న్యూఢిల్లీ మే 17
ఎఫ్ఐఆర్‌లో తన పేరు లేకున్నా సీబీఐ తన నివాసాల్లో సోదాలు చేపట్టిందని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పీ చిదంబరం పేర్కొన్నారు. సీబీఐ బృందాలు మంగళవారం తన కుమారుడు కార్తీ చిదంబరం నివాసంతో పాటు ఢిల్లీ, చెన్నైలోని తన ఇండ్లపై సోదాలు నిర్వహించాయని అన్నారు.సీబీఐ అధికారులు చూపిన ఎఫ్ఐఆర్‌లో నిందితుడిగా తన పేరు లేదని, సోదాల్లో సీబీఐ ఎలాంటి పత్రాలు, ఆధారాలను స్వాధీనం చేసుకోలేదని, వారు ఏమీ గుర్తించలేదని చిదంబరం పేర్కొన్నారు. సీబీఐ సోదాలు చేపట్టిన సందర్భం, సమయం ఆసక్తికరంగా ఉందని ఆయన ట్వీట్ చేశారు.2011లో రూ 50 లక్షల ముడుపులు స్వీకరించి 250 మంది చైనా జాతీయులకు వీసాలను ఏర్పాటు చేశారని కాంగ్రెస్ ఎంపీ కార్తి చిదంబరంపై సీబీఐ తాజా కేసు నమోదు చేసింది. ఈ కేసుకు సంబంధించి ఢిల్లీ, చెన్నై సహా కార్తి చిదంబరానికి చెందిన ఇండ్లు, కార్యాలయాలపై సీబీఐ అధికారులు మంగళవారం దాడులు నిర్వహించారు. మరోవైపు ఐఎన్ఎక్స్, ఎయిర్‌సెల్ మ్యాక్సిస్ కేసులోనూ కార్తీ చిదంబరంపై సీబీఐ పలు అభియోగాలు మోపింది.