YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఆర్టీసీ డ్రైవర్లకు టార్గెట్ పనిష్మెంట్లు.

ఆర్టీసీ డ్రైవర్లకు టార్గెట్ పనిష్మెంట్లు.

ఒంగోలు, మే 17,
రోగం ఒకటైతే..మందు మరోచోట వేస్తోంది జగన్ సర్కార్. గాయం ఒక చోట తగిలితే..మందు మరో చోట పూస్తోంది. ఇదంతా ఏదో  వంకతో కష్ట జీవి  జేబు కొట్టేసే కుట్రలో భాగమే. ఇలాంటి  కుతంత్రాలు అమలు చేయడంలో   జగన్ సర్కార్ ది అందెవేసిన చేయి అన్న  విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాళా తీయించిన జగన్ సర్కార్ రాష్ట్ర అవసరాలకు అప్పులు పుట్టక, బాండ్లు తాకట్టు పెట్టినా దరిద్రం తీరక, కేంద్రం నుంచి సాయం తెచ్చుకోలేక, చివరికి రిటైర్ అయిన ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్లు ఇవ్వడంలో తాత్సారం చేస్తోంది.  ఓడీ సౌకర్యాన్ని మొత్తం వాడేసినా రోజువారీ ఖర్చులకు కటకటలాడే దుస్థితికి దిగజార్చింది.  దీంతో ఎక్కడ, ఏ శాఖలో కాసిన్ని డబ్బులున్నా ఎత్తుకుపోయే చర్యలకు ఒడిగట్టింది.ఇప్పుడు పెట్రోల్, డీజిల్ ధరలు, నిత్యావర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటిపోయి, దినదిన గండం నూరేళ్ల ఆయుష్షు అన్నట్లు రోజులు వెళ్లదీస్తున్న కింది స్థాయి ఉద్యోగుల కష్టార్జితాన్ని కూడా కొట్టేసే కార్యాచరణను జగన్  సర్కార్ అమలు చేస్తోంది. ఇందులో భాగంగానే   తాజాగా ఏపీఎస్సార్టీ డ్రైవర్ల జీతాలకు కోత పెట్టేందుకు సిద్ధమవుతుండడం సర్వత్రా చర్చనీయాంశంగా మారుతోంది.అదెలాగంటే.. ఆర్టీసీ బస్సు మైలేజ్ తగ్గితే అందుకు దాన్ని నడిపిన డ్రైవరే బాధ్యత వహించాలంట. ఆయా రూట్లలో నిర్దేశించిన మేరకు డీజిల్ వినియోగిస్తే సరేసరి.. అంతకు మించి చుక్క డీజిల్ ఎక్కువ వినియోగం జరిగినా.. దాని ఖర్చు మొత్తం డ్రైవర్ల జీతాల నుంచి కట్ చేస్తారట. ఈ మేరకు ఏపీలోని   బస్సు డిపోల మేనేజర్లు  డ్రైవర్లకు నోటీసులు ఇవ్వడం కలకలం రేపుతోంది. విశాఖ నగరం పరిధిలోని సింహాచలం బస్సు డిపో మేనేజర్,  అనకాపల్లి డిపో మేనేజర్ డ్రైవర్లకు ఇలా నోటీసులు పంపారు. ఆ నోటీసులు అందుకున్న డ్రైవర్లు ఆందోళకు గురవుతున్నారు.మైలేజ్ తగ్గితే జీతం నుంచి రికవరీ చేస్తామంటూ నోటీసులు ఇచ్చిన వారు.. మైలేజ్ తగ్గడానికి గల కారణాలను ఎందుకు పరిశీలించడం లేదని పలువురు డ్రైవర్లు ప్రశ్నిస్తున్నారు. ఏపీలో ఒక రూట్ లో ఏప్రిల్ లో నడిచిన ఒక బస్సుకి మైలేజీ లీటర్ కి 6 కిలోమీటర్లకు బదులు 5.16 కిలోమీటర్లే వచ్చినట్లు ఆర్టీసీ అధికారులు లెక్కలేశారట. దీంతో 115 లీటర్ల డీజిల్ ఎక్కువ వినియోగించినట్లు తేల్చారట. ఆ కారణంగా ఆర్టీసీకి 12 వేల 75 రూపాయలు నష్టం వాటిల్లిందని  నిర్ధారించి ఆ మొత్తం నష్టాన్ని సంబంధిత డ్రైవర్ జీతం నుంచి ఎందుకు రికవరీ చేయకూడదో వివరణ ఇవ్వాలని డిపో మేనేజర్ నోటీసు ఇవ్వడంతో డ్రైవర్లలో కూడా ఆందోళన మొదలైంది. ఇదే విధంగా మరో డ్రైవర్ నడిపిన బస్సుకు లీటర్ డీజిల్ 5.20 కిలోమీటర్లకు బదులు 4.65 కిలోమీటర్లే వచ్చిందని తేల్చి అతని జీతం నుంచి 7 వేల 980 రూపాయలు రికవరీ చేయడానికి నోటీసు ఇచ్చారు.నిజానికి ఏపీఎస్సార్టీసీలో కాలం చెల్లిన బస్సులే ఎక్కువగా ఉన్నాయి. దానికి తోడు రాష్ట్రంలో ఎక్కడా రోడ్లు సరిగా ఉన్న పరిస్థితి లేదు. బస్సులు కండిషన్ లో ఉండవు. ఆ డొక్కు బస్సుల నిర్వహణ అనే మాటనే ఎప్పుడూ మర్చిపోయారు. సామర్ధ్యానికి మించి ప్రయాణికులు ఎక్కేస్తారు. పులి మీద పుట్ర మాదిరిగా తరచుగా ట్రాఫిక్ అవాంతరాలు ఏర్పడుతుంటాయి. దానికి తోడు గుంతల రోడ్లు. ఇలాంటి వాస్తవ పరిస్థితులను బేరీజు వేసుకోకుండా మైలేజ్ నెపంతో తమ జీతాలకు ఎసరు పెట్టడం ఏంటని డ్రైవర్లు ప్రశ్నిస్తున్నారు. ఏదైనా ఒక బస్సుకు మైలేజ్ తగ్గితే.. ఆ డిపోలో ఉండే సేఫ్టీ డ్రైవింగ్ ఇన్ స్ట్రక్చర్ ను పంపి ఎందుకు మైలేజి తగ్గిందో పరిశీలించాలి.   డ్రైవర్ వైపు సమస్య ఉంటే.. జోనల్ ట్రైనింగ్ కాలేజీకి పంపి వారం రోజులు శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది.ఇలాంటి విషయాలను ఏమాత్రం పరిగణనలోకి తీసుకోకుండా నేరుగా డ్రైవర్లకు షోకాజ్ నోటీసులు ఇవ్వడాన్ని, ఆయా డ్రైవర్ల జీతాలలో  కోత పెడతామన్న డిపోల మేనేజర్ల తీరుపై ఆర్టీసీ కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కింది స్థాయిలో జరిగే చిన్న చిన్న తప్పిదాలకు కూడా జీతాల కోత పెట్టేందుకు సిద్ధమయ్యే ఆర్టీసీ అధికారులు పైస్థాయిలో జరిగే అవినీతిపై ఎందుకు ఫోకస్ పెట్టడం లేదని కార్మిక సంఘాలు నిలదీస్తున్నారు

Related Posts