చెన్నై, మే 16,
కాంగ్రెస్ చింతన్ శిబిర్ తీర్మానాలతో పార్టీకి ఏ మేరకు ప్రయోజనం కలుగుతుందన్నది రానున్న రోజుల్లో తేలుతుంది. అయితే ఆ పార్టీ సీనియర్ నాయకుడు పి. చిదంబరానికి మాత్రం తక్షణమే ఎదురు దెబ్బ తగిలేలా ఉందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నారు. త్వరలో జరగనున్న రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికలలో తమిళనాడు నుంచి పీ. చిదంబరం ను రాజ్యసభకు పంపాలని కాంగ్రెస్ హై కమాండ్ ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకుంది.తీరా ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తరువాత పార్టీలోని ఆయన వ్యతిరేకులు చిదంబరం అభ్యర్థిత్వానికి మోకాలడ్డుతున్నారు. ఇందుకు వారు చిదంబరం తనయుడు కార్తి ఇప్పటికే ఎంపీగా ఉన్నందున తాజా చింతన్ శిబిర్ తీర్మానం మేరకు ఒక కుటుంబానికి ఒకే పదవి ప్రకారం చిదంబరంకు రాజ్యసభ టికెట్ ఇవ్వడం సరికాదన్న వాదనను తెరమీదకు తీసుకు వచ్చారు. చిదంబరం ను తమిళనాడు నుంచి రాజ్యసభకు పంపాలన్నది కాంగ్రెస్ హైకమాండ్ యోచన. త్వరలో జరగనున్న రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికలలో తమిళనాడులో 6 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఆరింటిలో నాలుగు సునాయాసంగా ఆ రాష్ట్రంలోని అధికార డీఎంకే గెలుచుకుంటుంది. మిత్రపక్షమైన కాంగ్రెస్ కు ఆ నాలుగింటిలో ఒక స్థానాన్ని కేటాయించేందుకు డీఎంకే అంగీకరించింది.ఆ స్థానం నుంచే చిదంబరం రాజ్యసభకు ఎంపిక కావాల్సి ఉంది. సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి చిదంబరం కు ఆర్థిక అంశాలపై మంచి పట్టు ఉంది. మోడీ ఆర్థిక విధానాలకు ఎండగట్టడంలో దిట్ట.. అటువంటి నేత రాజ్యసభలో ఉంటే కాంగ్రెస్ వాణిని మరింత బలంగా వినిపిచే అవకాశం ఉంటుందన్నది పార్టీ అధిష్టానం భావిస్తున్నది. అయితే పార్టీలో మాత్రం చిదంబరం పట్ల ఒక స్థాయిలో వ్యతిరేకత ఉంది.ఆయన మేధో అహంకారం కారణంగా సీనియర్లు, జూనియర్లు అన్న తేడా లేకుండా పార్టీలో అందరూ చిన్నబుచ్చుకోవలసిన పరిస్థితిని పలుమార్లు ఎదుర్కొన్నారు. ఆ కారణంగానే బహిరంగంగా ఎవరూ ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడకపోయినా, మద్దతుగా నిలిచేందుకు కూడా ఎవరూ ముందుకు రారు. ఇప్పుడు ఒక కుటుంబానికి ఒకే పదవి అన్న చింతన్ శిబిర్ తీర్మానాన్ని చూపుతూ పార్టీలో ఆయన రాజ్యసభ అభ్యర్థిత్వానికి వ్యతిరేకత ఎదురౌతున్నది. చివరికి పార్టీ అధిష్టానం ఏం నిర్ణయం తీసుకుంటుందన్నది వేచి చూడాలి.