అనంతపురం, మే 16,
ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చాక కూడా అంతకంటే తక్కువ ధరకే వేరుశనగ విత్తనాలు బహిరంగ మార్కెట్‌లో దొరుకుతున్నాయి. రైతు భరోసా కేంద్రాల (ఆర్‌బికె)లో అందించే విత్తనం క్వింటాలుకు సబ్సిడీ పోను రైతు రూ.5,117 చెల్లించాలి. కానీ బహిరంగ మార్కెట్‌లో అంతకంటే కాస్త తక్కువ రేటుకే ఎలాంటి రాయితీ లేకుండానే లభ్యమవుతున్నాయి. మరీ అయితే నాణ్యత, వెరైటీ (రకం) బట్టి రూ. రెండు మూడొందలు మాత్రమే ధరలో వ్యత్యాసం ఉంది. ప్రభుత్వం క్వింటాలుకు ఇస్తున్న రూ.వేల సబ్సిడీ ఎవరి జేబుల్లోకి పోతోందన్నదే ప్రశ్న. గత కొన్నేళ్లుగా జరుగుతున్న తంతే ఈ ఏడాదీ అమలవుతోంది. ఈ తడవ నేరుగా రైతుల నుండి కాకుండా టెండర్లపై ట్రేడర్ల నుండి విత్తనాలను సేకరిస్తుండటంతో వ్యవహారం ఇంకా ముదిరినట్లు ఆరోపణలొస్తున్నాయి.రానున్న ఖరీఫ్‌లో రాయలసీమ జిల్లాల్లో మూడున్నర నుండి నాలుగు లక్షల క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలను రాయితీపై పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. విత్తనాల అమ్మకం ధర క్వింటాలు రూ.8,480గా నిర్ణయించగా, అందులో 3,367 సబ్సిడీ. అది పోను రైతు నికరంగా 5,117 చెల్లించాలి. సేల్ ప్రైస్‌లో 40 శాతం సబ్సిడీ ఇస్తున్నారు. అయితే ప్రభుత్వ రాయితీతో సంబంధం లేకుండా రైతులు నేరుగా బహిరంగ మార్కెట్‌లో విత్తనాన్ని కొనుగోలు చేస్తే రూ.5,100కే లభ్యమవుతున్నాయి. క్వాలిటీ, డిమాండ్ ఉన్న వెరైటీలకు బహిరంగ మార్కెట్‌లో ప్రస్తుతం ఉన్న రేటు రూ.5,500 అంటే బాగా ఎక్కువ. ప్రభుత్వం క్వింటాలుకు రూ.3 వేలకు పైన సబ్సిడీ ఇచ్చామంటుండగా, అదేమీ లేకుండానే, ప్రభుత్వం రైతును చెల్లించమన్న నాన్-సబ్సిడీ అమౌంట్ కంటే తక్కువకే, లేదంటే రూ.రెండు మూడొందల వ్యత్యాసంతోనే మార్కెట్‌లో సులభంగా దొరుకుతుండటంతో మరొకసారి రాయితీ విత్తనాల ధరల నిర్ణయం, కమీషన్లు, అవినీతి అక్రమాలు చర్చనీయాంశమయ్యాయి. మార్కెట్‌లో పంట రాగానే క్వింటాలు రూ.6-7-8 వేలకు నాణ్యమైన విత్తన కాయలను రైతులు అమ్ముకున్నారు. మిగిలినవి కాస్త తక్కువ నాణ్యమైనవి. సబ్సిడీ విత్తనాల సరఫరా కోసం ట్రేడర్లు అంతగా నాణ్యత లేని కాయలను సేకరించి, తూతూ మంత్రంగా ప్రాసెస్ చేసి, ఎపి సీడ్స్‌కు ఇస్తున్నారు. ప్రాసెసింగ్, ప్యాకింగ్, రవాణ అంటూ ఎపి సీడ్స్ క్వింటాలుకు వేల రూపాయల వంతున ఖర్చులను కలుపుకొని సేల్ ప్రైస్‌ను నిర్ణయిస్తోంది. ఆ ధరలో 40 శాతం సబ్సిడీ అంటోంది. ఈ విధానం వలన విత్తన రైతులకు దక్కాల్సిన గిట్టుబాటు ధర రాక నష్టపోతున్నాడు. మరో వైపు పంట సాగు చేసే రైతు అధిక ధర చెల్లిస్తున్నాడు. మధ్యలో ట్రేడర్లు, ప్రభుత్వంలోని కొందరు కమీషన్లు లాగిస్తున్నారు.ఇదిలా ఉండగా మే మూడవ వారంలో ఆర్‌బికెలలో ముందస్తు బుకింగ్‌ల ద్వారా వేరుశనగ విత్తనాల పంపిణీని ప్రారంభించాలనుకోగా ఇప్పటికి పంపిణీకి సిద్ధమైన స్టాక్ 60 వేల క్వింటాళ్లలోపేనని సమాచారం. టెండర్లు పొందిన ట్రేడర్లు విత్తనాల సేకరణ, ప్రాసెసింగ్‌ను నెమ్మదిగా కొనసాగిస్తున్నారని తెలిసింది. ఈ ప్రభావం పంపిణీకి నిర్ణయించిన షెడ్యూల్‌పై పడుతుందని చెబుతున్నారు.