విజయవాడ, మే 18,
బెజవాడలో కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. టమాటా ధర ఏకంగా 70 రూపాయలకు చేరింది. రెండు నెలల క్రితం నగరంలో కేజీ టమాటా 10 రూపాయలు మాత్రమే. ఇప్పుడా ధర వంద రూపాయలకు చేరుకునేలా ఉంది. ఏ కూర వండినా అందులో టమాటా ఉండాల్సిందే. అలాంటి టమాటా ఇప్పుడు కొనాలంటేనే కరువైపోయింది. తుఫాన్‌తో పంట నష్టపోవటమే రేట్లు పెరగటానికి కారణం అంటున్నారు వ్యాపారులు.మరోవైపు, కర్నూలు, చిత్తూరు, మదనపల్లి మార్కెట్లోనూ టమాటా ధర భారీగా పెరిగిపోయింది. ఒకవైపు ఎండలు, మరోవైపు అకాల వర్షాలతో దిగుబడి పడిపోయింది. దిగుబడి తగ్గటం, ఉన్న పంట పాడైపోవటంతో రేట్లు ఒక్కసారిగా పెరిగిపోయాయి. అటు వ్యాపారుల, ఇటు సామాన్యులు పెరిగిన ధరలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిజానికి… ఒక్క టమాటా మాత్రమే కాదు వంకాయ, బెండకాయ తప్ప క్యాప్సికమ్, చిక్కుడు లాంటి కూరగాయలు 80 రూపాయల దగ్గర ఉన్నాయి. చికెన్ రేట్లు కూడా భారీగా పెరిగిపోతున్నాయి. ధరల భారంతో సామాన్యులు బతకటం కష్టంగా మారింది.