YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

తలక్రిందులైన జీవితం

తలక్రిందులైన జీవితం

ముంబై, మే 19,
షీనా బోరా హత్య కేసు అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కన్నతల్లే కూతుర్ని చంపేసిన వైనం అందర్నీ విస్మయానికి గురి చేసింది. 2012లో తన రెండో భర్త, డ్రైవర్ సహకారంతో కూతుర్ని హత్య చేసిన ఇంద్రాణీ ముఖర్జీ.. 2015 నుంచి జైలు జీవితం గడుపుతున్నారు. ఎట్టకేలకు ఆమెకు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అసలు ఎవరీ ఇంద్రణీ ముఖర్జీ..? కూతుర్నే ఆమెకు హతమార్చాల్సి వచ్చిందో తెలియాలంటే ఈ కథనం చదవాల్సిందే..2012లో షీనా బోరాను హత్య చేయగా.. మూడేళ్ల తర్వాత ఓ కేసులో ఇంద్రాణీ ముఖర్జీ కారు డ్రైవర్‌ శ్యామ్‌ రాయ్‌‌ను పోలీసులు అరెస్ట్ చేయడంతో ఈ హత్య కేసు గురించి తెలిసింది. షీనా బోరాను ఇంద్రాణీ గొంతు నులిమి చంపారని.. ఆమెను తన చెల్లెలిగా పరిచయం చేసుకున్నారని డ్రైవర్ పోలీసులకు తెలిపాడు. ఇంద్రాణీ ముఖర్జీ మొత్తం ముగ్గుర్ని పెళ్లాడింది. ఆమెకు మొదటి భర్త ద్వారా షీనాతోపాటు మైఖేల్‌ అనే కుమారుడు జన్మించారు. అతడి నుంచి విడిపోయిన తర్వాత పిల్లలిద్దర్నీ గువాహటిలోని తన తల్లిదండ్రుల వద్ద ఉంచిన ఇంద్రాణీ.. సంజీవ్‌ ఖన్నా అనే వ్యక్తిని పెళ్లాడింది. కొన్నాళ్లకు అతడి నుంచి విడిపోయింది. అనంతరం మీడియా ఎగ్జిక్యూటివ్‌ అయిన పీటర్‌ ముఖర్జియాను వివాహం చేసుకుంది. అప్పటికే పెద్దదయిన షీనా.. ముంబైకి వచ్చి ఇంద్రాణిని కలుసుకుంది. తన మొదటి పెళ్లి, పిల్లల గురించి పీటర్ దగ్గర దాచిపెట్టిన ఇంద్రాణి.. తన కూతుర్ని చెల్లెలిగా వారికి పరిచయం చేసింది. ఈ క్రమంలో పీటర్ మొదటి భార్య కుమారుడైన రాహుల్‌తో షీనా సన్నిహితంగా మెలగడం మొదలుపెట్టింది. తన కూతురు వ్యవహరిస్తోన్న తీరు ఇంద్రాణికి నచ్చలేదు. ఇద్దరి మధ్య విబేధాలు రావడంతో.. పీటర్‌కు అసలు విషయం చెబుతానంటూ.. షీనా బ్లాక్‌మెయిలింగ్ మొదలుపెట్టింది. ఆమె తీరుతో విసిగిపోయిన ఇంద్రాణీ ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని భావించింది. ఇందుకోసం ప్లాన్ చేసి.. తన రెండో భర్త సంజీవ్‌, డ్రైవర్‌ శ్యామ్‌ రాయ్‌ సాయంతో షీనాను హత్య చేసింది. ఈ కేసులో ఇంద్రాణీ, సంజీవ్‌లను అరెస్ట్ చేసిన పోలీసులు.. అనంతరం మూడో భర్త పీటర్‌ ముఖర్జియాను సైతం అదుపులోకి తీసుకున్నారు. జైల్లో ఉండగానే పీటర్ ఆమెకు విడాకులు ఇచ్చాడు. 2020లో పీటర్‌కు బెయిల్ వచ్చింది. ఇంద్రాణీ జైల్లో శిక్ష పొందుతున్న సమయంలో.. తన కుమార్తె ప్రాణాలతోనే ఉందని సీబీఐకి లేఖ రాసింది. షీనా బోరాను జైలు అధికారి ఒకరు కశ్మీర్‌లో చూశానని చెప్పిందని ఆ లేఖలో పేర్కొన్న ఇంద్రాణి.. ఈ విషయమై దర్యాప్తు చేయాలని సీబీఐని కోరింది. ఇంద్రాణి ముఖర్జీ బెయిల్ మీద బయటకు రావడం కోసం అనేక సార్లు ప్రయత్నించి విఫలమైంది. ఆరున్నరేళ్లపాటు శిక్ష అనుభవించాక ఎట్టకేలకు ఆమెకు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది.1996లో ఐఎన్ఎక్స్ సర్వీసెస్ ప్రయివేట్ లిమిటెడ్ పేరిట కోల్‌కతాలో రిక్రూట్‌మెంట్ కంపెనీని ఏర్పాటు చేసిన ఇంద్రాణీని 2008లో ది వాల్ స్ట్రీట్ జర్నల్ ‘50 విమెన్ టు వాచ్‌’లో ఒకరిగా గుర్తించింది. కానీ ఐఎన్ఎక్స్ మీడియాలో అక్రమాలు, కూతురి హత్య కేసు కారణంగా ఆమె జీవితం తలకిందులైంది.

Related Posts