గుంటూరు మే 19,
గత ఎన్నికల్లో జెయింట్ కిల్లర్స్ గా నిలిచి వైసీపీ విజయంలో కీలక రోల్ ప్లే చేసిన నేతలెవరూ ఈ సారి వైసీపీ అభ్యర్థులుగా ఆ నియోజకవర్గాల నుంచి పోటీ చేసేందుకు సిద్ధ పడటం లేదు. గత ఎన్నికలలో పవన్ కల్యాణ్ పై విజయం సాధించిన గ్రంథి శ్రీనివాస్ జగన్ తీరుపై తన అసంతృప్తిని బాహాటంగానే వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసేదే లేదంటూ తన సన్నిహితుల దగ్గర చెప్పుకుంటున్నారు. ఇప్పుడు ఆయన కోవలోకే మరో జెయింట్ కిల్లర్, మంగళగిరి స్థానం నుంచి తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ పై విజయం సాధించిన ఆర్కే చేరారు.ఈ సారి తాను పోటీలో ఉండననీ, మంగళగిరి స్థానాన్ని బీసీలకు వదిలేస్తాననీ ప్రకటించారు. అయితే ఆయన పోటీ చేయనని ప్రకటించడానికి కారణం బీసీలపై ప్రేమ కాదనీ, పోటీలో దిగినా పరాజయం తప్పదన్న భయమేననీ పరిశీలకులు అంటున్నారు. గత ఎన్నికలలో ఆర్కే తెలుగుదేశం అభ్యర్థి లోకేష్ పై దాదాపు 5 వేల ఓట్లతో విజయం సాధించారు. అప్పటికీ, ఇప్పటికీ నియోజకవర్గంలో పరిస్థితిలో బాగా మార్పు వచ్చిందని పరిశీలకులు చెబుతున్నారు. గత ఎన్నికలలో లోకేష్ విజయం సాధిస్తే ఏమేం జరుగుతాయని జనాలను భయపెట్టి ఓట్లు దండుకున్నారో.. అవన్నీ జగన్ హయాంలో జరగడంతో ఈ సారి ఆర్కేకు ఓట్లు రావడం అంత సులువు కాదని అంటున్నారు. ఆ గ్రహింపుతోనే బీసీలకు వదిలేస్తానంటూ పోటీ నుంచి తప్పుకుని పరువు కాపాడుకోవాలన్న ఉద్దేశంతోనే ఆర్కే ఈ నిర్ణయానికి వచ్చారని వివరిస్తున్నారు. నిజానికి గత ఎన్నికలలో ఆర్కే విజయానికి ఆయన సత్తా కంటే.. ఫ్యాన్ గాలి, ప్రత్యర్థి పార్టీలలో ఓట్ల చీలిక కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మంగళగిరి నుంచి పోటీ చేయాలని లోకేష్ అప్పట్లో తీసుకున్న నిర్ణయం సాహసోపేతమని అప్పట్లోనే పరిశీలకులు పేర్కొన్న సంగతి విదితమే. ఎందుకంటే మంగళగిరి స్థానం నుంచి తెలుగుదేశం అభ్యర్థి నిలబడిన స్థందర్భాలు చాలా తక్కువ. ఎప్పుడూ పొత్తులలో భాగంగా ఆ స్థానాన్ని వామపక్ష పార్టీలకు కేటాయించడాన్ని తెలుగుదేశం ఒక ఆనవాయితీగా కొనసాగిస్తూ వచ్చింది. ఎందుకంటే అక్కడ వామపక్ష పార్టీలకు ఒకింత పట్టు ఉంది.వామపక్ష పార్టీలు, జనసేన పొత్తు పెట్టుకుని ఆ ఎన్నికలలో పోటీ చేయడంతో ఓట్లు భారీగా చీలాయి. అంతే కాకుండా మంగళగిరిలో తెలుగుదేశం విజయావకాశాలు సంక్షిష్టమన్న నివేదికలను సైతం ఖాతరు చేయకుండా లోకేష్ సాహసం చేసి అక్కడే పోటీకి సిద్ధ పడ్డారు. ఆ ఎన్నికలలో 5 వేల ఓట్లతో లోకేష్ పరాజయం పాలయ్యారు. అక్కడ జనసేన, వామపక్షాల ఉమ్మడి అభ్యర్థికి పది వేల ఓట్లు వచ్చాయి. అంటే ఆర్కే విజయానికి ఓట్ల చీలికే కారణమని నిర్ధారణ అయ్యింది. అయితే ఇప్పుడు నాటికీ నేటికీ పరిస్థితుల్లో బాగా మార్పు వచ్చింది.విజయం తరువాత ఆర్కే ప్రజలకు అందుబాటులో లేకపోవడం, కరకట్టపై ఇళ్లు కూల్చేస్తారంటూ జనాలను అప్పట్లో భయపెట్టి విజయం సాధించిన ఆర్కే.. తాను గెలిచిన తరువాత ఇళ్ల కూల్చివేతను దగ్గరుండి చేయించడంతో ప్రజలు ఆయనపై ఆగ్రహంతో ఉన్నారు. మరో వైపు లోకేష్.. ఓడిన చోటే గెలవాలన్న పట్టుదలతో అక్కడి నుంచే పోటీ చేస్తానని ప్రకటించి.. ఓ నియోజకవర్గ ఇంచార్జిగా మంగళగిరిలో ప్రజలలో మమేకమౌతున్నారు. అలాగే గ్రామాల వారీగా పార్టీ పటిష్టతపై దృష్టి పెట్టారు. గతంలో సీఎం కుమారుడిగా.. మంత్రిగా ఆయన చుట్టూ సెక్యూరిటీ ఉండేది.. దాంతో ఆయన జనంతో ఇప్పటిలా మమేకం కాలేకపోయారు. అయితే ఇప్పుడు అలాంటి సెక్యూరిటీ లేకపోవడంతో లోకేష్ జనంతో మమేకమై నేరుగా వారితో ఇంట్రాక్ట్ అవుతూ సమస్యలు తెలుసుకుంటున్నారు. ఇది రానున్న ఎన్నికలలో లోకేష్ కు సానుకూలతను పెంచిందని పరిశీలకులు అంటున్నారు.