నెల్లూరు, మే 17,
జగన్ ఆర్భాటంగా ప్రచారం చేసుకుని, ఆడంబరంగా ప్రారంభించిన పథకాలు ఒకదాని వెనుక ఒకటిగా నీరుగారిపోతున్నాయి. తల్లి దీవెన, అమ్మఒడి, రైతు భరోసా ఇలా ఒక్కటొక్కటిగా పథకాలను నిలిపివేయడమో, వాయిదా వేయడమో షరతులతో లబ్ధిదారుల సంఖ్యలో భారీగా కోత వేయడమో చేస్తూ వస్తున్నారు.ఇప్పుడు ఆ కోవలోకి వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ పథకం కూడా చేరిపోయింది. మాటలు కోటలు దాటాయి కానీ చేతలు గడప దాటలేదన్నట్లు.. పేద వారి వైద్యం కోసం ప్రభుత్వం ఎంతటి వ్యయానికైనా వెనుకాడదు.. వెయ్యి రూపాయలు ఖర్చు దాటిన ప్రతి చికిత్సనూ వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ పథకం కిందకు తీసుకువస్తానంటూ ఘనంగా ఎన్నికల సందర్భంగా చేసిన వాగ్దానం ఇప్పుడు గాలి మూటగా మారిపోయింది. ఆరోగ్య శ్రీ నెట్ వర్క్ ఆస్పత్రులకు బకాయిలు పేరుకు పోవడంతో ఆ ఆస్పత్రులు ఆరోగ్య శ్రీ సేవలను బంద్ చేసేశారు.ఆరోగ్య శ్రీ నెట్ వర్క్ ఆస్పత్రుల బకాయిలు 600 కోట్లకు పైగా పేరుకుపోవడంతో ఇక ఈ సేవలు అందించలేమంటూ ఆస్పత్రులు చేతులెత్తేశాయి. నాలుగు నెలలుగా ఆరోగ్య శ్రీ బిల్లుల చెల్లింపులు జరగడం లేదు. ఒక్కో నెట్ వర్క్ ఆస్పత్రికి ప్రభుత్వం కోట్ల రూపాయలు బకాయి పడింది. ప్రభుత్వం ఈ సేవల కోసం ఒక్క టంటే ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు.అసలు ఎప్పటికైనా చెల్లిస్తారా? చెల్లించేటట్లయితే ఎప్పటికి చెల్లిస్తారు అన్న ప్రశ్నలకు ఆరోగ్య శ్రీ ట్రస్ట్ వద్ద కానీ, సర్కార్ వద్ద కానీ సమాధానం లేదు. ఆస్పత్రులకు బకాయిలే పేరుకుపోవడంతో అవి ఆరోగ్య శ్రీ సేవలను నిలిపివేశాయి. వచ్చిన రోగులకు నిర్మొహమాటంగా సొమ్ము చెల్లిస్తేనే వైద్యం.. ఆరోగ్య శ్రీ కింద అయితే వైద్యం చేయం అని తేల్చి చెప్పేస్తున్నాయి.