విజయవాడ, మే 19,
ఏపీలో వైసీపీ రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక పట్ల రాజకీయ వర్గాలలో విస్మయం వ్యక్తమౌతున్నది. రాష్ట్ర ప్రయోజనాలు, సామాజిక సమీకరణాలతో సంబంధం లేకుండా కేవలం అధినేత ఇష్టాయిష్టాలు, వ్యక్తిగత ప్రయోజనాలే లక్ష్యంగా అభ్యర్థుల ఎంపిక జరిగినట్లు అనిపిస్తున్నదని వారు విశ్లేషిస్తున్నారు. ఉన్న నాలుగు స్థానాలలో ఇద్దరు వేరే పార్టీ నుంచి జంప్ జిలానీ పద్ధతిలో వచ్చిన వారైతే మిగిలిన ఇద్దరూ తనతో పాటు ఆర్థిక నేరాలలో సహ నిందితులు కావడాన్ని ఎత్తి చూపుతున్నారు. వైసీపీ ప్రకటించిన నలుగురు అభ్యర్థులలో ఇద్దరు బీసీలు కాగా మిగిలిన ఇద్దరూ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు. అలాగే ప్రకటించిన ఇద్దరు బీసీ అభ్యర్థులూ కూడా తెలుగుదేశం పార్టీ నుంచి వలస వచ్చిన వారే. వారిద్దరిలో ఒకరు తెలంగాణకు చెందిన వారు. తెలంగాణకు చెందిన ఆర్ కృష్ణయ్యను జగన్ రాజ్యసభ అభ్యర్థిగా ప్రకటించడం వెనుక కూడా క్విడ్ ప్రోకో ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తెలంగాణ నుంచి రాజ్యసభకు కేసీఆర్ ఒక ఫార్మా కంపెనీ అధినేతను రాజ్యసభకు పంపనున్నారనీ, ఆ ఫార్మా కంపెనీ అధినేత వైసీపీ నాయకుడు విజయసాయి రెడ్డి వియ్యంకుడు కావడంతో అందుకు ప్రతిగా తెలంగాణ సీఎం సిఫారసు చేసిన ఆర్. కృష్ణయ్యను ఏపీ నుంచి రాజ్యసభకు పంపేందుకు జగన్ నిర్ణయించారని చెబుతున్నారుఇక బీసీ కోటాలో రాజ్యసభకు జగన్ ఎంపిక చేసిన మరో వ్యక్తి బీద మస్తాన్ రావు. ఆయన తెలుగుదేశం నుంచి వైసీపీలోకి వచ్చిన వలస పక్షి. బీద మస్తాన్ రావుది నెల్లూరు జిల్లా కావలి. ఈయన కావలి నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహించారు. గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరపున నెల్లూరు లోక్ సభ స్థానానికి పోటీ చేసి ఓడిపోయారు. టీడీపీలో తగిన ప్రాధాన్యం ఇవ్వలేదనే అసంతృప్తితో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. ఆయనకు జగన్ రాజ్యసభ టికెట్ ఇచ్చారు. ఇక మిగిలిన రెండు స్థానాలలో ఒకటి సిట్టింగ్ ఎంపీ విజయసాయిరెడ్డికే ఇచ్చారు.ఆయన జగన్ అక్రమాస్తుల కేసులో ఏ-2 అన్న సంగతి తెలిసిందే. ఇక నాలుగో స్థానం జగన్ అక్రమాస్తుల కేసులు వాదిస్తున్న న్యాయవాది నిరంజన్ రెడ్డికి ఇచ్చారు. ఇలా వైసీపీ నాలుగు రాజ్యసభ స్థానాలూ కూడా జగన్ వ్యక్తిగత ప్రయోజనాలతో ముడిపడి ఉన్న ఎంపికేనని రాజకీయ వర్గాలలో చర్చ నడుస్తోంది. క్విడ్ ప్రోకొ కింద తెలంగాణకు చెందిన ఆర్.లక్ష్మయ్యను ఏపీ నుంచి రాజ్యసభకు ఎంపిక చేసి కూడా బీసీ ఉద్ధరణ కోసమే అని చెప్పుకోవడం జగన్ కే చెల్లిందన్న వ్యాఖ్యలు వినవస్తున్నాయి.