విజయవాడ, మే 19,
ఆంధ్ర ప్రదేశ్ లో రాజకీయం మొత్తం ఆ రెండు పార్టీల మధ్యనే తిరుగుతోంది. అయితే, టీడీపీ కాదంటే వైసీపీ. ఈ రెండు ప్రాంతీయ పార్టీలే రాష్ట్ర రాజకీయలను శాసిస్తున్నాయి. 2019 సార్వత్రిక ఎన్నికల ఫలితాలనే ప్రామాణికంగా తీసుకుంటే, ఆ రెండు పార్టీలకు కలిపి 90 శాతానికి పైగా ఓట్లు (వైసీపీ 49.15 శాతం, టీడీపీ 39.58 శాతం) పోలయ్యాయి. కాంగ్రెస్, బీజేపీ, ఉభయ కమ్యూస్టు పార్టీలు, జనసేన సహా ఇతర పార్టీలు అన్నిటికీ కలిపి పది శాతానికి కొంచెం అటూ ఇటుగా మాత్రమే ఓట్లు పోలయ్యాయి. అంటే, భవిష్యత్ సంగతి ఎలా ఉన్నా ఇప్పటికి అయితే తమిళనాడు తరహలో ఎపీలోనూ ప్రాంతీయ పార్టీలదే పైచేయి అని తేలిపోయింది. అలాగే, రెండు పార్టీల వ్యవస్థ దిశగా ఏపీ అడుగులు వేస్తోందనే అభిప్రాయం బలపడుతోంది. అయితే, ఇటీవల కాలంలో నేనున్నానంటూ, పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన కొంత సందడి చేస్తోంది. కానీ, సినిమా స్టార్ పవన్ కళ్యాణ్ ఎంత సందడి చేసినా, జనసేన ఒంటరిగా పోటీ చేస్తే తమిళనాడులో కమల్ హసన్ కు ఎదురైన అనుభవమే ఎదురవుతుందని, పవన్ అభిమానులే అంటున్నారు. అలాగే, జనసేన ఒంటరిగా పోటీ చేసినా లేక ఉందో లేదో తెలియకుండా ఉన్న బీజేపీతో పొత్తు కొనసాగించినా, ఫలితం తారుమరయ్యే అవకాశం లేదని రాజకీయ విశ్లేషకులు గట్టిగా భావిస్తున్నారు.నిజానికి ఈ నిజం జనసేన, పవన్ కళ్యాణ్ గుర్తించారు. అందుకే, వైసేపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూసే బాధ్యత తాను తీసుకుంటానని ఆయన తమ పార్టీ ఆవిర్భావ సభలో ప్రకటించారు.ఒక విధంగా పవన్ ప్రకటన తమ క్యాడర్ లో విశ్వాసం నింపేందుకే అని అభిప్రాయం కూడా పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. అందుకే అనివార్యంగానే పవన్ కళ్యాణ్ ఆ ప్రకటన చేశారని అంటారు. అయితే, ఆ దిశగా జనసేన తరపు నుంచి ఇంకా పూర్తి స్పష్టత రాలేదు. అయినా, పార్టీ క్యాడర్ లో అదే విధంగా జనంలో మాత్రం పొత్తుల విషయంలో స్పష్టత ఉందని పరిశీలకులు అంటున్నారు. సుమారు 40 శాతం ఓటుతో పాటు సంస్థాగత నిర్మాణం ఉన్న టీడీపీ లేకుండా వైసీపీని ఎదుర్కోవడం అయ్యే పనికాదని జనసేన క్యాడర్ మాత్రమే కాదు సామాన్య ప్రజలు సైతంస్పష్టం చేస్తున్నారు.వైసీపీని ఓడించే శక్తి ఒక్క టీడీపీకి మాత్రమే ఉందని, రాజకీయ కార్యకర్తలు, సామాన్య ప్రజలు కూడా అర్ధం చేసుకున్నారు. అదే విధంగా, ఇటు టీడీపీ, జనసేన కార్యకర్తలకు కూడా క్లారిటీ ఉందని, అందుకే, టీడీపీతో పొత్తు పై మరింత స్పష్టత ఇవ్వాలని జనసేన స్థానిక నాయకుల పై ఆ పార్టీ క్యాడర్ వత్తిడి తెస్తోంది. అలాగే, క్రింది స్థాయిలో ఇప్పటి నుంచే ఉభయ పార్టీల కార్యకర్తలు కలిసి పనిచేస్తున్నారని, అదే విధంగా స్థానిక నాయకులు కూడా, భవిష్యత్ రాజకీయాలను దృష్టిలో ఉంచుకుని, కలిసి మెలసి పనిచేస్తున్నారని తెలుస్తోంది. నిజానికి, జనసేన, బీజేపీ మధ్య పొత్తు ఉన్నా, జనసేన క్యాడర్ టీడీపీతో, టీడీపీ క్యాడర్ జనసేనతో కలిసి పనిచేయడం వైపే మొగ్గు చూపుతున్నారు. బీజేపీ కలిసి వస్తే వస్తుంది లేదంటే లేదు, అవసరం అయితే వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీలను కలుపుకుని అయినా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా, చూడాలని జనసేన నాయకత్వం భావిస్తోంది.నిజానికి బహిరంగ ప్రకటన లేక పోయినా జనసేన, స్థానిక నాయకులు ఆ దిశగా ఇప్పటికీ అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.అందుకే పార్టీలతో సంబంధం లేకుండా, ప్రజలే, టీడీపీ పునాదిగా వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక వేదికను సిద్దం చేస్తున్నారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. నిజానికి, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో విసుగెత్తిన అన్ని వర్గాల ప్రజలు అటో ఇటో తేల్చుకోవాలని రాజకీయ పార్టీలను హెచ్చరిస్తున్నారు. సో.. పార్టీ పొత్తులు వ్యవహారం ఎలా ఉన్నా ప్రజలు మాత్రం ఇప్పటికే, ఒకటయ్యారని పరిశీలకులు భావిస్తున్నారు.