విశాఖపట్టణం, మే 17,
దేశంలో నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి. ఈ నైరుతి రుతుపవనాలు.. ఉత్తర దిశగా పయనమై… లాంగ్ ఐలాండ్స్ నుంచి ఉత్తర అక్షాంశ, తూర్పు రేఖాంశం వరకు విస్తరించాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో రానున్న రెండు రోజుల్లో నైరుతి రుతుపవనాలు.. దక్షిణ బంగాళాఖాతం, మొత్తం అండమాన్ సముద్రం, అండమాన్ దీవుల సహా తూర్పు మధ్య బంగాళాఖాతంలో మరికొన్ని ప్రాంతాలకు మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని పేర్కొన్నారు. వీటి ఫలితంగా రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో రాగల మూడు రోజుల పాటు ఏ విధంగా వాతావరణం ఉండనున్నదో సూచించింది.
ఉత్తర కోస్తా: ఈ రోజు ,రేపు , ఎల్లుండి(మే 19వ తేదీ) తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. మరికొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది.
దక్షిణ కోస్తా: ఈ రోజు, రేపు, ఎల్లుండి(మే 19వ తేదీ) తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. అంతేకాదు పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుంది.
రాయలసీమ: ఈ రోజు, రేపు, ఎల్లుండి(మే 19వ తేదీ) తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది
అల్లకల్లోలంగా సంద్రం
కోనసీమ జిల్లా జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేదిలో సముద్రం పోటెత్తింది. ఓ వైపు తుఫాన్ ప్రభావం ఇంకా కొనసాగుతుండడం.. మరోవైపు వైశాఖ పౌర్ణమి(Vaisakha Pournami) కావడంతో అంతర్వేది వద్ద తీరంలో అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. దీంతో సముద్రుడు ఉగ్ర రూపం దాల్చింది. వంద కిలోమీటర్ల మేర సముద్రం ముందుకొచ్చింది. దీంతో సముద్రం నీరు రోడ్లపైకి, గ్రామం లోనికి చొచ్చుకు వచ్చింది. సముద్రం ఉప్పొంగడంతో తీర ప్రాంత వాసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. అంతర్వేది పల్లిపాలెంలో ఇళ్లు నీటమునిగాయి.తీరప్రాంతం కోతకు గురవడంతో.. సరుగుడు, కొబ్బరి చెట్లు సముద్ర గర్భంలో కలసి తీవ్రంగా నష్టపోతున్నామని స్థానికులు వాపోతున్నారు. అంతేకాదు గతంలో పలు సందర్భాల్లో సముద్రం ఆటుపోట్లకు గురైనప్పటికీ గ్రామంలో ఇళ్లు మునిగిన పరిస్థితి లేదని గ్రామస్తులు తెలిపారు.