హైదరాబాద్, మే 17,
జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయంలో ప్రత్యక్షమయ్యారు. మంగళవారం నాడు ఆయన తాడేపల్లిలోని ముఖ్యమంత్రి కార్యాలయానికి వచ్చారు. కృష్ణయ్యకు రాజ్యసభ సీటు ఇస్తారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో.. సీఎం క్యాంపు కార్యాలయానికి రావడం చర్చనీయాంశంగా మారింది. అయితే, సీఎం జగన్ ప్రస్తుతం కర్నూటు టూర్‌లో ఉన్న నేపథ్యంలో.. సీఎం వచ్చేంత వరకు అక్కడే ఉంటారని సమాచారం. సీఎం జగన్ వచ్చాక.. ఆయనను కలుస్తారని తెలుస్తోంది. ప్రస్తుతం బీసీ సంఘాల జాతీయ అధ్యక్షుడిగా ఉన్న ఆర్. కృష్ణయ్య.. గతంలో ఎల్బీనగర్ నుంచి టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రస్తుతం ఆయన ఏ పార్టీలోనూ లేనప్పటికీ.. బీసీ సంఘాల అధ్యక్షుడిగా కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే, ఏపీలో పదవుల విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. సామాజిక సమీకరణకు ఎక్కువ ప్రధాన్యత ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బీసీ సంఘాల నేత అయినా ఆర్ కృష్ణయ్యకు రాజ్యసభ సీటు ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారపర్వానికి.. ఆర్ కృష్ణయ్య సైతం క్యాంపు ఆఫీసులో కనిపించడం మరింత ఊతమిచ్చినట్లయ్యింది. ఇదిలాఉంటే.. క్యాంపు కార్యాలయానికి మరో నేత బీద మస్తాన్ రావు కూడా వచ్చారు.ఇదిలాఉంటే.. ఏపీలో ఖాళీ అవుతున్న నాలుగు రాజ్యసభ సీట్లకు అభ్యర్థులు దాదాపు ఖరారయ్యారు. విజయసాయిరెడ్డికి మరోసారి ఛాన్స్ ఇవ్వబోతున్నారు సీఎం జగన్. పైన చెప్పుకున్నట్లుగానే ఎవరూ ఊహించని విధంగా తెలంగాణకు చెందిన నేత, టీడీపీ మాజీ ఎమ్మెల్యే, బీసీ సంఘాల జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్యకు రాజ్యసభ అవకాశం ఇవ్వబోతోంది వైసీపీ. బీసీ సామాజికవర్గ కోటాలోనే ఆయన అవకాశం ఇస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు లాయర్, సినిమా ప్రొడ్యూసర్ నిరంజన్‌రెడ్డికి రాజ్యసభ సీటు ఇస్తున్నట్లు సమాచారం. నెల్లూరు జిల్లాకు చెందిన బీద మస్తాన్‌రావు పేరు సైతం ఖరారైనట్లు తెలుస్తోంది.