విజయవాడ, మే 17,
కృష్ణా జిల్లాలోని సముద్ర తీర ప్రాంత ప్రజలకు రక్షణ కరువైంది. తుపాను, సునామీల సమయంలో హెచ్చరికల సమయంలో బిక్కుబిక్కుమంటూ గడపాల్సి వస్తోంది. కరకట్ట నిర్మాణం అసంపూర్తిగా నిల్చిపోవడమే ఇందుకు కారణం. రాష్ట్ర విభజనకు ముందు తప్ప, ఆ తర్వాత పనులు జరగలేదు. నిధుల విడుదలలో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది. దీంతో, పనులు నిల్చిపోయాయి. ఇటీవల బంగాళాఖాతంలో ఏర్పడిన అసని తుపాను మచిలీపట్నం వద్ద బలహీనపడింది. ఎటువంటి ప్రమాదమూ చోటు చేసుకోకపోవడంతో అధికార యంత్రాం గంతోపాటు తీర్రపాంత ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. తుపానులు, ఉప్పెనలు, సునామీల హెచ్చరికలప్పుడు ఉవ్వెత్తున ఎగిసిపడే సముద్ర కెరటాల వల్ల తీరప్రాంత గ్రామాలకు ముప్పు ఎక్కువగా ఉంటోంది. బ్రిటీష్ హయాంలో వచ్చిన తుపాను మచిలీపట్నాన్ని, 1977 ఉప్పెన దివిసీమను ముంచెత్తాయి. ఆ తర్వాత భారీ తుపా నులు, ఇండోనేషియా సుమిత్రా దీవుల్లో ఏర్పడిన భూకంపం కారణంగా వచ్చిన సునామీతో తీరప్రాంతం గ్రామాల్లో ఆస్తి, ప్రాణ నష్టాలు సంభవించాయి. ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రమాదకర కెరటాల నుంచి తీర ప్రాంత గ్రామాల రక్షణకు కృష్ణా జిల్లాలోని నాగాయలంక, కోడూరు, మచిలీపట్నం, కృత్తివెన్ను మండలాల్లోని 88 కిలోమీటర్ల తీరం పొడువున దశల వారీగా కరకట్ట నిర్మాణానికి 2009లో వైఎస్.రాజశేఖరరెడ్డి ప్రభుత్వం ప్రతిపాదించింది. వంద కోట్ల రూపాయల వరకూ ఖర్చువుతుందని అప్పట్లో అంచనా వేశారు. దీనికి కేంద ప్రభుత్వం ఆమోదించి నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ (ఎన్‌డిఎంఎ) ద్వారా నిధులు విడుదల చేసిందిదశల వారీగా 44 కిలోమీటర్ల మేర కరకట్ట నిర్మాణం పూర్తయింది. నాగాయలంక, కోడూరు మండలాల్లో పూర్తిగా, మచిలీపట్నం మండలం పల్లెతుమ్మల గ్రామం వరకు, కృత్తివెన్ను మండలంలో ఇంతేరు వద్ద కొంతవరకు పనులు జరిగాయి. మచిలీపట్నం మండలం మంగినపూడి, పెదపట్నం, కృత్తివెన్ను మండలం ఇంతేరు వరకు మరో 40 కిలోమీటర్లు కరకట్ట నిర్మాణం అసంపూర్తిగానే మిగిలిపోయింది. 2014లో కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిధులను విడుదల చేయలేదు. దీంతో, పనులు ఆగిపోయాయి. రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు ఈ పనుల పూర్తిపై దృష్టి పెట్టలేదు.
ఎనిమిదేళ్ల క్రితం పూర్తయిన 44 కిలోమీటర్ల కరకట్ట నిర్మాణానికి రూ.48 కోట్ల వ్యయం అయింది. కిలోమీటరుకు రూ.కోటికిపైగా వెచ్చించారు. మరో 40 కిలోమీటర్ల మేర కరకట్ట నిర్మించాల్సి ఉంది. పనుల్లో తీవ్ర జాప్యంతో ఇప్పుడు నిర్మాణ వ్యయం భారీగా పెరిగింది. తాజాగా సమగ్ర నివేదిక (డిపిఆర్)ను రూపొందించాల్సి ఉంది. కేంద్రం నుంచి నిధులు రాబట్టి మిగిలిన కరకట్ట నిర్మాణాన్ని పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని కృష్ణా జిల్లాలోని సముద్ర తీర ప్రజలు కోరుతున్నారు.