విశాఖపట్టణం, మే 17,
ఐదేళ్లు అధికారంలో ఉండేందుకు జనం మాకు అధికారం ఇచ్చారు? ముందస్తు ఎన్నికలకు ఎందుకు వెడతాం అంటూ వైసీపీ మంత్రులు ఒక పక్క ప్రకటనలు గుప్పిస్తున్నారు. జగన్ మదిలో ముందస్తు ఆలోచన మెదులుతోందంటూ ప్రభుత్వ సలహాదారు సజ్జల సంకేతాలిస్తారు. ప్రభుత్వం మాత్రం ముందస్తు జాతరను గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంతో మొదలెట్టేసింది. అధికారంలో ఉన్న ఏ పార్టీ అయినా నాలుగేళ్లు పూర్తయిన తరువాత ఐదవ ఏడాది ఎన్నికల సంవత్సరంగా భావించి పందేరాలు, ఉచితాలు, ప్రలోభాలతో ప్రజలకు ఎర వేయాలనుకుంటుంది. కానీ జగన్ ప్రత్యేకం..అందుకే అధికారంలోకి వచ్చిన క్షణం నుంచీ పందేరాలు, ప్రలోభాలతో ముందుకు సాగుతూ వచ్చారు. అయితే మూడేళ్లు గడిచేసరికి అప్పుల్లో కూరుకుపోయిన ప్రభుత్వం ఏ రోజు కారోజు కొత్త అప్పుకోసం వెంపర్లాడే పరిస్థితికి వచ్చేసింది.ఇంక ఇంత కాలం చేసిన పందేరాలను కొనసాగించలేని పరిస్థితుల్లో ముందస్తు జాతరకు సిద్ధమైపోయింది. ప్రచార జాతరకు తెర తీసేసింది. తన వైఫల్యాలను ప్రతిపక్ష పార్టీకి ఆపాదించే ప్రణాళికలను అమలులో పెట్టేస్తోంది. అధికారంలో ఉన్న పార్టీ వైఫల్యాలను విపక్షాలు జనంలో ఎండగట్టడం ఇప్పటి వరకూ అమలులో ఉన్న రివాజు. వైసీపీ దానిని రివర్స్ చేసేసింది. ప్రభుత్వ వైఫల్యాలను కూడా విపక్ష ఖాతాలో వేయడానికి అందుబాటులో ఉన్న అన్ని ప్రచార వనరులనూ యథేచ్ఛగా వాడేసుకుంటోంది. అందులో భాగంగానే రాష్ట్రంలో విద్యుత్ కోతలకు తెలుగుదేశం కుట్రే కారణమంటూ ఓ కొత్త వాదనను తెరమీదకు తీసుకువచ్చింది. అందుకు తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు కుప్పం పర్యటననే వేదిక చేసుకుంది.విద్యుత్ కోతల నెపం చంద్రబాబు కుట్రగా అభివర్ణించడానికి గీత దాటేసింది. ఓ ఛానెల్ లో ప్రసారమైన వార్తా కథనం మేరకు కుప్పంలో చంద్రబాబు పార్టీ శ్రేణులతో ముఖాముఖి కార్యక్రమం కొవ్వొత్తుల వెలుగులో జరిపించడాన్ని ఎత్తి చూపుతూ రాష్ట్రంలో విద్యుత్ లేదని చాటేందుకే చంద్రబాబు కుట్రపూరితంగా విద్యుత్ తీయించేశారన్నది ఆ కథనం. ప్రభుత్వాన్ని అప్రదిష్ట పాలు చేయాలన్న దురుద్దేశంతోనే చంద్రబాబు కుట్రపూరితంగా కుప్పంలో కరెంట్ కట్ చేయించారన్నది ఆ కథనం సారాంశం. రాష్ట్రంలో ఎక్కడా విద్యుత్ కోతలే లేవనీ, చంద్రబాబు పర్యటన సందర్భంగా కేవలం కుప్పంలోనే కరెంట్ కట్ అవ్వడం వెనుక ఉన్నది ఆయన కుట్రేనని నమ్మించడం ఆ కథనం ఉద్దేశం. అయితే రాష్ట్రంలో విద్యుత్ కోతల గురించి, విద్యుత్ ఉద్యోగులకు వేతనాలు అందక పడుతున్న ఇబ్బందుల గురించీ ఒక ఏపీలోనే కాదు.. దేశం మొత్తం తెలిసిన విషయమే.అంతే కాదు రాష్ట్రంలో రోడ్ల దుస్థితి, విద్యుత్ పరిస్థితి, సాగునీరందక అల్లాడుతున్న రైతుల నిస్సహాయ స్థితి గురించి తెలంగాణ మంత్రి నిర్మొహమాటంగా చెప్పిన సంగతి అందరికీ తెలిసిందే. వాస్తవం ఇలా ఉంటే ప్రత్యర్థి పార్టీపై నెపం నెట్టి..పబ్బం గడిపేసుకునే వ్యూహాలను వైసీపీ అమలు చేస్తున్నది. అలాగే సభ ఏదైనా, సందర్భం ఏదైనా ముఖ్యమంత్రి నుంచి వైసీపీ క్యాడర్ వరకూ విపక్షం వల్లే రాష్ట్రంలో సమస్యలన్నీ అని జనాన్ని నమ్మించే యత్నాలు చేస్తున్నాయి. ఇవన్నీ ఎన్నికల తొందరలోనేనన్నది పరిశీలకుల విశ్లేషణ. మొత్తంగా రాష్ట్ర ప్రజలకు మాయా బజార్ సినిమా చూపించేసి సమస్యల నుంచి వారి దృష్టిని మరల్చేందుకు వైసీపీ ప్రయాసకు ఇది నిదర్శనమని విశ్లేషణలు చేస్తున్నారు.తెలుగుదేశం. జనసేన పొత్తల ప్రతిపాదనలు, చర్చలపై వైసీపీలో కనిపిస్తున్న గాభరాకు కూడా కారణం ఇదే నంటున్నారు. రాజకీయాలలో పొత్తలు అత్యంత సహజం. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోయి...అధికార పక్షం అత్తెసరు మార్కులతో పాసయ్యే అవకాశాలు లేకుండా చేసేందుకు పార్టీల మధ్య పొత్తులు ఏపీలోనే మొదలు కాలేదు. ఎమెర్జన్సీ అనంతర ఎన్నికలలో ప్రభుత్వ వ్యతిరేకత ఓట్ల రూపంలో గంప గుత్తగా అప్పటి జనతా పార్టీకే రావడానికి కారణం నిస్సందేహంగా పొత్తులే. యూపీఏ, ఎన్డీయే కూటములు పొత్తల వల్లనే కదా ఏర్పడ్డాయి. ఏపీలో పొత్తులు తమ అధికారానికి చేటు తెస్తాయన్న భయంతోనే వైసీపీ జనసేన, తెలుగుదేశం పొత్తు మాట వింటేనే బెదిరిపోతున్నదని పరిశీలకులు అంటున్నారు. కేంద్రంలో వరుసగా రెండు పర్యాయాలు మోడీ సర్కార్ అధికారంలోకి రావడానికి విపక్షాల అనైక్యతే కారణమన్నది నిర్వివాదాంశం. అందుకే పార్టీలన్నీ కూడా బీజేపీయేతర కూటమి ఏర్పాటు కోసం ప్రయత్నాలు చేస్తున్నాయి. ఏపీలో కూడా తెలుగుదేశం, జనసేనల మధ్య పొత్తు చర్చలు, ప్రతి పాదనలకు కూడా వైసీపీకి వ్యతిరేక ఓటు చీలిపోకూడదనే. ఆ పొత్తులు పొడవకముందే, తమ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమం నిలిచిపోకముందే ఎన్నికలకు వెళ్లి లబ్ధి పాందాలన్న తొందర వైసీపీలో కనిపిస్తోంది. అందుకే రెండేళ్లకు ముందే రాష్ట్రంలో ఎన్నికల జాతర మొదలైపోయిన వాతావరణం కనిపిస్తోంది.