న్యూఢిల్లీ మే 18
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో నిందితుడు ఏజీ పెరారివాలన్‌కు ఊరట లభించింది. అతన్ని విడుదల చేయాలని ఇవాళ సుప్రీంకోర్టు తన ఆదేశాల్లో పేర్కొన్నది. 31 ఏళ్ల తర్వాత పెరారివాలన్ జైలు జీవితానికి గుడ్‌బై చెప్పనున్నాడు. జస్టిస్ ఎల్ నాగేశ్వర రావు, బీఆర్ గవాయి, ఏఎస్ బొప్పన్నలతో కూడిన ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది. రాజ్యాంగంలోని 142 అధికరణ ద్వారా ధర్మాసనం ఈ ఆదేశం చేసింది. ఆర్టికల్ 161 కింద పెరారివాలన్‌ను విడుదల చేయాలని పెట్టుకున్న అభ్యర్థనపై తమిళనాడు గవర్నర్ తన నిర్ణయాన్ని తీసుకోవడం జాప్యం చేస్తున్నట్లు సుప్రీం పేర్కొన్నది. పెరారివాలన్ రిలీజ్‌కు రాష్ట్ర క్యాబినెట్ అంగీకరించిందని, ఇక ఆర్టికల్ 142 ప్రకారం ఆ నిందితుడిని రిలీజ్ చేయడం సమంజసమే అని సుప్రీం అభిప్రాయపడింది.రాజీవ్ గాంధీ హత్యకు వాడిన బాంబు పరికరాలను పెరారివాలన్ అందజేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. రాజీవ్ హత్య సమయంలో పెరారివాలన్ వయసు 19 ఏళ్లు. ఈ కేసులో అతను దోషిగా తేలాడు. 1998లో అతనికి మరణశిక్షను ఖరారు చేశారు. ఆ తర్వాత 2014లో సుప్రీం ఆ శిక్షను జీవితకాల శిక్షగా మార్చింది. ఇక ఈ ఏడాది మార్చిలో సుప్రీంకోర్టు అతనికి బెయిల్‌ను మంజూరీ చేసింది. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని 1991 మే 21వ తేదీన హతమార్చిన విషయం తెలిసిందే.