YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

సీఎం వద్దు.. చంద్రబాబు ప్రతిపాదనపై చర్చోపచర్చలు

 సీఎం వద్దు.. చంద్రబాబు ప్రతిపాదనపై చర్చోపచర్చలు

కడప, మే 19,
ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉంది. కానీ ఆంధ్రా రాజకీయాలు మాత్రం ఇప్పటి నుంచే ఎన్నికల చుట్టూ తిరుగుతున్నాయి. ముందస్తు ఎన్నికలు వస్తాయనే ఊహాగానాలు దీనికి ఒక కారణమైతే.. ఇప్పటి నుంచే ప్రజల్లోకి బలంగా వెళ్లాలనే రాజకీయ పార్టీల వ్యూహం మరొకటి. గత ఎన్నికల్లో 151 స్థానాల్లో ఘన విజయం సాధించిన వైఎస్సార్సీపీ.. వచ్చే ఎన్నికల్లోనూ తమదే గెలుపు అనే ధీమాతో ఉంది. కానీ మరోవైపు ప్రతిపక్ష టీడీపీ మాత్రం ఎలాగైనా జగన్ సర్కారును గద్దె దించాలనే పట్టుదలతో ఉంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారనేది టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు చెబుతున్న మాట. రాష్ట్రాన్ని జగన్ అప్పుల ఊబిలోకి నెట్టారని.. ఏపీ మరో శ్రీలంక అవుతోందని టీడీపీ, జనసేన నేతలు వాపోతున్నారు. రాష్ట్రంలో అభివృద్ధి లేదు.. పరిశ్రమలు రావడం లేదు... అప్పులు చేసి ప్రజలకు డబ్బులు ఇవ్వడమేనా పరిపాలన అంటే..? అని ప్రతిపక్ష నేతలు జగన్ సర్కారు తీరును విమర్శిస్తున్నాయి. జగన్ మరోసారి అధికారంలోకి వస్తే రాష్ట్రం అంధకారంలోకి కూరుకుపోతందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే జనసేన-బీజేపీతో పొత్తుతో కలిసి ముందుకు వెళ్తుండగా.. టీడీపీ ఒంటరిగా ఉంది. ఎన్నికల్లో ముక్కోణ పోరు జరిగితే విపక్షాల మధ్య ఓటు బ్యాంకు చీలిపోయి అధికారంలో ఉన్న జగన్‌ పార్టీకే లబ్ధి చేకూరుతుంది. అందుకే విపక్షాలన్నీ ఒక కూటమిగా పోటీ చేయాలనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. బీజేపీ-జనసేన-టీడీపీ కలిసి బరిలోకి దిగితే వైఎస్సార్సీపీకి గట్టి పోటీ ఇవ్వడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పొత్తులపై సంకేతాలు ఇచ్చారు. ఓటు బ్యాంకును చీల్చం అనడం ద్వారా జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా దానికి సానుకూలంగా స్పందించారని అనుకోవచ్చు. కానీ బీజేపీ మాత్రం చంద్రబాబుతో పొత్తుకు ససేమిరా అంగీకరించడం లేదు. ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఇదే విషయాన్ని కుండబద్ధలు కొట్టారు. కుటుంబ పార్టీలతో తమకు పొత్తు ఉండదని.. కేవలం జనసేనతో మాత్రమే కలిసి నడుస్తామని ఆయన స్పష్టం చేశారు. టీడీపీతో పొత్తు విషయంలో కమలనాథులందరిదీ ఇదే వైఖరి.కానీ చంద్రబాబు మాత్రం జగన్ సర్కారును గద్దె దింపడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. తనకు ముఖ్యమంత్రి పదవి అవసరం లేదు కానీ రాష్ట్రానికి పట్టిన శని జగన్‌ను వదిలించుకోవాలన్నారు. తాను ఇప్పటికే 14 ఏళ్ల ముఖ్యమంత్రిగా పని చేశానని... తనకు సీఎం పదవి అక్కర్లేదంటూ.. చంద్రబాబు తన లక్ష్యమేంటో స్పష్టం చేశారు. తద్వారా బీజేపీకి పొత్తుపై సంకేతాలు ఇచ్చారు. మూడు పార్టీలు కలిసి ఎన్నికల్లో బరిలోకి దిగితే తాను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉండకపోయినా ఫర్వాలేదని పరోక్షంగా చెప్పారు. పవన్ కళ్యాణ్ తమ సీఎం అభ్యర్థి అని బీజేపీ-జనసేన కూటమి గతంలో చెప్పింది. తనకు సీఎం పదవి అక్కర్లేదని పదే పదే చెప్పడం ద్వారా చంద్రబాబు ఏం సంకేతాలు ఇస్తున్నారో అర్థం అవుతోందా..?

Related Posts