధ్ర ప్రదేశ్‌లో 4, తెలంగాణలో 2 స్థానాలు ఖాళీ అవుతున్నాయి. తెలంగాణ నుంచి టీఆర్‌ఎస్‌ ఎంపీలు కెప్టెన్‌ లక్ష్మీకాంతరావు, ధర్మపురి శ్రీనివాస్‌ పదవీకాలం ముగియనుంది. జూన్‌ 21న ఏపీ నుంచి బీజేపీ ఎంపీలు సురేశ్‌ ప్రభు, టీజీ వెంకటేశ్‌, సుజనా చౌదరి, వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి రిటైర్‌ అవుతున్నారు. అసెంబ్లీలో సంఖ్యాబలం రీత్యా తెలంగాణలోని 2 స్థానాలను టీఆర్‌ఎస్‌, ఏపీలో 4 స్థానాలను వైసీపీ కైవసం చేసుకోనున్నాయి. రాష్ట్ర శాసన సభలో మొత్తం 175 స్థానాలకు గాను 150 వైఎస్సార్‌సీపీ సొంతం చేసుకుంది. 23 స్థానాల్లో టీడీపీ, ఒక స్థానంలో జనసేన ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. ఒక్కో స్థానంలో గెలవడానికి సగటున 44 మంది ఎమ్మెల్యేల ఓట్లు అవసరం. దీంతో నాలుగు స్థానాలూ వైఎస్సార్‌సీపీ గెల్చుకునే అవకాశాలే ఎక్కువ..! రాజ్యసభలో రాష్ట్ర కోటా 11 స్థానాలు. ప్రస్తుతం ఐదుగురు వైఎస్సార్‌సీపీ సభ్యులున్నారు (జూన్‌ 21తో పదవీ కాలం ముగిసే విజయసాయిరెడ్డి స్థానాన్ని మినహాయిస్తే). జూన్‌ 10న పోలింగ్‌ జరిగే నాలుగు రాజ్యసభ స్థానాలు వైఎస్సార్‌సీపీ ఖాతాలోకి చేరతాయి. అప్పుడు వైఎస్సార్‌సీపీ బలం ఐదు నుంచి తొమ్మిదికి పెరుగుతుంది. ప్రస్తుతం ఉన్న వైఎస్సార్‌సీపీ సభ్యుల్లో వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి పదవీ కాలం 2024 ఏప్రిల్‌ 22తో ముగుస్తుంది. టీడీపీకి చెందిన కనకమేడల రవీంద్రకుమార్, బీజేపీకి చెందిన సీఎం రమేష్‌ల పదవీ కాలమూ అదే రోజుతో ముగుస్తుంది. ఈ మూడు స్థానాలకు 2024 ఎన్నికలకు ముందు ఎన్నికలు జరుగుతాయి. శాసనసభలో సంఖ్యాబలం ఆధారంగా ఆ మూడు స్థానాలను కూడా వైఎస్సార్‌సీపీ దక్కించుకోనుంది. అప్పుడు రాష్ట్ర కోటాలోని 11 రాజ్యసభ స్థానాలూ వైఎస్సార్‌సీపీ ఖాతాలో చేరనున్నాయి.

Related Posts